OTR: టీడీపీ గెలిచినా నేతల్లో అసంతృప్తి.. నంద్యాలలో ఏం జరుగుతోంది?

  • నంద్యాల మున్సిపల్‌ ఫలితాలపై టీడీపీలో తీవ్ర అసంతృప్తి
  • కేవలం ఒక్క ఓటు తేడాతో వైస్‌ ఛైర్మన్‌ పదవి దక్కిన వైనం
  • వైసీపీ కౌన్సిలర్‌ గైర్హాజరుతో దక్కిన ఒక్క ఓటు మెజార్టీ
  • ఎందుకింత దారుణమైన పరిస్థితి అంటూ అంతర్మథనం
Otr

Otr

OTR: ఒకరికి ముగ్గురు నాయకులు…. బలవంతులు, ప్రభావితం చేసే శక్తి ఉన్నవాళ్ళు. అందులో ఒకరు రాష్ట్ర మంత్రి కూడా. అయినా సరే… ఆ మున్సిపాలిటీలో టీడీపీ పరిస్థితి చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు ఎందుకు మారింది? అత్తెసరు మెజార్టీతో బయటపడి… హమ్మయ్య, గెలిచాం అని ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది? టీడీపీ బలంగా ఉన్న చోట ఎందుకా పరిస్థితి? ఏ విషయంలో తేడా కొట్టింది? నంద్యాల మున్సిపాలిటీని తెలుగుదేశం పార్టీ గెల్చుకుంది. కానీ… ఆ ఫలితం తమ్ముళ్ళకు అంత కిక్‌ ఇవ్వలేదట. కూటమి అధికారంలో ఉండి, అందులోనూ… టీడీపీ బలంగా ఉండి, జనసేనకు వెన్నుదన్నుగా ఉన్న సామాజికవర్గానికి పట్టున్న ప్రాంతం అయి ఉండి కూడా… బొటాబొటి మెజార్టీతో బయటపడటం మింగుడుపడ్డం లేదంటున్నారు. నంద్యాల మున్సిపాలిటీలో 52 వార్డులు ఉన్నాయి. అందులో టీడీపీ 24, బీజేపీ 1, వైసీపీ 27 వార్డుల్లో గెలిచాయి. మున్సిపల్ చైర్మన్ పదవిని 8 వేల పైచిలుకు ఆధిక్యతతో గెలవగా… వైస్ చైర్మన్ పదవి కేవలం ఒక్క ఓటు తేడాతో టీడీపీకి దక్కింది.

ఎన్నికలు ఫలితాలు విశ్లేషిస్తే… చైర్మన్ గెలుపుపైనా టీడీపీలోనే అంతర్మథనం జరుగుతోందట. రీకౌంటింగ్ తరువాత టీడీపీ గెలిచినట్లు ప్రకటించారు. వైస్ చైర్మన్ ఎన్నికలో వైసీపీకి చెందిన కౌన్సిలర్ ఒకరు ఆబ్సెండ్‌ అవగా… ఒక్క ఓటు తేడాతో టీడీపీ గెలుపొందింది. టీడీపీ, బీజేపీ కలిపి 25, ఎమ్మెల్యే, ఎంపీ, మున్సిపల్ చైర్మన్ ఓట్లు కలిపితే మొత్తం 28 ఓట్లు అవుతాయి. వైసీపీకి 27 మంది కౌన్సిలర్ల ఓట్లు, ఒక్క ఎమ్మెల్యే కలిపి 28 ఓట్లు అవుతాయి. ఆ ప్రకారం వైస్ చైర్మన్ ఎన్నికకు టీడీపీ, వైసీపీ ఓట్లు సమానం అయ్యాయి. దీంతో తెర వెనక రాజకీయం కారణంగా వైసీపీ కౌన్సిలర్ ఒకరు గైర్హాజరయ్యారని చెప్పుకుంటున్నారు. కేవలం ఆ గైర్హాజరుతోనే వైస్ చైర్మన్ పదవి టీడీపీకి దక్కింది. అందుకే…. ఇవి కూడా ఫలితాలేనా…ఇదీ ఒక గెలుపేనా అంటూ తెలుగుదేశంలోనే కొందరు పెదవి విరుస్తున్నారట. వాస్తవంగా చూస్తే… నంద్యాలలో టీడీపీ బలంగా ఉంది. అయినాసరే.. ఎందుకు ఈ పరిస్థితి అన్నదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. ఆ విషయంలో ఎవరికి తోచినట్టు వారు విశ్లేషిస్తున్నారు. లోకల్‌గా పార్టీ బలంగా ఉన్నా… బలమైన నాయకత్వం ఉన్నా… నాయకుల మధ్య అనైక్యత, విబేధాలు, ఏకపక్ష ధోరణి, సమన్వయ లోపం..లాంటి రకరకాల అవలక్షణాల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందన్నది కేడర్‌ మాట.

