OTR: కలెక్టర్ vs పోలీస్?.. పెద్దపల్లిలో హాట్ టాపిక్‌గా మారిన రివ్యూ మీటింగ్

Otr Peddapalli

Otr Peddapalli

OTR: పెద్దపల్లి జిల్లా కలెక్టర్… కోయ శ్రీహర్షకు సమర్ధుడన్న పేరుంది. ఎటువంటి సమస్యనైనా చాకచక్యంగా పరిష్కరిస్తారని కూడా చెబుతారు. కానీ… ఇప్పుడాయన వ్యవహార శైలిలో వచ్చిన ఆకస్మిక మార్పు జిల్లాలో చర్చనీయాంశమైంది. ఇటీవల కొందరు పోలీసు, రెవెన్యూ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారట కలెక్టర్. అది సాధారణమే, జిల్లాలోని ఏ డిపార్ట్‌మెంట్‌ అధికారులనైనా పిలిచి రివ్యూ చేసే అధికారం కలెక్టర్‌కు ఉంటుంది. కానీ… అసలు కథ… అక్కడే మొదలైందని అంటున్నారు కొందరు. రెవెన్యూ శాఖ నేరుగా కలెక్టర్‌కే రిపోర్టు చేయాలి కాబట్టి ఆ విషయంలో ఇబ్బంది లేదు. కానీ… పోలీసులను, అది కూడా స్టేషన్‌ లెవల్‌ ఆఫీసర్స్‌ను సైతం పిలిచి క్లాస్ పీకడం, రెవెన్యూ అధికారులతో కలిపి వార్నింగ్‌ టైప్‌లో ఘాటుగా మాట్లాడ్డంపై చర్చ జరుగుతోంది.

జిల్లాలోని అందరు పోలీసు అధికారులను కాకుండా.. కేవలం సెలెక్టెడ్‌గా సమావేశానికి పిలిచారట కలెక్టర్. ఆ క్రమంలో కొందరు అధికారులను పేర్లు పెట్టి మరీ పిలుస్తూ… మీ అందరి చిట్టా నా దగ్గర ఉంది… ఏమనుకుంటున్నారోనంటూ కాస్త స్వరం పెంచి అన్నట్టు తెలిసింది. గోదావరిఖని సబ్ డివిజన్‌లో పనిచేస్తున్న ఒక ఇన్‌స్పెక్టర్, ముగ్గురు ఎస్‌ఐలతో పాటు మరో సబ్ డివిజన్‌కు చెందిన ఏసీపీ, సీఐ, ఇద్దరు ఎస్‌ఐలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారట కలెక్టర్‌. భూ పంచాయితీలు ఎక్కువయ్యాయి, సివిల్ వివాదాల్లో తలదూరుస్తున్నారు, అడ్డగోలుగా అవినీతి చేస్తున్నారంటూ ఫైరైనట్టు సమాచారం. మట్టి, ఇసుక దందాలను ప్రోత్సహించడం మంచిది కాదని హితవు పలికిన కలెక్టర్….పేకాట ఆడితే పట్టుకోవాల్సింది పోయి కొందరు దగ్గరుండి ఆడిస్తున్నారని, మరికొందరు స్వయంగా ఆడుతున్నారంటూ మండిపడ్డట్టు సమాచారం. ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఏమైనా ఉంటుందా అంటూ… నాన్‌ స్టాప్‌గా ఎస్సైల నుంచి ఏసీపీ వరకు అందరి బాగోతాలను బయటపెట్టడంతో బిక్కమొహం వేశారట పోలీసులు. వాళ్ల అవినీతి వ్యవహారాల సంగతి ఉన్నా… రెవెన్యూ ఆఫీసర్స్‌తో కలిపి తమకు క్లాస్‌ పీకడంతో ఫీలయ్యారట ఖాకీలు. లా అండ్ ఆర్డర్‌ కోసం మాకో బాస్ ఉన్నారు కదా… ఆయనతో చెప్పవచ్చు.. లేదంటే ఆయన్ని కూడా పిలిచి జాయింట్‌ మీటింగ్‌ పెట్టవచ్చు. అదీ ఇదీ కాకుండా ఇలా చేయడం ఏంటంటూ మాట్లాడుకుంటున్నారట. తమ బాస్ రామగుండం సీపీ ద్వారా చెప్పిస్తే బాగుండేదన్నది పోలీస్‌ ఆఫీసర్స్‌ అభిప్రాయం. సాధారణంగా పోలీసు శాఖకు సంబంధించి ఏమైనా ఫిర్యాదులు వస్తే … ఎస్పీతోనో… లేదంటే సీపీ ద్వారానో చెప్పించి చర్యలు తీసుకుంటారు. కానీ.. ఇక్కడ రామగుండం సీపీని స్కిప్ చేసి.. నేరుగా కిందిస్థాయి అధికారులను పిలిచి కలెక్టర్‌ వార్నింగ్ ఇవ్వడం హాట్ టాపిక్‌ అయింది.

