ఉమ్మడి కర్నూల్ జిల్లాలో ప్రధాన పార్టీ నేతలకు కొత్తగా వచ్చిన కష్టం ఏంటి? ఈసారి టిక్కెట్ మాదేనని ఇన్నాళ్ళు ధీమాగా ఉన్న నాయకులు ఇప్పుడు ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఎన్నికలకు ఇంకా ఏడాది టైం ఉండగా ఇప్పుడు ఈ కొత్త టెన్షన్ ఏంటి? ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ఎందరి సీట్లు గల్లంతయ్యే ఛాన్స్ ఉంది? కొత్తగా ముంచుకువచ్చిన ఈ ఉపద్రవం ఏంటి?
కొత్త నీరు, సరికొత్త ప్రయత్నాలేనా?
కర్నూలు జిల్లాలో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇప్పుడు కొత్త టెన్షన్ పట్టుకుందట. తమను కాదని పార్టీ ఎక్కడ కొత్త వారిని లైన్‌లోకి తీసుకువస్తుందోనని ఆందోళన పడుతున్నారట. మరీ ముఖ్యంగా పీకే సర్వేల్లో గ్రాఫ్ కాస్త అటు ఇటుగా ఉన్న వారికైతే అసలు నిద్రే పట్టడం లేదట. దీనంతటికీ ప్రధాన కారణం కొత్త నీరు, సరికొత్త ప్రయత్నాలు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
సామాజిక, ధనబలం కలిస్తే జాక్‌పాట్
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాన పార్టీలకు అభ్యర్థుల కొరత లేకున్నా… రాబోయే ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా ఉండి సమాజంలో పలుకుబడి ఉన్న వారికోసం ఆరా తీస్తున్నాయట పార్టీలు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లు, మాజీ ఎమ్మెల్యేలు వున్నా… కొత్తగా కొందరికి అవకాశం ఇచ్చే ఆలోచనలో ఉన్నాయట. పార్టీకి ఆర్థికంగా ఉపయోగపడతారనుకున్నవారి గురించి, సామాజిక వర్గాల పరంగా బలంగా ఉన్న తటస్థుల గురించి ఆరా తీస్తున్నాయట పార్టీలు. ఇక… సామాజిక వర్గ బలం, ధనబలం కలిసి ఉన్న వారికైతే జాక్‌పాటేనట. అలాంటి వారిని ఇప్పటికే సంప్రదిస్తున్నారట పార్టీల ముఖ్య నేతలు. ఈ తరహాలో ఉండే.. వెనుకబడిన వర్గాలకు చెందిన వారు, దళితులు, మైనార్టీ సామాజిక వర్గాలకు చెందిన వారి గురించి పార్టీలు అరా తీస్తున్నాయట. మరోవైపు కొందరు ధనవంతులు, వృత్తిపరంగా సక్సెస్ అయి, సమాజంలో గుర్తింపు పొందిన వారు రాజకీయాల్లో ప్రవేశించి అధికార హోదా కోరుకుంటున్న వారు ప్రధాన పార్టీ టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు లోకల్ టాక్. ఇదే ఇప్పుడు పాత నేతల్లో టెన్షన్ పుట్టిస్తోంది.
2019 ఎన్నికల్లో తటస్తుల ప్రయోగం సక్సెస్
2019 ఎన్నికల్లో వ్యాపారి పోచ బ్రహ్మానంద రెడ్డి నంద్యాల ఎంపీ గా, డా.సంజీవ్ కుమార్ కర్నూలు ఎంపీగా , డాక్టర్ సుధాకర్ కోడుమూరు ఎమ్మెల్యేగా, రిటైర్డ్ పోలీస్ అధికారి ఆర్థర్ నందికొట్కూరు ఎమ్మెల్యేగా గెలిచారు. వీరంతా అంతకుముందు రాజకీయాలతో పెద్దగా సంబంధాలు లేనివారే. ఇదే స్ఫూర్తితో 2024 ఎన్నికల కోసం తటస్తుల్లో ఆసక్తి పెరిగిందట. రాజకీయ పార్టీలు కూడా వారిలో డబ్బున్న వారి కోసం చూస్తున్నాయట.
కర్నూలు లోక్‌సభ అసెంబ్లీ సీట్ల కోసం ఆరాలు
ముఖ్యంగా కర్నూలు లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థుల కోసం ఎక్కువగా ఆరా తీస్తున్నాయట పార్టీలు. కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన వారిని, అసెంబ్లీ నియోజకవర్గానికి మైనార్టీల కోసం పార్టీలు చూస్తున్నాయట. కర్నూలు జిల్లాలో ఇద్దరు బీసీ సామాజికవర్గానికి చెందిన వైద్యులు, ఒక మైనార్టీ వైద్యుడితో ఈ తరహా సంప్రదింపులు జరిగాయట. ఓ ట్రాక్టర్ షో రూమ్ యజమాని, ఓ ఫర్నిచర్ షో రూమ్ యజమాని ఎన్నికలో బరిలో నిలిచే ప్రయత్నాల్లో ఉన్నారట. విద్యాసంస్థల యజమాని ఒకరు, ఒకరిద్దరు పోలీస్ అధికారులు, ప్రభుత్వ శాఖలో పీఆర్ ఓ గా పనిచేస్తున్న ఒకరు పొలిటికల్ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఉన్నారట. వీరిలో కొందరిని ప్రముఖ పార్టీల నేతలు సంప్రదించారట. నంద్యాల జిల్లాకు చెందిన తానా ప్రతినిధి ఒకరు పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మొత్తమ్మీద ఎవరి అదృష్టం ఎలావుందో, అధికారం ఎవరిని వరిస్తుందో కానీ…..కొత్త వారికి టిక్కెట్స్ చర్చ జోరుగా జరుగుతోంది.