ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్‌కు కొత్త పాఠాలు నేర్పిందా? ప్రజల సమస్యలతోపాటు.. సొంత పార్టీలోని సమస్యలు బోధపడ్డాయా? బీజేపీ కోసం పనిచేసే వారు ఎవరు? శల్య సారథ్యం చేస్తోంది ఎవరో గుర్తించారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందట..!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ముగిసిన తర్వాత పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తిగా మారింది. ఈ పాదయాత్ర ఆయనకు ఎన్నో పాఠాలు నేర్పిందట. రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియడం ఒక ఎత్తు అయితే.. పార్టీ పరిస్థితిపై సంజయ్‌కు మరింత క్లారిటీ వచ్చిందని సమాచారం. బీజేపీ నేతల్లో ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు? ఎవరు బలహీన నాయకులు అన్నది స్పష్టత వచ్చిందట.
గతంలో కరీంనగర్‌కే సంజయ్ పరిమితం..!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు అయ్యేంత వరకు బండి సంజయ్ కరీంనగర్‌కే పరిమితం. కరీంనగర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత కూడా ఆ జిల్లాపైనే ఎక్కువ దృష్టిపెట్టారు. అలాగే బీజేపీలో పెద్ద బాధ్యతలు నిర్వహించిన చరిత్రా లేదు. రాష్ట్రస్థాయిలో సంజయ్‌కు పార్టీలో కానీ.. బయట కానీ.. విస్తృత పరిచయాలు లేవు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యేటప్పటికి సంజయ్ ఒక పార్టీ ఎంపీ మాత్రమే. బీజేపీ రాష్ట్ర స్థాయి నేతలకు ఆయన పరిచయం.. ఆయన రాష్ట్ర కార్యాలయానికి తెలుసు. ఇక కరీంనగర్ ప్రజలకు సుపరిచితం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక.. ఆయన పనిచేయాల్సిన పరిధి పెరిగింది. రోజు రోజుకీ పరిచయాలు విస్తృతం అవుతున్నాయి. కానీ.. ఎక్కడో ఒక లోటు.. ఏదో తెలియని వెలితి ఆయనలో ఉండిపోయిందన్నది పార్టీ వర్గాలు చెప్పేమాట.
ఎన్నికలు.. ఉపఎన్నికలు చరిష్మాను పెంచాయి..!
పనిచేసేదెవరో.. మాటలు చెప్పేదెవరో పాదయాత్రలో తెలిసిందా?
దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు.. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సంజయ్ చరిష్మాను పెంచడంతోపాటు.. పార్టీ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఒక అవగాహన ఏర్పడింది. ఇప్పుడు పాదయాత్ర చేయడం ద్వారా పార్టీలో ఎవరేంటో తెలిసి వచ్చిందట. మొదటి విడత యాత్ర ముగిసేంత వరకు తన వెన్నంటి ఉన్నది ఎవరు? అటూ ఇటూ కాకుండా.. గోడ మీద పిల్లిలా ఉన్నది ఎవరో తెలిసిందట. అలాగే ఎవరు మాటలు చెబుతారు.. ఎవరు పనిచేస్తారో కూడా ఆయనకు క్లారిటీ వచ్చిందట.
ముందే అవగాహన ఉంటే.. వాళ్లనే పార్టీ కమిటీలలోకి తీసుకునేవారా?
ఇప్పుడు బండి సంజయ్ తెలుసుకున్న విషయాలపై ముందే అవగాహన ఉంటే.. ప్రస్తుతం బీజేపీతోపాటు పార్టీ అనుబంధ కమిటీలలో ఉన్నవారిలో చాలా మందికి చోటు దక్కేది కాదని కాషాయ శిబిరంలో చర్చ జరుగుతోంది. పనిచేసే వాళ్లను టీమ్‌లోకి తీసుకుని.. మాటలు చెప్పేవారిని దూరం పెట్టేవారని ఓపెన్‌గానే మాట్లాడుకుంటున్నారట. సంజయ్ పాదయాత్రలో యువత ఎక్కువగా పాల్గొన్నట్టు గుర్తించారట. కొత్తవారు కూడా పార్టీతో టచ్‌లోకి వచ్చారట. రాబోయే రోజుల్లో ఈ కొత్త ముఖాలు బీజేపీలో కీలకంగా మారతాయని అనుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలోని వివిధ కమిటీలలో ఉన్న వారు తెరవెనక్కి వెళ్లడం ఖాయమని టాక్. అయితే సంజయ్ దృష్టిలో మంచి మార్కులు పొందింది ఎవరు? మైనస్ మార్కులు వచ్చింది ఎవరికి అన్నది ఉత్కంఠగా మారింది. మరి… రానున్న రోజుల్లో పాదయాత్ర ప్రభావం పార్టీపై ఎలా ఉంటుందో చూడాలి.