ఏపీ రాజకీయాల ముఖచిత్రం మారుతోందా…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనసులు మారుతున్నాయా? పాత స్నేహాలు నెమరేసుకుంటున్నారా? కొత్త సమీకరణాలకు సరికొత్తగా తెర లేస్తోందా? ఉమ్మడి శత్రువుపైకి కలిసికట్టుగా దండెత్తబోతున్నారా? ఏపీ రాజకీయ ముఖచిత్రంలో మార్పులకు ఈ కలయికలు సంకేతామా.?
అంతా ఏకమయ్యే అజెండాపై ప్రతిపక్షాలు ఫోకస్?
Also Read
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ఇది అందరికీ తెలిసిందే.. ఈ మధ్య అందరూ చూస్తోందే. ఏపీలో అదే సీన్ మళ్లీ రిపీట్ కాబోతోందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వైసీపీ చేతిలో కకావికలమైన విపక్షాలు ఒకే గూటికి చేరే ఆలోచన చేస్తున్నాయా? అనే విధంగా ఈ మధ్య జరుగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్‌ను ఢీ కొట్టేందుకు అందరూ ఏకం కావాల్సిన అజెండాను ప్రతిపక్షాలు సీరియస్‌గా పరిశీలిస్తున్నాయా? అనిపిస్తోంది.
2019 ఎన్నికల్లో వైసీపీ స్వింగ్.. మిగతా పక్షాలు చిత్తు!
2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, లెఫ్ట్ పార్టీలు విడివిడిగా పోటీ చేశాయి. టీడీపీ, బీజేపీలతో తెగదెంపులు చేసుకున్న జనసేన.. లెఫ్ట్‌తో కలిసి పోటీ చేసింది. జనసేనతో పొత్తు పెట్టుకోవాలని పార్టీలో అంతర్గతంగా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా పట్టించుకోని జగన్ సోలోగా ఎన్నికలు వెళ్లి సింగిల్ హ్యాండ్‌తో విక్టరీ కొట్టేశారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ 23 సీట్లకు పరిమితం అయితే… బీజేపీ, వామపక్షాలు జీరో అయ్యాయి. జనసేన సచ్చీచెడీ ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. వైసీపీ స్వింగ్‌లో విపక్షాలు చిత్తుచిత్తు అయ్యాయి ఆ ఎన్నికల్లో.
సీఎం జగన్‌ను ఢీకొట్టడానికి విపక్షాలను టీడీపీ ఏకం చేస్తుందా?
ఏపీలో సీఎం జగన్ స్పీడ్ మీద ఉన్నారు. లక్ష కోట్ల రూపాయలను వివిధ పథకాల పేరుతో నేరుగా జనానికి చేర్చిన జగన్.. పార్టీ పునాదులను పటిష్టం చేసుకుంటున్నారు. జగన్ ఢీకొట్టడానికి ప్రతిపక్షాలను ఏకం చేయడం టీడీపీకి వెన్నతోపెట్టిన విద్య. ఈ విషయంలో ఆ పార్టీకి విశేషమైన అనుభవం ఉంది. 2004లో కాంగ్రెస్ తో కలిసిన టీఆర్ఎస్, లెఫ్ట్ పార్టీలను 2009కి వచ్చేసరికి తనవైపు తిప్పుకుని మహాకూటమి కట్టారు చంద్రబాబు.
ముస్లిం మహిళ కుటుంబానికి న్యాయం చేయాలని విపక్షాలు డిమాండ్!
2014 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేశాయి. తర్వాత ఎవరిదారి వాళ్లది అయ్యింది. ఇప్పుడు మళ్లీ ప్రతిపక్షాలను ఏకంచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? అనిపిస్తోంది. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం ఎర్రబాడులో ఏడాదిన్నర క్రితం ముస్లిం మహిళ హత్యకు గురైంది. ఆమె కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతూ కొంతకాలంగా ఆ వర్గం ఆందోళన చేస్తోంది. వీరికి మద్దతుగా మంగళవారం టీడీపీ, జనసేన, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఆ గ్రామానికి వెళ్లాయి. చిన్నాచితకా నేతలు కాకుండా టీడీపీ నుంచి లోకేష్, సీపీఐ నుంచి రామకృష్ణ, కాంగ్రెస్ నుంచి తులసిరెడ్డి, జనసేన జిల్లా నాయకులు వెళ్లిన వారిలో ఉన్నారు.
టీడీపీని దృష్టిలో పెట్టుకునే జనసేనాని కామెంట్?
