Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్‌లో రేగిన రగడ.. క్షమాపణతో సద్దుమణిగేనా? కొత్త డిమాండ్‌పై పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఏం చేస్తారు? మునుగోడు ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో మొదలైన సమస్య ఇంకెన్ని మలుపులు తిరుగుతుంది? లెట్స్ వాచ్..!
తెలంగాణ కాంగ్రెస్‌లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి మధ్య మాటల యుద్ధంలో సమస్య.. క్షమాపణల వరకు వచ్చింది. రేవంత్ క్షమాపణ చెప్పాలని వెంకటరెడ్డి పట్టుబట్టడంతో రేవంత్ సారీ చెప్పేశారు. దానికి వెంకటరెడ్డి సంతృప్తి చెందారా అనేదే ప్రస్తుతం ప్రశ్న.
హోంగార్డు… IPSలకు తేడా ఉండదా..!? అని రేవంత్ కామెంట్ చేయడంతో సమస్య మరో మలుపు తీసుకుంది. మేమంతా హోంగార్డులం.. ఆయన ఒక్కడే ips అంటూ కోమటిరెడ్డి తప్పు పడుతూ వచ్చారు. వీటన్నిటిపై తెలంగాణ కాంగ్రెస్‌లో సీనియర్ నేతలు కొంత హార్ట్ అయ్యారు. పార్టీలో మాజీ చీఫ్ స్థాయిలో ఉన్న నాయకులు.. రేవంత్‌ను వ్యతిరేకించే వాళ్లూ అధిష్టానం దృష్టికి కూడా తీసుకు వెళ్లినట్టు సమాచారం.
రేవంత్‌తోనే సమస్య అని చెబుతున్న తరుణంలో.. ఆయనతో వెంకటరెడ్డికి క్షమాపణ చెప్పితే అంతా సర్దుకుంటుందని అభిప్రాయపడ్డారట. ఆ క్రమంలోనే రేవంత్ క్షమాపణ చెప్పేశారు. ఆ తర్వాత అద్దంకి దయాకర్ సైతం క్షమాపణ చెబుతూ వీడియో విడుదల చేశారు. మునుగోడు ఉపఎన్నిక ముందు పార్టీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి పంచాయితీ ఎందుకులే అనుకుని సారీ చెప్పారని భావించారు. అయితే… రేవంత్ క్షమాపణ చెప్పడం వరకు సంతోషం అంటూనే…కొత్త మెలిక పెట్టారు వెంకటరెడ్డి. నన్ను అనరాని మాటలు అన్న అద్దంకి దయాకర్‌ను పార్టీ నుంచి బహిష్కరించాలనే డిమాండ్ తెర మీదకు తెచ్చారు. ఇది కొత్త డిమాండ్. నిన్నటి వరకు అద్దంకిని చిన్న పోరడు అని చెప్పిన వెంకట్ రెడ్డి…గళం సవరించారు.
తాజా ఎపిసోడ్‌లో వెంకటరెడ్డి శాంతించేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. దయాకర్‌కు పార్టీ ఇప్పటికే షోకాజ్ నోటీసులు ఇచ్చింది. దానికి ఆయన సమాధానం కూడా ఇచ్చారు. ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ దయాకర్‌పై వేటు వేస్తే తప్పితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు వెంకట్ రెడ్డి. మరి.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా ఉన్న చిన్నారెడ్డి ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. మరి వెంకటరెడ్డి కోరినట్టు దయాకర్‌పై వేటు వేసే పరిస్థితి ఉందా? . ఒకవేళ వేటు వేస్తే… వెంకటరెడ్డి కొత్త అంశాన్ని తెరమీదకు తేరబోరనే గ్యారెంటీ ఏంటి? అనేది రేవంత్ టీమ్ వాదన. మరి.. ఈ సమస్య ఇంకెలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.