వీళ్లు అనుమానిస్తున్నదే అక్కడ జరిగిందా? తీగ లాగితే డొంక బయట పడుతుందనే భయం మొదలైందా? అందుకే తెర వెనక ప్రయత్నాలు మొదలుపెట్టారా? ఇది వారి ఆలోచనా.. లేక వారి వెనకున్న వారి ఆలోచనా? తప్పించుకునేందుకు ఆదిలోనే తోవలు వెతుకుతున్నారా?
నిధుల గోల్‌మాల్ వెనకున్న పెద్దలు బయటకొస్తారనే ‘రాజీ’ ప్రయత్నాలు?
జగన్ ప్రభుత్వం నాటి టీడీపీ సర్కార్ హయాంలో జరిగిన అక్రమాలు తవ్వే పని నిరాటంకంగా కొనసాగిస్తోంది. ఒకటొకటిగా దర్యాప్తు చేయడం.. కేసులు నమోదు కావడం చకచకా జరిగిపోతున్నాయి. అలాంటి వాటిల్లో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థలో నిధుల గోల్‌మాల్ ఒకటి. విచారణ జరిగితే వ్యక్తులు.. దాని వెనకున్న అప్పటి పెద్దలు బయటకు వస్తారని అనుకున్నారో ఏమో.. రాజీ ప్రయత్నాలు తెరపైకి తెస్తున్నారట.
రూ. 241 కోట్లు షెల్ కంపెనీల్లోకి మళ్లించారా?
‘రాజీ’ కోసం ప్రభుత్వ పెద్దలను కలిసే యత్నం?
యువతకు నైపుణ్యాలు కల్పించే ఉద్దేశంతో.. సీమెన్స్ అనే సంస్థ కార్పొరేట్ ఫండ్ కింద ముందుకు వచ్చింది. ఈ సంస్థ 90 శాతం నిధులు సమకూర్చితే రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 10 శాతం అంటే సుమారుగా 370 కోట్ల 78 లక్షలు మ్యాచింగ్ గ్రాంట్‌గా ఇచ్చింది. ప్రాజెక్టు అమలు సమయంలో మౌలిక సదుపాయాలు, లాబ్‌లు, సాఫ్ట్‌వేర్, ఇతర వనరులు సమకూర్చుకునేందుకు విడుదలైన సొమ్ములో సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలు నిధులు పక్కదారి పట్టించాయన్నది ఆరోపణ. ఇలా మొత్తం 241 కోట్ల రూపాయలను షెల్ కంపెనీల్లోకి మళ్లించారని ప్రస్తుతం ఉన్న స్కిల్ డెవలెప్‌మెంట్ సంస్థ చేయించిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో తేలింది. ఆ విధంగా APSSDC సిఫారసు CID చేతికి వెళ్లింది. దాంతో డిజైన్‌టెక్ సంస్థ ప్రతినిధులు రాజీ ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారని అమరావతి వర్గాల్లో టాక్.
Read: ఆంధ్రాలో థియేటర్స్ రీఓపెన్… రిలీజ్ కు సిద్ధంగా సినిమాలు
ఎవరో డైరెక్షన్‌తో డిజైన్‌టెక్ బృందం రంగంలోకి దిగిందా?
సీమెన్స్ ప్రాజెక్టుపై అప్పటి ప్రభుత్వమే క్యాబినెట్‌లో నిర్ణయం తీసుకోవడంతో.. చాలా మంది నాయకులు, అధికారుల పేర్లు బయటకు వస్తాయని APSSDC పెద్దలు చెబుతున్నారు. అందుకే డిజైన్‌టెక్ బృందం ఎవరో డైరెక్షన్‌తో రంగంలోకి దిగినట్టు అనుమానిస్తున్నారు. అంతా అనుకుంటున్నట్టు.. అనుమానిస్తున్నట్లే జరిగి ఉంటే పెద్ద చేపలు చిక్కినట్టేనని ప్రభుత్వం భావిస్తోంది. పక్కా దర్యాప్తుతో పక్కాగా బుక్ అవుతాం అనుకున్న వారి డైరెక్షన్‌లో డిజైన్‌టెక్ ఎంట్రీ ఇస్తున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయి. మిగిలిన చాలా కేసుల్లో జరిగిన రాజీ యత్నాలు ఇక్కడ జరుగుతుండటంతో.. అసలు విషయం గట్టిగానే ఉన్నట్టు భావిస్తున్నారు.
తప్పు చేయకపోతే ‘రాజీ’ ప్రయత్నాలు ఎందుకు?
తప్పు చేయకపోతే రాజీ ప్రయత్నాలు చేయటం ఎందుకు అని APSSDC వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. జరిగింది ఏంటో.. షెల్ కంపెనీలకు నిధులు మళ్లాయో లేదో సీఐడీ విచారణలో తేలిపోతుంది కదా.. అలా కాకుండా మా వాదన వినండి అని ప్రభుత్వాన్ని పెద్దలను కలిసే ప్రయత్నం చేయటం రాజకీయాలు చేయటానికే అని చెబుతున్నాయి. దాంతో రానున్న రోజుల్లో ఈ కేసులో బయటపడే పెద్ద తలకాయలు ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది.