తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి దక్కించుకున్నారు సీదిరి అప్పలరాజు. ఆయనకు అనుచరులే బలం.. వాళ్ల కోసం ఎందాకైనా వెళ్తారు అనే ప్రచారం ఉండేది. కానీ.. ప్రస్తుతం సీన్ రివర్స్. అనుచరులే ఏకుమేకై రహస్య సమావేశాలు పెట్టుకుంటున్నారట. ఒక్కొక్కరుగా అప్పలరాజుకు హ్యాండిస్తున్నారట. ఎందుకో.. ఈ స్టోరీలో చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా పలాస నియెజకవర్గం. రాజకీయంగా ఎంతో క్రియాశీలకంగా ఉండే ప్రాంతం. టీడీపీకి పెట్టని కోటగా భావించే నియోజకవర్గంలో ఎలాంటి పొలిటిక్ బ్యాక్‌గ్రౌండ్ లేని సీదిరి అప్పలరాజు గత ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీలో మారిన సమీకరణాలతో అనూహ్యంగా కేబినెట్‌లో చోటు దక్కించుకున్నారు అప్పలరాజు. మొన్నటి కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలోనూ మంత్రివర్గంలో తన చోటును పదిలం చేసుకున్నారు. దూకుడుగా ఉండే అప్పలరాజుకు ప్రస్తుతం పలాసలో స్వపక్షంలో విపక్షం తయారైందట. ఎన్నికల్లోనూ.. ఆ తర్వాత కుడిభుజం.. ఎడమ భుజంగా తయారైన నేతలు ప్రస్తుతం మంత్రికి దూరంగా జరిగారట. ఆయన అనుచరులే గ్రూపులుగా విడిపోయినట్టు సమాచారం.
అనుచరుల మధ్య ఆధిపత్యపోరాటం.. ల్యాండ్, గ్రావెల్ అంశాలు విభేదాలు తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. అన్ని అనుమతులతో గ్రావెల్ క్వారీ నడుపుతున్న తనపై ఓవర్గం కావాలనే ఆరోపణలు చేస్తోందని పార్టీ నేత దువ్వాడ శ్రీకాంత్ వర్గం చెబుతోంది. గత ఎన్నికల్లో సీదిరి విజయానికి కృషి చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సోదరులైన దువ్వాడ శ్రీకాంత్, శ్రీధర్‌లతోపాటు హేమబాబుచౌదరి, పలాస మాజీ ఎమ్మెల్యే జగన్నాయకులు తమ్ముడు జుత్తు నీలకంఠం ప్రస్తుతం అసమ్మతి స్వరం వినిపిస్తున్నారట. మంత్రి అప్పలరాజుకు దూరంగా ఉంటున్నారట. అలాగే పలాస మున్సిపల్ చైర్మన్ బల్లా గిరిబాబు కూడా అప్పలరాజుకు అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారట.
హేమ బాబు చౌదరి వజ్రపుకొత్తూరు పీఏసీఎస్ అధ్యక్షులుగా ఉన్నారు. శ్రీకాంత్ భార్య జయశ్రీ.. మరో నేత నీలకంఠం నామినేటెడ్ పోస్టుల్లో ఉన్నారు. వీరందరికీ అప్పలరాజు సిఫారసుల వల్లే పదవులు వచ్చాయన్నది మంత్రి వర్గం వాదన. పదవులు వచ్చిన కొత్తలో బాగానే ఉన్నా.. తర్వాత మంత్రి శిబిరంతో అస్సలు పడటం లేదు. పైగా మంత్రి భార్య తన సొంత సామాజికవర్గాన్నే చేరదీస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇది కూడా అనుచరులకు.. మంత్రి శిబిరానికి దూరం పెరగడానికి కారణంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇలా సొంత పార్టీ నుంచే మంత్రికి అసమ్మతి ఎదురు కావడం చర్చగా మారుతోంది. పలాసలో ప్రశ్నించే వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదట. పార్టీ కార్యక్రమాలకు సైతం వారిని దూరంగా పెడుతున్నారనే టాక్ ఉంది.
మొదటి నుంచి వైసీపీ కోసం కష్టపడిన వారిని కాకుండా.. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి అప్పలరాజు ప్రాధాన్యం ఇచ్చి.. కీలక బాధ్యతలు కట్టెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసమ్మతి నేతలు. వారంతా కలిసి రహస్య సమావేశాలు నిర్వహించారని తెలియడంతో పలాస వైసీపీలో కలకలం రేగుతోంది. టౌన్‌లో పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న చాలా మంది లోకల్ లీడర్స్, పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీతోపాటు వజ్రపుకొత్తూరు, మందస మండలాల నాయకులు ఆ రహస్య సమావేశంలో పాల్గొన్నారట. వైఎస్‌ఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని సైతం మంత్రితో కాకుండా వేరేగా నిర్వహించారు. ఇప్పుడు స్వరం పెంచి.. వచ్చే ఎన్నికల్లో అప్పలరాజుకు కాకుండా.. ఇంకెవరికి టికెట్ ఇచ్చినా గెలుపుకోసం పనిచేస్తానని చెబుతున్నారట. అంతేకాదు.. మంత్రి అప్పలరాజుపై సీఎంకు ఫిర్యాదు చేయాలని తీర్మానం చేసినట్టు సమాచారం. ఈ వేడి చూస్తుంటే రానున్న రోజుల్లో పలాస రాజకీయం మరింత రసవత్తరంగా ఉంటుందని అనుకుంటున్నారట.