NTV Telugu Site icon

Off The Record: కడుపులో కత్తెరలు.. గెలిచేదెవరు?

Maxresdefault (1)

Maxresdefault (1)

వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి బరిలో దిగేది ఎవరు? తొడగొట్టి గెలిచేదెవరు? | Ntv Off The Record

సిట్టింగ్ స్ధానాన్ని ఆ మంత్రి గాలికి వదిలేశారు. మరోసారి అక్కడి నుంచి పోటీ చేసే ఆలోచన ఆయనకు లేదట. దీంతో టీడీపీలో కొత్త ఆశలు బయలుదేరాయి. గెలిచేందుకు అవకాశం ఉందనే అంచనాలతో ముందే ప్రచారం ప్రారంభించేసింది. గెలవడం సంగతేమో కానీ టికెట్‌ ఆశిస్తున్న ఇద్దరు నేతలు మాత్రం.. కడుపులో కత్తులు పెట్టుకుని తిరుగుతున్నారు. ఈ యవ్వారం చూస్తే.. పోటీ చేసే ఛాన్స్ ఎవరికి వచ్చినా రెండో వర్గం దెబ్బేసేయడం ఖాయమనే కలవరపాటు కనిపిస్తోంది. ఈ అంతర్యుద్ధం ఎక్కడ జరుగుతోంది? పర్యావసానాల సంగతేంటి?

అనకాపల్లిలో కాపు, గవర ఓటర్లు కీలకం..!
అనకాపల్లి బెల్లం ఎంత రుచిగా వుంటుందో.. అక్కడ రాజకీయాలు అంతే ఘాటెక్కిస్తుంటాయి. గ్రేటర్ విశాఖలో అంతర్భాగంగా ఉన్న అనకాపల్లి పట్టణంతోపాటు కశింకోట, అనకాపల్లి రూరల్ గ్రామాలు ఈ నియోజవర్గ పరిధిలోకి వస్తాయి. కాపు, గవర ప్రధాన సామాజికవర్గాలు కాగా.. ఇప్పటి వరకూ వీళ్లదే ఆధిపత్యం. మాజీ మంత్రులు కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు సుదీర్ఘకాలం రాజకీయ ప్రత్యర్ధులు. ఈ రెండు కుటుంబాల మధ్యే అధికారం మారుతూ వచ్చింది. ఈ ట్రెండ్‌కు తొలిసారి బ్రేకులు వేశారు మాజీ మంత్రి గంటా శ్రీనివాస్. స్ధానికేతరుడే అయినప్పటికీ కాపు ఫ్యాక్టర్, ప్రజారాజ్యం ఊపు కలిసి రావడంతో 2009లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా అవకాశం లభించడంతో నియోజకవర్గంపై గంటా పట్టు పెరిగింది. అదే సమయంలో కొణతాల, దాడి కుటుంబాల చరిష్మా తగ్గుతూ వచ్చింది. 2014 ఎన్నికల్లో వ్యాపార కుటుంబం నుంచి వచ్చిన పీలా గోవింద సత్యనారాయణను బరిలోకి దించింది టీడీపీ. అంతర్గత గ్రూప్ రాజకీయాలు వైసీపీకి నష్టం చేకూర్చగా పీలా గెలుపునకు అది ప్లస్ అయ్యింది. పెందుర్తికి చెందిన గోవింద్‌ విజయంలో కాపు ఓట్ బ్యాంక్ కీలకంగా పని చేసిందనేది విస్పష్టం. ఐతే, సామాజికవర్గాల సమతూకం పాటించడం, పార్టీ అధికారంలో ఉన్నా.. ఆశించినస్ధాయిలో అభివృద్ధి పనులు చెయ్యడంలో గోవింద్ వెనుకపడ్డారనే విమర్శలు మూటగట్టుకున్నారు. ఫలితంగా బలమైన స్ధానాన్ని టీడీపీ కోల్పోయింది.

