పార్టీ మారినప్పటి నుంచి ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు ఇక్కట్లు తప్పడం లేదా? లోకల్ లీడర్లతో పొసగడం లేదా? స్వపక్షంలోని విపక్షీయుల స్వరం పెరుగుతోందా? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథా?
వాసుపల్లి వచ్చాక విశాఖ సౌత్ వైసీపీలో గ్రూపులు పెరిగాయా?
వాసుపల్లి గణేష్‌కుమార్. వైసీపీ గాలిలోనూ విశాఖలో గెలిచిన నలుగురు టీడీపీలో ఎమ్మెల్యేలలో ఒకరు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో టీడీపీని వీడి వైసీపీకి జైకొట్టారు వాసుపల్లి. అయితే అప్పటి వరకు వైసీపీని నమ్ముకుని పనిచేస్తున్నవాళ్లకు ఎమ్మెల్యే ఎంట్రీ తలనొప్పిగా మారింది. విశాఖలో ఏ నియోజకవర్గంలో లేనన్ని గ్రూపులు ఒక్క దక్షిణ నియోజకవర్గం వైసీపీలో ఏర్పడ్డాయి. సమయం.. సందర్భం వచ్చినప్పుడు ఆ గ్రూపు తగాదాలు రచ్చ రచ్చగా మారుతున్నాయి.
ఎమ్మెల్యేపై విరుచుకుపడుతున్న ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు..!
విశాఖ సౌత్‌లో ప్రస్తుతం ఎమ్మెల్యే వాసుపల్లికి.. వైసీపీ కార్పొరేటర్లకు అస్సలు పడటం లేదట. ముగ్గురు కార్పొరేటర్లకు.. ఎమ్మెల్యేకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా గ్యాప్ వచ్చినట్టు చెబుతున్నారు. ఆ మధ్య ఆసరా కార్యక్రమంలో కార్పొరేటర్ సాదిక్ ఎమ్మెల్యే వాసుపల్లిపై పరోక్ష విమర్శలు చేసి కాకపుట్టించారు. కోవిడ్ సమయంలో ఫీజు రాయితీలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే.. వాసుపల్లికి చెందిన కాలేజీలో ఆ విధానం అమలు కాలేదని ఓపెన్‌గానే విమర్శలు చేస్తున్నారు. ఒక స్కూల్ దగ్గర బడ్డీల తొలగింపు సమస్యను ఇంకా ముదురు పాకాన పడేసింది. కార్పొరేటర్లు సాదిక్, భాస్కరరావు, కందుల నాగరాజులు ప్రెస్‌మీట్ పెట్టి ఎమ్మెల్యేపై విమర్శలు చేసే వరకు సమస్య వెళ్లింది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదు చేస్తామని వాళ్లు హెచ్చరించారు.
ఎమ్మెల్యే కలలకు వైసీపీ కేడర్ బ్రేక్‌లు వేస్తోందా?
ఎమ్మెల్యే తీరుపై కాలనీల్లో జనాలు ఆందోళన..!
విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వరసగా రెండుసార్లు గెలిచిన వాసుపల్లి.. మూడోసారి గెలవాలనే వ్యూహంలో ఉన్నారు. కానీ..స్థానిక వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలు.. వేస్తున్న బ్రేకులు ఎమ్మెల్యే శిబిరాన్ని ఆలోచనలో పడేస్తున్నాయి. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల తర్వాత పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. వైసీపీ కార్పొరేటర్ల నుంచే కాకుండా.. కొన్ని కాలనీల ప్రజలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా రోడ్డెక్కడం మొదలుపెట్టారు.
ఆ మధ్య జ్ఞానాపురం ఎయిడెడ్ స్కూల్ విషయంలో ధర్నాతో అట్టుడికించారు స్థానికులు. వాసుపల్లి టీడీపీలో ఉన్నప్పుడు పక్కా ఇళ్ల కోసం డీడీలు కట్టించుకున్నారని.. ఇప్పుడు వాటి ఊసే ఎత్తడం లేదని మహిళలు రోడ్డెక్కారు. ఆందోళనలు చేస్తున్నవారిపై కేసులు పెట్టి బెదిరిస్తున్నారనే ఆరోపణలు ఎమ్మెల్యేను చుట్టు ముడుతున్నాయి. మొత్తానికి ఏదో ఆశించి.. మరోన్నో కలలు కని అధికారపార్టీలోకి వచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లికి.. కొత్త చోటు కలవర పెడుతోందని టాక్. మరి.. ఈ సమస్యలను ఎమ్మెల్యే ఎలా అధిగమిస్తారో చూడాలి.