OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
- తిరుపతి లోకల్ కూటమిలో లుకలుకలు?
- వార్డుల పంపకాల్లో ముగ్గురు మిత్రుల మధ్య బాగా తేడాలు
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచికి టీడీపీ షాక్
- సామంచి పోటీ చేసిన డివిజన్లో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా? మున్సిపల్ కార్పొరేషన్ సీట్ల సర్దుబాటు చిచ్చు పెట్టిందా? మనకేం ఢోకాలేదు. అంతా సుభిక్షంగా ఉందని పై స్థాయిలో జబ్బలు చరుచుకుంటున్నా… అక్కడ గ్రౌండ్ రియాలిటీ వేరుగా ఉందా? స్వయంగా బీజేపీ జిల్లా స్థాయి నేతలకు సైతం షాక్ తగిలిందా? టీడీపీ, జనసేన రెబెల్స్ కూడా విచ్చలవిడిగా ఉన్నారంటోంది ఎక్కడ? అక్కడి ప్రత్యేక పరిస్థితులు ఏంటి? ఆల్‌సెట్…. అందర్నీ సంతృప్తి పరిచాం…. ఎక్కడికక్కడ సెట్ చేసేశామంటూ తిరుపతిలో కూటమి నేతలు సంబరపడిపోతున్నారు. కానీ… క్షేత్రస్థాయిలో మాత్రం వ్యవహారం వేరేలా ఉందన్నది లోకల్ పొలిటికల్ టాక్. అసెంబ్లీ ఎన్నికల్లో 60 వేలకు పైగా మెజారిటీతో ఎమ్మెల్యే సీటు గెలిచిన కూటమికి ఇప్పుడు తిరుపతి మేయర్ స్థానం గెలుపు అత్యంత కీలకంగా మారింది. అధిష్ఠానం స్థాయిలో మేయర్ అభ్యర్థిని ప్రకటించినా… వార్డుల పంపకాల్లో లోకల్ నేతలు మాత్రం ఏకతాటిపైకి రావడంలేదని, ఆ విషయంలో ఘోర వైఫల్యం కనిపిస్తోందన్న అభిప్రాయం బలంగా ఉంది. రెబల్ అభ్యర్థులను బుజ్జగించి పోటీ నుంచి తప్పించలేకపోవడం కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపాన్ని కూడా బయటపెడుతోందని అంటున్నారు.
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నేతలకు తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలు పెద్ద పరీక్షగా మారాయట. కూటమి ఒప్పందంలో భాగంగా ఆ పార్టీకి ఐదు డివిజన్లు కేటాయించారు. అసలు కథ ఆ తర్వాతే మొదలైందట. అభ్యర్థుల ప్రకటన దగ్గరే వ్యవహారం అడ్డం తిరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ 21వ డివిజన్ నుంచి, నగర అధ్యక్షుడు వరప్రసాద్ 26వ డివిజన్ నుంచి బరిలోకి దిగారు. కానీ… ఇద్దరు ముఖ్య నేతలకు మిత్రపక్షాల నుంచే ఎదురుదెబ్బ తగలడం స్థానికంగా దుమారం రేపుతోంది. సామంచి శ్రీనివాస్‌కు పోటీగా టీడీపీ అభ్యర్థి దొడ్డారెడ్డి రామకృష్ణారెడ్డి నామినేషన్ వేసి ప్రచారంలో దూసుకుపోతుండగా, వరప్రసాద్‌పై జనసేన మాజీ కార్పొరేటర్ పొన్నాల చంద్ర ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగరేశారు. మిగిలిన మూడు వార్డుల్లో ఉన్న రెబల్ జనసేన అభ్యర్థులను బీజేపీ నేతలే స్వయంగా రంగంలోకి దిగి నామినేషన్లు విత్‌డ్రా చేయించుకోవాల్సి వచ్చిందట. కూటమిలో ఉంటూనే తమ జిల్లా, నగర అధ్యక్షులపైనే మిత్రపక్షాల నాయకులు పోటీ చేయడంపై బీజేపీ నాయకత్వం రగిలిపోతోందట. ఇక తెలుగుదేశం పార్టీకి కేటాయించిన డివిజన్లలో జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు మరింత గందరగోళానికి దారితీస్తోందంటున్నారు. కూటమి సర్దుబాటు ప్రకారం 47వ డివిజన్‌ను టీడీపీకి కేటాయించి, ఆ పార్టీ నగర మాజీ డిప్యూటీ మేయర్ ఆర్సీ మునికృష్ణకు అధికారికంగా బీఫామ్ ఇచ్చారు.
