ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణాలే కీలకం కాబోతున్నాయా? అధిష్ఠానం ఆలోచన ఆ దిశగానే ఉందా? సిట్టింగ్ పరిస్థితి ఏంటి? పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నదెవరు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి?
అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణాలే కీలకమా?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పదవీకాలం ముగియనుండటంతో..ఆ స్థానంలో ఎన్నిక నిర్వహిస్తున్నారు. తనకు మరోసారి అవకాశం ఇస్తారనే లెక్కల్లో ఉన్నారు పురాణం. ఇప్పటి వరకు ఓసీ సామాజికవర్గానికే ఈ పదవి దక్కడంతో ఈసారి కుల సమీకరణాలు కీలకం అవుతాయని ఆశావహులు లెక్కలేస్తున్నారు. స్థానిక సంస్థల్లో టీఆర్ఎస్‌కే బలం ఎక్కువగా ఉంది. పార్టీ పేరు ప్రకటిస్తే గెలుపు ఖాయం. అయితే గులాబీ పెద్దల దృష్టిలో ఎవరు ఉన్నారన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.
నిర్మల్ జిల్లా నుంచి ముగ్గురు ఆశావహులు..!
టికెట్ ఆశిస్తున్నవారంతా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను వీడి హైదరాబాద్‌లో వాలిపోయారు. ఎవరి స్థాయిలో వారు లాబీయింగ్ మొదలుపెట్టారు కూడా. పురాణం సతీష్ రెన్యువల్ ఆశిస్తున్నా.. జిల్లాలోని కొందరు ఎమ్మెల్యేలు ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్నారట. ఆ విభేదాల ప్రభావం ఉంటుందా లేదా అన్నది తెలియాలి. నిర్మల్ జిల్లా నుంచే ముగ్గురు నాయకులు ఎమ్మెల్సీ సీటుపై కన్నేశారట. కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాలచారి, సీనియర్ నేతలు, శ్రీహరిరావు, సత్యనారాయణ గౌడ్‌లు అధిష్ఠానం దగ్గర అర్జీ పెట్టుకున్నట్టు సమాచారం.
జాబితాను షార్ట్ లిస్ట్ చేశారని టాక్..!
కొమురం భీం జిల్లా నుంచి అరిగెల నాగేశ్వరరావు పేరు కూడా రేస్‌లో వినిపిస్తోంది. యాదవ సామాజికవర్గం కోటాలో తప్పకుండా పట్టం కడతారని ఆయన అనుకుంటున్నారట. మంచిర్యాల జిల్లాకు చెందిన అరవిందరెడ్డి సైతం నేనున్నాను అని ముందుకొస్తున్నారు. చర్చల్లో ఎంత మంది ఉన్నా.. శ్రీహరిరావు, వేణుగోపాలచారిలలో ఒకరికి పిలిచి పదవిస్తారని జోరుగా చర్చ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు పేర్లతో జాబితాను షార్ట్ లిస్ట్ చేశారని జిల్లా టీఆర్ఎస్ వర్గాల టాక్. పార్టీ అధికారిక ప్రకటన రాకముందే అనుచరులు తమ నేతకే టికెట్ కన్ఫామ్ అని సోషల్ మీడియాలో ఊదరగొడుతున్నాయి.
వడపోతల్లో ఎవరిని పికప్ చేస్తారు?
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు.. స్థానిక రాజకీయ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఈ దఫా ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణాలు కీలకం అవుతాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అయితే ఆ వడపోతల్లో ఎవరిని పార్టీ పికప్ చేస్తుందన్నదే ఉత్కంఠగా మారింది. కొత్తవారిని బరిలో దించుతారా.. లేక సిట్టింగ్‌కే మళ్లీ ఛాన్స్ ఇస్తారో చూడాలి.