2019లో వైసీపీ ఖాతాలోకి అనకాపల్లి
2019లో వైసీపీ నుంచి బరిలో దిగిన గుడివాడ అమర్నాథ్ తొలి ప్రయత్నంలోనే గెలిచారు. టీడీపీ అభ్యర్ధి పీలా గోవింద్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ జగన్ వేవ్.. సామాజికవర్గ బలం కలిసి రావడంతో విజయం అమర్నాథ్ సొంతమైంది. కేబినెట్ విస్తరణలో కీలకమైన మంత్రి పదవి దక్కింది. రాజకీయంగా అమర్నాథ్ అనకాపల్లిలోనే స్ధిరపడతారని కేడర్ బలంగా నమ్మింది కూడా. అందుకు తగ్గట్టుగానే మంత్రి సైతం ఇంటి నిర్మాణం ప్రారంభించారు. కానీ, అన్నీ అనుకూలిస్తే పొరుగునే వున్న యలమంచిలి నుంచి పోటీ చేయ్యాలనే ఆలోచనలో మంత్రి ఉన్నారట. అమర్నాథ్ నియోజవర్గంపై ఫోకస్ తగ్గించడమే ఇందుకు ఉదాహారణ అంటున్నారు సన్నిహితులు. ఈ ఫీడ్ బ్యాక్ పార్టీ అధిష్టానం దగ్గర వుంది. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం హాజరులో మంత్రికి అత్తెసరు మార్కులే పడ్డాయనేది పార్టీ వర్గాల సమాచారం. దీంతో వచ్చే ఎన్నికల్లో అనకాపల్లి బరిలో దిగేది ఎవరు? తొడగొట్టి గెలిచేది ఎవరు? అనే చర్చ నడుస్తోంది. అమర్నాథ్ ఖాళీ చేయడం అనివార్యమైతే మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కుటుంబానికి చాన్స్ పెరుగుతుందనేది ఓ అంచనా.

అనకాపల్లి టీడీపీలో పీలా వర్సెస్‌ నాగజగదీష్‌
టీడీపీలోనూ కొత్త లెక్కలు మొదలయ్యాయి. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్‍, మాజీ ఎమ్మెల్సీ.. అనకాపల్లి జిల్లా టీడీపీ అధ్యక్షుడు నాగజగదీష్ టికెట్ కోసం పోటీ పడుతున్నారు. పనిలో పనిగా ఒకరి మైనస్‌లను ఒకరు ఎత్తిచూపుతున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత పీలా గ్యాప్ తీసుకుని వ్యాపారాలపై దృష్టిసారిస్తే.. నియోజకవర్గంలో పార్టీని సమన్వయం చేయడం, వైసీపీ దూకుడుని ఎదుర్కోవడంలో తానే ఉన్నానని నాగజగదీష్ చెప్పుకొంటున్నారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబడ్డ తనకే ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలనేది ఆయన డిమాండ్ అట. ఈ ప్రతిపాదనను హైకమాండ్ దగ్గర పెట్టి తన వైఖరిని స్పష్టం చేసినట్టు జగదీష్‌వర్గం చెబుతోంది. మరోవైపు పీలాగోవింద్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. పార్టీ ముఖ్య నాయకత్వం ఇళ్లకు వెళ్లి మరీ కలిసి వస్తున్నారు. “మార్నింగ్ కాఫీ విత్ కేడర్” పేరుతో కాఫీ తాగి తనకు సహకరించమని కోరుతున్నారట గోవింద్.

పీలా, నాగజగదీష్‌ రాజీ పడితే తప్ప మార్పు రాదా?
మాజీ ఎమ్మెల్యే చర్యలు సహజంగానే నాగజగదీష్ వర్గానికి మింగుడుపడ్డం లేదు. ఈ అంతర్యుద్ధం ముదిరితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి నష్టం తప్పదనే ఆందోళన కనిపిస్తోంది. ఒకే సామాజికవర్గానికి చెందిన అభ్యర్ధులను టీడీపీ, వైసీపీ బరిలోకి దించితే హోరాహోరీ పోరు తప్పదు. అటువంటప్పుడు టికెట్ రాని వర్గం దెబ్బతీస్తుందా? సహకరిస్తుందా అనేది ఫలితం వస్తే కానీ బయటపడదు. అదే సమయంలో జనసేన స్టాండ్ కీలకంగా మారుతుంది. ఆ పార్టీ కూడా గెలుపోటములపై కీలక ప్రభావం చూపుతుందనే ప్రచారంతో సైకిల్ పార్టీ శ్రేణుల్లో కలవరం పెరుగుతోంది. గోవింద్, నాగజగదీష్ రాజీపడితే తప్ప ఇక్కడ పరిస్ధితుల్లో మార్పు రాదనే వాదన వుంది. కానీ అందుకు ఇద్దరు నేతలు సుముఖంగా లేరనేది అసలు ట్విస్ట్. ఇప్పుడు అవకాశం కోల్పోతే భవిష్యత్‌లో వచ్చే ఛాన్స్ ఉండదనేది ఈ ఇద్దరు నేతల ఆందోళనకు కారణమట. ఈ తరుణంలో టీడీపీ కుమ్ములాటలను వైసీపీ జాగ్రత్తగా గమనిస్తోంది. అసంతృప్తులను తనవైపు తిప్పుకునే ప్రయత్నాలు ప్రారంభించింది.