తెలంగాణ కాంగ్రెస్‌లో పంచాయితీలు అన్నీ పటేళ్ల మధ్య పోరేనా? ఆధిపత్యం కోసం ఆరాటం.. పోరాటం వాళ్లదేనా? పరస్పరం చెక్ పెట్టుకుంటున్నారా? AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే దగ్గర చర్చల్లో కులం ప్రస్తావన ఎందుకు వచ్చింది!?
ఖర్గేతో భేటీలో కీలక అంశాలు ప్రస్తావించిన అంజన్ కుమార్
టీ కాంగ్రెస్‌లో నాయకుల మధ్య రోజుకో వైరం బయటపడుతుంది. ఈ వైరానికి కారణం ఏంటో తెలియంది కాదు. కానీ నాయకులంతా ఒకే తాటి మీదికి రావడానికి నానా తంటాల పడాల్సి వస్తుంది. నాయకులు మధ్య ఆధిపత్య పోరు ఎక్కువైంది. పైచెయ్యి సాధించడానికి.. పరస్పరం ఎత్తులు పైఎత్తులు వేసుకుంటున్నారు. ఆ క్రమంలోనే సీనియర్ల మధ్య గ్రూపులు తలెత్తాయనేది ఓపెన్ టాక్. నాయకులంతా ఐక్యత ప్రదర్శిస్తున్నట్టు కనిపించినా.. కలిసి పనిచేయడానికి మాత్రం సుముఖంగా లేరు. తాజాగా AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ నేత భేటీలో చర్చకు వచ్చిన అంశాలు చూస్తే అదే అర్థమవుతుంది.
అంజన్ చెప్పిన సమాధానంపై చర్చ
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ ఢిల్లీలో ఖర్గేతో భేటీ అయ్యారు. వారి మధ్య అనేక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్‌లో నాయకుల మధ్య సమన్వయలేమిపై లోతైన చర్చే జరిగిందట. రాష్ట్రంలో పార్టీకి అనుకూలమైన వాతావరణం ఉన్నా.. నాయకులు కలిసి లేరని అంజన్ కుమార్ యాదవ్‌తో ఖర్గే అన్నారట. కలిసి పని చేసుకోవాలని సూచించారట. ఆ మాటకు అంజన్ చెప్పిన సమాధానమే ప్రస్తుతం రచ్చ రచ్చ అవుతోంది.
కొట్టుకునేది కాంగ్రెస్‌లోని రెడ్లేనని అంజన్ చెప్పేశారా?
మాదేముంది.. కొట్లాడే వాళ్లని పిలిచి మాట్లాడండి అని ఖర్గేకు చెప్పారట అంజన్. అప్పుడు బీసీలను ఏకం చేయాలని అన్నారట పార్టీ చీఫ్. సార్.. బీసీలంతా పార్టీకి లాయల్‌గానే ఉన్నారని.. కొట్టుకునేది.. తిట్టుకునేది అంతా రెడ్లేనని కుండబద్దలు కొట్టేశారట అంజన్ కుమార్. గడిచిన కొంతకాలంగా జరుగుతున్న వైరమంతా ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుల మధ్యేనని ఉదాహరణలు ప్రస్తావించారట మాజీ ఎంపీ.
.
వరుస ఘటనలను ఉదహరించిన అంజన్?
రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్‌గా ప్రకటించిన మొదట్లో పార్టీని.. రేవంత్‌ని టార్గెట్ చేశారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ తర్వాత AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ మహేశ్వర్‌రెడ్డి తన అసంతృప్తిని వెళ్లగక్కారు. మధ్య మధ్యలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పేలుతూనే ఉన్నారు. దీనికి తోడుగా ఇదే సామాజిక వర్గానికి చెందిన పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్ కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలపై ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి చేరవేస్తున్నారని వరసపెట్టి ఉదహరణలు చెప్పారట అంజన్ కుమార్. సమస్యలన్నీ ఆ సామాజికవర్గానికి చెందిన నాయకుల నుంచే వస్తున్నాయనేది అంజన్, ఖర్గేల మధ్య చర్చగా సాగిందట. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీగా ముద్ర ఉంది. ఇప్పుడు అదేపార్టీలో ఆ సామాజిక వర్గంలోనే కొట్లాటలు జరగడం పార్టీకి లాభమా నష్టమా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీనిపై పార్టీ సమీక్ష చేసుకోకపోతే నష్టమే అన్నది కేడర్ మాట. మరి.. విషయం తనదాకా రావడంతో మల్లికార్జున ఖర్గే ఎలాంటి పరిష్కారం సూచిస్తారో చూడాలి.