సాధారణంగా సీఐలు, ఎస్‌ఐల పోస్టింగ్స్‌లో స్థానిక ఎమ్మెల్యేల ప్రమేయం ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండే వారికి ఏరికోరి పోస్టింగ్స్‌ వేయించుకుంటారు శాసనసభ్యులు. ఆ విషయంలో వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి. ఆ క్రమంలో అలాంటి పోస్టింగ్స్‌ వేయించుకున్న అధికారులు ఏం చేసినా.. లోకల్ ఎమ్మెల్యే కనుసన్నల్లోనే జరుగుతాయనే విమర్శలు సైతం ఉన్నాయి. అలాంటప్పుడు ఇటు సీపీకి చెప్పకుండా.. అటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్ళకుండా కలెక్టర్ నేరుగా సీఐలు, ఎస్సైల మీద ఓ రేంజ్‌లో ఫైర్ కావడం వెనక ఆంతర్యం ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ విధంగా కలెక్టర్‌ చేత తలంటించుకున్న సదరు అధికారులు నేరుగా తమకు సంబంధించిన ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్లి కలిసినట్టు సమాచారం. దాంతోపాటు తమ బాస్ అయిన రామగుండం సీపీకి విషయం చెప్పారట. 2009 బ్యాచ్ కు చెందిన సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా ఐజీ హోదాలో ఉన్నారు. సీనియర్‌ అయిన తనను సంప్రదించడమో… కనీసం సమాచారం ఇవ్వడమో చేయవచ్చు కదా అంటూ… కలెక్టర్‌ వైఖరిపై ఆయన కూడా ఒకింత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు పోలీస్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే దీనికి సంబంధించి మరో వాదన కూడా వినిపిస్తోంది. కేవలం రెండు నియోజకవర్గాల పరిధిలోని పోలీసులను మాత్రమే పిలిచి తలెక్టర్‌ వార్నింగ్ ఇవ్వడంతో సరికొత్త డౌట్స్‌ వస్తున్నాయట. ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలతో కలెక్టర్‌కు పొసగడం లేదా…? లేదంటే సదరు ఎమ్మెల్యేలే కలెక్టర్‌తో పోలీసులకు వార్నింగ్ ఇప్పించారా..? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్నారు కొందరు. ఆ విధంగా ఈ స్పెషల్‌ క్లాస్ వెనక పొలిటికల్ కోణాలకు సంబంధించిన ఆరాలు సైతం నడుస్తున్నాయి. సదరు పోలీస్‌ అధికారులు తప్పు చేసి ఉంటే కలెక్టర్‌గా వాళ్ళని హెచ్చరించవచ్చుగానీ…అదే సమయంలో మీటింగ్‌కు సీపీని కూడా ఆహ్వానించి ఉంటే బాగుండేదన్నది పోలీస్‌ వర్గాల అభిప్రాయం. ఈ అగాథం ఇలాగే కొనసాగితే అడ్మినిస్ట్రేషన్ వాతావరణం దెబ్బతింటుందని… గతంలో కరీంనగర్ సీపీ వర్సెస్ కలెక్టర్ గా సాగిన ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటున్నారు కొంతమంది.