జీవన్మరణ సమస్యగా మారిన నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కొత్త నినాదం అందుకుంది. పెద్దాయనే.. తమ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రచారం ప్రారంభించింది. కీలకపోరులో హస్తంపార్టీకి ఈ స్లోగన్ వర్కవుట్ అవుతుందా? ఈ నినాదానికి ఏకాభిప్రాయం కాంగ్రెస్‌లో సాధ్యమేనా?
అమ్ములపొదిలోని అస్త్రాలు తీస్తోన్న కాంగ్రెస్!
ఒకవైపు ఎండలు మండిపోతుంటే.. మరోవైపు నాగార్జునసాగర్‌లో ఉపఎన్నిక వేడి సెగలు రేపుతోంది. ఈ రాజకీయ అగ్నిఎవరికి మోదం కలిగిస్తుందో.. ఇంకెవరికి ఖేదంగా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి కె. జానారెడ్డి బరిలో ఉన్నారు. 2018 ఎన్నికల్లో ఓడినా.. ఈ దఫా ఉపఎన్నికలో మాత్రం ఆయన గెలవాలన్న పట్టుదల కాంగ్రెస్‌లో కనిపిస్తోంది. పెద్దాయనకు సైతం ఇది జీవన్మరణ సమస్యగా మారింది. 35 ఏళ్లపాటు ఇదే ప్రాంతం నుంచి జానారెడ్డికి గెలుపోటములు పలకరిస్తున్నాయి. అవన్నీ ఇప్పుడు చర్చలోకి రావడం లేదు. జానారెడ్డి గెలిస్తేనే ఆయనకు రాజకీయ భవిష్యత్ ఉంటుందని.. కాంగ్రెస్ రాష్ట్రంలో నిలబడుతుందనే టాక్ ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయింది. అందుకే తమ అమ్ముల పొదిలోని అస్త్రశస్త్రాలను బయటకు తీస్తోంది కాంగ్రెస్.
జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రచారం!
సీఎం అభ్యర్థిగా బలంగా చెబుతున్న నేతలు!
కాంగ్రెస్ పార్టీలో అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి నేతలు వెనకాడరు. హైకమాండ్ ఆదేశిస్తే తప్ప నోటికి తాళాలు వేయరనే ప్రచారం ఉంది. అలాంటి కాంగ్రెస్ నాగార్జునసాగర్ ఉపఎన్నికలో కలిసి నడుస్తోంది. కేడర్ ఆశ్చర్యపోయే విధంగా ప్రచారం సాగిస్తోంది. అయితే.. బైఎలక్షన్‌లో గెలవడానికి ఆ వ్యూహం సరిపోదని భావించారో ఏమో కొత్త నినాదం అందుకున్నారు. పెద్దాయన జానారెడ్డే కాంగ్రెస్ నుంచి సీఎం అభ్యర్థిగా ప్రచారం మొదలుపెట్టారు నాయకులు. ఈ ఉపఎన్నిక సీఎం అభ్యర్థిని నిర్ణయించే పోరు కాకపోయినా.. 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఒక పాచిక అయితే విసిరారు. 2018 ఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారం జరిగినా.. పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కాంగ్రెస్‌లో ఇది జరిగే పనేనా అని అనుకున్నారు. ఆ ఎన్నికల్లో జానారెడ్డి ఓడిపోవడంతో ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారు. ఇప్పుడు నాగార్జునసాగర్ ఉపఎన్నికలో మాత్రం 2018 కంటే బలంగా పెద్దాయనే సీఎం అభ్యర్థి అని ప్రచారం మొదలుపెట్టేశారు.
ఎంపీ కోమటిరెడ్డి కామెంట్స్‌కు వ్యతిరేకంగా సౌండ్, రీసౌండ్ లేదా?
వ్యూహాత్మకంగానే జానారెడ్డిని ప్రొజెక్ట్ చేస్తున్నారా?
జానారెడ్డికి మద్దతుగా సాగర్‌లో ప్రచారం చేస్తున్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటి నుంచి ఈ మాటలు బయటకొచ్చాయి. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలోనే ఆయన ఈ నినాదం ఎత్తుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గతంలో ఒకసారి ఉత్తమ్ ఇదే విధంగా కామెంట్స్ చేశారు కూడా. అందుకే కోమటిరెడ్డి ఎత్తుకున్న నినాదంపై ఆయన నుంచి ప్రతికూలత రాలేదు. ఒక్క ఉత్తమే కాదు ఇతర కాంగ్రెస్ నాయకుల నుంచి కూడా వ్యతిరేకంగా సౌండూ రీసౌండూ లేదు. కస్సుమని రియాక్ట్ అయ్యే కొందరు నేతలు సైతం పెదవి విప్పడం లేదు. దీంతో జానారెడ్డి గెలుపుకోసం కాంగ్రెస్ నాయకులు వ్యూహాత్మకంగానే ఈ నినాదం ఎత్తుకున్నారని ప్రచారం జరుగుతోంది. సాగర్‌లో ఇప్పుడు గట్టెక్కితే.. 2023కు ఇంకా సమయం ఉంటుంది. అప్పటిలోగా ఏదైనా జరగొచ్చు. కానీ.. జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రొజెక్ట్ చేస్తే అది ఓటర్లకు పాజిటివ్ సిగ్నల్స్ పంపుతుందన్నది కాంగ్రెస్ నాయకుల ఆలోచన. మరి.. ఈ స్లోగన్ హస్తం పార్టీకి ఏ మేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.