నంద్యాలలో ముస్లిం, కాపు, రెడ్డి సామాజిక వర్గాలు బలంగా ఉన్నాయి. ఆయా సామాజికవర్గాలకు చెందిన బలమైన నేతలు, వ్యక్తులు టీడీపీలో వున్నా ఇంత దారుణమైన ఫలితాలు ఎలా వచ్చాయని విశ్లేషించుకుంటున్నారట. వైసీపీలో మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్ రెడ్డి ఒక్కడే ఎన్నికను నడిపినా అంత మెరుగైన ఫలితాలు ఎలా వచ్చాయన్నప్రస్తావన కూడా ఈ సందర్భంగా వస్తోంది. అధికారంలో లేకపోయినా… వైసీపీ 27 కౌన్సిలర్‌ సీట్లు గెలవడం, ఛైర్మన్‌కు పడ్డ ఓట్లు కూడా అంత చెప్పుకోతగ్గ స్థాయిలో లేకపోవడం ఏంటన్న డిస్కషన్స్‌ నడుస్తున్నాయి టీడీపీ వర్గాల్లో. చావుతప్పి కన్ను లొట్టబోయినట్టు వచ్చిన ఫలితాలకు నేతల ఒంటెత్తు పోకడలే ప్రధానకారణం అంటున్నారు టీడీపీ కార్యకర్తలు. నంద్యాల ఎన్నికను మంత్రి ఫరూక్, ఆయన కుమారుడు.. టీడీపీ జిల్లా ప్రధానకార్యదర్శి ఫిరోజ్ భుజాల మీద వేసుకుని నడిపించారు. కానీ… పార్టీలో సమన్వయ లోపం కొట్టొచ్చిట్టు కనిపించిందట. టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, మాజీ ఆర్ ఐ సి చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి నంద్యాలలో బాగానే పట్టుంది.

కానీ… ఫరూక్ కుటుంబానికి, భూమా బ్రహ్మానంద రెడ్డి, అఖిల, ఏవి సుబ్బారెడ్డికి మధ్య సమన్వయం లేదు. అఖిలప్రియ ఆళ్లగడ్డలో వున్నారు. బ్రహ్మానంద రెడ్డి, సుబ్బారెడ్డి ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించలేదు. సుబ్బారెడ్డి కేవలం సమావేశాల్లో కనిపించారట. బ్రహ్మానంద రెడ్డిని, ఏవీ సుబ్బారెడ్డిని మంత్రి ఫరూక్ వర్గం అసలు కలుపుకుని వెళ్లలేదని చెప్పుకుంటున్నారు. దీంతో… మున్సిపాలిటీలో అంతో ఇంతో పట్టున్న నేతలను దూరం పెడితే ఫలితాలు ఇలానే వుంటాయని అంటున్నారు ఎక్కువ మంది. అలాగే… మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ మౌలానా కనిపించలేదన్నది కొందరి మాట. ఇక అభ్యర్థుల ఎంపికలోనూ లోపాలున్నాయని అంటున్నారు.

పార్టీలో అసలు లేనివారు కొందరికి టికెట్లు ఇచ్చారని, సీనియర్లను విస్మరించడం వల్లే మెజారిటీ కౌన్సిలర్లు ఓడిపోయారనే అభిప్రాయం ఉంది. అందుకు తగ్గట్టే… టీడీపీలో ఓడిపోయిన కౌన్సిలర్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. కౌంటింగ్ రోజు వైసీపీ మాజీ ఎమ్మెల్యే శిల్పా ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటే… తమకు కనీసం మోరల్ సపోర్ట్ లేకుండా పోయిందంటూ ఓడిన వాళ్లలో కొందరు మధనపడ్డట్టు తెలిసింది. కేవలం రెండు ఓట్ల తేడాతో ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ క్రమంలో నంద్యాల మున్సిపల్ ఎన్నికల పోస్టుమార్టం జరిగితే కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలు అన్నట్టు, అనేక కారణాలు బయటపడుతున్నాయట. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం మేలుకుంటే బాగుంటుందని, లేదంటే…. నాయకులు ఎందరున్నా, ఎంత బలవంతులైనా ప్రయోజనం ఏమీ ఉండదన్నది పొలిటికల్‌ ఒపీనియన్‌.