OTR: రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు సాంకేతిక కారణాలతో ఆగిపోతున్నాయా? లేక రాజకీయ కారణాలతో ఆపించేస్తున్నారా? చెల్లి పెళ్ళి జరగాలి మళ్లీ మళ్లీ అని కామెడీగా అన్నట్టు… ఇక్కడి ఎన్నికలు కూడా అదే తరహాలో పదేపదే ఎందుకు వాయిదా పడుతున్నాయి? పైకి చెబుతున్న కోర్ట్ కేసులు అసలు కారణం కాదా? ఆ విషయంలో అసలేం జరుగుతోంది? ఏళ్లుగా ఎదురు చూస్తున్న రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. కోర్టు వివాదాలే కారణమని అధికారికంగా చెబుతున్నా…. అసలు లెక్కలు వేరే ఉన్నాయన్న అనుమానాలు పెరుగుతున్నాయి. కోర్టుకు వెళ్లింది కొద్దిమంది నాయకులే….. అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడితే అయిపోయేదానికి ఏళ్లకు ఏళ్ళు ఎందుకు సాగదీస్తున్నారన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎన్నికలు నిర్వహించాలన్న రాజకీయ సంకల్పం లేకపోవడమే అసలు సమస్య అంటున్నారు. రాజమహేంద్రవరాన్ని మహానగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో నగరానికి ఆనుకుని ఉన్న 24 గ్రామాలను కార్పొరేషన్‌లో విలీనం చేయాలని తొలుత ప్రతిపాదించారు. అయితే గ్రామాల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో దాన్ని పది గ్రామాలకు కుదించారు. విలీన ప్రక్రియ తుది దశకు చేరుకున్న సమయంలో హుకుంపేట పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు వల్లేపల్లి సుబ్రహ్మణ్యం, రాజవోలు పంచాయతీకి చెందిన అప్పటి జనసేన నాయకుడు, ప్రస్తుతం వైసీపీ నేత నక్క రాజబాబు కోర్టుకెళ్ళారు.
ఈ కేసులే ఇప్పుడు ఎన్నికలకు ప్రధాన అడ్డంకిగా మారాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే రాజకీయ వర్గాల్లో మాత్రం ఒక ప్రశ్న వినిపిస్తోంది. కోర్టుకు వెళ్లింది ఇద్దరు ముగ్గురు నాయకులే కదా..వారితో చర్చించి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని ప్రశ్నిస్తున్నారు. 2014లో ఎన్నికైన రాజమహేంద్రవరం కార్పొరేషన్ పాలకవర్గం 2019లో పదవీకాలం పూర్తి చేసుకుంది. అప్పటి నుంచి ప్రత్యేకాధికారుల పాలనే కొనసాగుతోంది. అటు విలీనానికి ప్రతిపాదించిన గ్రామ పంచాయతీల్లో కూడా ఎన్నికలు జరక్కపోవడంతో అక్కడ కూడా సేమ్ సీన్. దీంతో నేరుగా జవాబుదారీగా ఉండే ప్రజాప్రతినిధులు లేకుండా పోయారు. ఒక అధికారికి రెండు మూడు గ్రామాల బాధ్యతలు అప్పగించడంతో అభివృద్ధి కూడా ఆశించిన స్థాయిలో జరగడం లేదని స్థానికులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేషన్ ఎన్నికలపై చాలాసార్లు చర్చ జరిగింది. కోర్టు కేసులను పరిష్కరించి ఎన్నికలు నిర్వహిస్తారని అనుకున్నా…. నాడు రాజమండ్రిలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా లేవనే అంచనాతోనే ఎన్నికలు నిర్వహించలేదని ప్రత్యర్థి పార్టీలు ఆరోపించాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలు ఖాయమని భావించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ సైతం సానుకూల సంకేతాలు ఇవ్వడంతో ఆశావహుల్లో ఉత్సాహం పెరిగింది.
కానీ తాజాగా ప్రభుత్వం మళ్లీ కోర్టు కేసులనే కారణంగా చూపుతూ ఎన్నికలను వాయిదా వేయడంతో రాజకీయంగా కొత్త చర్చ మొదలైంది. నాడు వైసీపీ, నేడు కూటమి.. ఇద్దరూ ఒకే కారణాన్ని చెబుతున్నారని, కానీ… అసలు రీజన్స్ మాత్రం పొలిటికల్ యాంగిలేనని అంటున్నారు. విలీన గ్రామాలను కలుపుకుని రాజమహేంద్రవరం కార్పొరేషన్‌ను 72 డివిజన్లుగా పునర్విభజించేందుకు అధికారులు గతంలో ప్రణాళికలు సిద్ధం చేశారు. విలీనం పూర్తయితే నగర జనాభా ఐదు లక్షలు దాటుతుంది. అప్పుడు మహానగర హోదాలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా భారీగా నిధులు వచ్చే అవకాశం ఉన్నా.. లోకల్ పాలిటిక్స్ అడ్డుపడుతున్నాయంటున్నారు. 2027లో గోదావరి పుష్కరాలు జరగబోతున్నాయి. పుష్కరాల్లో రాజమండ్రి కీలకం కావడంతో వందల కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరిపి పాలకమండలి కొలువుదీరితే… రాజకీయ రచ్చ పెరిగిపోయే ప్రమాదం ఉందన్న కారణంతో… పుష్కరాలు ముగిసే వరకు ఎన్నికల జోలికి వెళ్ళకపోవచ్చన్నది కొందరి వాదన. కారం ఏదైనా…. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా పడ్డాయి. అధికారికంగా కోర్టు కేసులని అంటున్నా…. రాజకీయ సంకల్పం లోపించిందన్నదే ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలన్నిటికీ ఎన్నికలు జరిగి కొత్త పాలకమండళ్ళు కొలువుదీరాక కూడా…. గోదావరి పుష్కరాలు పూర్తయ్యే వరకు రాజమండ్రి మున్సిపాలిటీకి ఎదురు చూపులు తప్పవంటున్నారు పరిశీలకులు.