జనసేన బీజేపీతో పొత్తులో ఉంది. టీడీపీ, కాంగ్రస్ పాల్గొనే కార్యక్రమాల్లో బీజేపీ అసలు ఉండదు. కానీ బీజేపీ మిత్రపక్షం జనసేన ఆ పార్టీ లేకుండానే మిగిలిన పార్టీలతో కలిసి ఈ కార్యక్రమానికి వెళ్లింది. ఎన్నికలకు ముందు టీడీపీ మీద తీవ్ర వ్యతిరేకతను కనబర్చిన జనసేనాని పవన్ కల్యాణ్ వాయిస్ కూడా మారినట్టు కనిపిస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో పవన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఒక కులాన్ని టార్గెట్ చేయడం మంచిదికాదని తప్పుపట్టారు. ఇది టీడీపీని దృష్టిలో పెట్టుకుని చేసిందేనని విశ్లేషణలు జరిగాయి.
లెఫ్ట్ పార్టీలకు మిగిలింది టీడీపీయేనా?
జనసేన దూరం కావడంవల్ల గత ఎన్నికల్లో దాదాపు 30 సీట్లలో ఓడిపోయామనే లెక్కలు టీడీపీ వేసుకుంది. ఆ పార్టీ దూరం కావడంవల్ల జరిగిన నష్టాన్ని దృష్టిలో పెట్టుకున్న టీడీపీ ఎక్కడ అవకాశం చిక్కినా మళ్లీ చెట్టపట్టాల్‌కు రెఢీ అయినా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్నా…. ఆ రెండు పార్టీలు ఎక్కడా కలిసి పెద్ద కార్యక్రమాలు చేసిందిలేదు. లెఫ్ట్ పార్టీలలో సీపీఐ చూపు టీడీపీవైపు ఉంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ టీడీపీకి మొదటి నుంచి సానుకూలం అనే ముద్ర ఉంది. ఈ మధ్య టీడీపీ చేపట్టిన ప్రతి కార్యక్రమానికి రామకృష్ణ మద్దతు ఇవ్వడమో… లేక ఆయనా దాన్ని ఫాలో కావడమో చేస్తున్నారు. ఎన్నికల్లో వచ్చే ఫలితాలు ఎలా ఉన్నా… ఆచితూచి…. సుధీర్ఘమైన… లోతైన విశ్లేషణ తర్వాత నిర్ణయం తీసుకునే సిపిఎం కూడా ఈ జట్టులో కలుస్తుందా? అనేది చూడాలి. విభజిత రాష్ట్రంలో వామపక్షాలు ఉనికి నిరూపించుకోలేకపోయాయి. టీడీపీలాంటి పెద్ద పార్టీలతో కలిస్తే రెండో మూడో సీట్లు వస్తే చాలు అనుకునే పరిస్థితి ఆ పార్టీలది. జనసేనతో కలిసి వైసీపీ, టీడీపీలకు గట్టి ప్రత్యామ్నయం ఏర్పాటు చేయాలన్న కమ్యూనిస్టుల ఆశలపై పవన్ నీళ్లు చల్లారు. ఆ పార్టీలను అర్ధాంతరంగా వదిలి వెళ్లిపోయారు. ఇప్పుడు ఆ పార్టీలకు మిగిలింది టీడీపీనే లేదంటే… ఒంటరి పోరే.
మిగిలిన విపక్షాల ఆలోచన అదే అయితే ఏపీలో కొత్త సమీకరణాలు?
అధికారం పోయిన తర్వాత తిరిగి అధికారంలోకి రావడానికి విపక్షాలను ఏకం చేయడం టీడీపీకి అలవాటే. ఈసారీ ఇదే కోవలో ఆ పార్టీ ఆలోచన చేస్తే…. మిగిలిన పార్టీలు కూడా ఆ కోవలో నడిస్తే… ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలు మొదలైనట్టే. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉంది. ఆలోగా ఏమైనా జరగవచ్చు.
తాజావార్తలు
-
Lalithaa Jewellery IPO: లలితా జ్యువెల్లరీ IPO వచ్చేసింది.. షేర్ ధర ఎంతంటే?
-
Indian Players: పలు రికార్డులకు చేరువలో ఇండియన్ ప్లేయర్స్.. రిషబ్ పంత్ నుంచి శుభ్‌మన్ గిల్ వరకు ఇలా..
-
Kangana Ranaut: ‘‘పాకిస్తాన్ ప్రేమ ఎప్పుడు ముగుస్తుంది’’.. బాలీవుడ్ పరువు తీసిన కంగనా..
-
Harbhajan Singh: ఆప్ నుంచి అందుకే బయటకు వచ్చేశా.. హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు
-
NALSAR row: CJI సూర్యకాంత్ ఆహ్వానంపై రచ్చ.. నల్సార్ విద్యార్థులపై చర్యలకు వెనక్కి తగ్గిన బార్ కౌన్సిల్..
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్‌తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్‌ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్‌గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!