బీజేపీ వద్దన్నా.. మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అఖిలపక్ష సమావేశానికి వెళ్లారు. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించిన ఆయనపై చర్యలు ఉంటాయా? కాషాయ శిబిరాన్ని వదిలేయడానికే.. మోత్కుపల్లి ఈ ఎత్తుగడ వేశారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? మాజీ మంత్రి వివరణపై బీజేపీ సంతృప్తి చెందిదా.. లేదా?
బీజేపీకి దూరం అయ్యారన్న అభిప్రాయం ఉందట
టీడీపీని వీడి.. కాషాయ కండువా కప్పుకొన్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు.. కొంతకాలంగా బీజేపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కాన్ఫరెన్స్‌లు పెట్టమని అడిగినా ఆయన నిరాకరించారట. కోవిడ్ నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాక.. బీజేపీకి ఇంకా దూరం అయ్యారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ జాతీయ సహ ప్రధాన కార్యదర్శి హైదరాబాద్ వచ్చారు. పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం అయ్యారు. ఆ భేటీకి రావాలని ఆహ్వానం పంపినా.. ఆరోగ్య కారణాలతో మోత్కుపల్లి రాలేదని చెబుతున్నారు. ఈటల బీజేపీలో చేరిన సందర్భంగా ఆయనకు బాసటగా అనేక మంది కమలనాథులు మాట్లాడినా.. ఆ జాబితాలో మోత్కుపల్లి చేరలేదు.
బీజేపీ బహిష్కరించినా.. అఖిలపక్ష భేటీకి వెళ్లారు
తాజాగా సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి మోత్కుపల్లి నర్సింహలు హాజరయ్యారు. ఆల్‌పార్టీ భేటీని బీజేపీ బహిష్కరించింది. ఆ సమావేశానికి మోత్కుపల్లికి ఆహ్వానం ఉందని తెలియడంతో పార్టీ నేతలు ఆయనకు ఫోన్ చేసి బీజేపీ నిర్ణయం గురించి చెప్పారట. అయినప్పటికీ అఖిలపక్ష భేటీకి వెళ్లారు మాజీ మంత్రి. ఈ పరిణామంపై పార్టీ నేతలు గుర్రుగా ఉన్నట్టు సమాచారం.
బీజేపీకి రాం రాం చెబుతారని ప్రచారం
బీజేపీలోనే ఉంటానని ప్రకటన
ఇదే సమయంలో మోత్కుపల్లి గురించి బీజేపీలో మరో చర్చ జరుగుతోందట. త్వరలో ఆయన బీజేపీకి రాంరాం చెబుతారనే ప్రచారం నడుస్తోంది. ఆయన పార్టీలో కొనసాగకపోవచ్చని ముఖ్యనేతలు అభిప్రాయపడుతున్నారట. మోత్కుపల్లి మాత్రం తాను బీజేపీలోనే ఉంటానని చెబుతున్నారు. పైగా బీజేపీ తరఫునే అఖిలపక్ష సమావేశానికి వెళ్లినట్టు ప్రకటించారు. అంతేకాదు.. ఆ మీటింగ్‌కు వెళ్లి బీజేపీని రక్షించానని కూడా చెప్పారు. తనను విమర్శించిన వారికి కూడా ఈ సందర్భంగా పరోక్షంగా చురకలు వేశారు మాజీ మంత్రి. వ్యాపారాల కోసం పార్టీలు మారే వ్యక్తిని కాదని తెలిపారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ను ఎవరో తప్పుదారి పట్టిస్తున్నారని కూడా సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ వాదన.. మోత్కుపల్లి ఆలోచన కలవడం లేదా?
బీజేపీ కోర్టులోకి బంతిని నెట్టిన మోత్కుపల్లి
ఈ విషయంలో పార్టీ వాదన.. మోత్కుపల్లి ఆలోచనా ఎక్కడా మింగిల్ కావడం లేదు. పైగా అఖిలపక్ష భేటీకి వెళ్లడాన్ని సమర్ధించుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ కాషాయ శిబిరంలో మరింత చర్చకు దారితీస్తున్నాయి. బంతిని బీజేపీ కోర్టులోకే నెట్టేశారు. పార్టీ వివరణ అడక్కముందే తనదైన శైలిలో ప్రకటన చేసి కమలనాథులను ఇరకాటంలో పెట్టారన్న అభిప్రాయం కలుగుతోంది. మరి.. మోత్కుపల్లి విషయంలో బీజేపీ ఏం చేస్తుందో చూడాలి.