Also Read
కానీ… చివరి నిమిషంలో జనసేన నాయకుడు రాజేష్ ఆచారి నామినేషన్ వేయడమే కాకుండా, ఆయనకు స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్వయంగా బీఫామ్ ఇవ్వడం పెను వివాదానికి కారణమైంది. ఒకే వార్డులో మిత్రపక్షాల నుంచి ఇద్దరు అధికారిక అభ్యర్థులు రంగంలోకి దిగడంతో ఎవరి వెంట నడవాలో తెలియక కేడర్ తలలు పట్టుకుంటోందట. అది సరిపోదన్నట్టు జనసేన పార్టీ నుంచి హరికృష్ణ, గుత్తా నాగరాజ రాయల్ కూడా రెబల్స్‌గా బరిలో దిగి మరింత కాక పుట్టిస్తున్నారు. కూటమి అభ్యర్థులపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే వేరే వారికి బీఫామ్ ఇవ్వడానికి కారణం స్థానిక ఆధిపత్య పోరేనని అంటున్నారు. ఎమ్మెల్యే తీరుపై టీడీపీ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు 23వ డివిజన్‌ను టీడీపీ కైవసం చేసుకున్నప్పటికీ, అక్కడ ఇద్దరు ముఖ్య నేతలు తమ తమ అనుచరుల కోసం పట్టుబట్టడంతో హైడ్రామా నడిచింది. నేతల ఒత్తిడికి తలొగ్గి పార్టీ పెద్దలు ఇద్దరికీ బీఫారాలు ఇచ్చేయడం, ఆ తర్వాత ఒకరి బీఫామ్‌ను పార్టీ కార్యాలయంలోనే చించివేసి మరొకరిని బరిలో నిలపడం స్థానికంగా నవ్వులపాలైందంటున్నారు. బీ ఫామ్ చిరిగిన నేత వర్గం ఇప్పుడు తెరవెనుక నుంచి పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా గోతులు తవ్వుతున్నట్టు చెప్పుకుంటున్నారు.
ఇక 42వ డివిజన్లో గంజి సుధాకరరెడ్డికి టీడీపీ బీఫామ్ కేటాయిస్తే, ఆయనకు పోటీగా టీడీపీ నేత కంకణాల రజనీకాంత్, అటు జనసేన కార్యకర్త మోహన్ ఇద్దరూ రెబల్స్‌గా బరిలో నిలబడి గట్టి పోటీ ఇస్తున్నారట. దీంతో సుధాకరరెడ్డి ప్రత్యర్థులతో కాకుండా, ఇటు సొంత పార్టీ అసమ్మతితో, అటు జనసేన రెబల్‌తో పోరాటం చేయాల్సి వస్తోందని లబోదిబోమంటున్నట్టు తెలిసింది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే జనసేన ఎమ్మెల్యేతో పాటు టీడీపీ ముఖ్య నేతలు తిరుపతిలో పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీట్ల పంపకాల గురించి కూటమి పెద్దలు మైకుల ముందు ఐక్యతా రాగాలు తీస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్లో మాత్రం పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉందని కార్యకర్తలే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మిత్రపక్షానికి కేటాయించిన స్థానాల్లో ఇతర భాగస్వామ్య పార్టీల అభ్యర్థులు రెబల్స్‌గా ఉంటే, సీట్ల సర్దుబాటు చేసుకుని ఏం ప్రయోజనమని బీజేపీ నాయకులు కూడా… తమ అధిష్ఠానం వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలిసింది. క్షేత్రస్థాయిలో ఓట్లు చీలిపోతే ప్రత్యర్థి పార్టీకి కావాల్సినంత పొలిటికల్ స్పేస్ ఇచ్చినట్టేనని, సునాయాసంగా గెలవాల్సిన డివిజన్లలో కూడా ఓటమి ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కూటమి నేతల నుంచే వస్తున్నాయి. తిరుపతి కార్పొరేషన్ పోరులో కూటమి సమన్వయ లోపం ప్రత్యర్థి పార్టీకి రాజకీయంగా పెద్ద అస్త్రంగా అవుతోందని విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్.
- Tags
- ap
- bjp
- NTV Telugu
- OTR
- political news
తాజావార్తలు
-
Harish Rao : కరువు ముందే తెలుసు కదా.. నీళ్లెందుకు నిల్వ చేయలేదు.?
-
Off The Record: నామినేషన్ల వరకు హడావుడి.. ఆ తర్వాత హ్యాండ్సప్.. సీన్లోకి వస్తారనుకుంటే సైలెంట్ అయ్యారా?
-
OTR: కూటమి కంచుకోటలో అలజడి రేగుతోందా
-
Prabhas Fauzi Glimpse: హిట్లర్‌కే దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నేతాజీ.. ప్రభాస్ ‘ఫౌజీ’ గ్లింప్స్ ఊచకోత!
-
OTR: తెలంగాణ బీజేపీలో ఆ నేతలెవరు?
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!