తెలంగాణలో ఓ ఎమ్మెల్యేకి, పోలీస్ ఆఫీసర్‌కు మధ్య పెరిగిన వివాదం అసెంబ్లీకి చేరిందా? ఎమ్మెల్యే అంటే లెక్కేలేనట్టుగా… ఏం చేసుకుంటావో చేసుకో పొమ్మని ఓ పోలీస్ ఉన్నతాధికారి మాట్లాడారా? అది రాజకీయ రచ్చకు దారి తీసిందా? అసలు ఏ విషయంలో మాటలు అంతదాకా వెళ్ళాయి? ఎవరా ఇద్దరు? హైదరాబాద్‌లో కోట్ల విలువైన ఒక భూ కుంభకోణం. అత్యంత విలువైన ప్రభుత్వ భూమి ఆక్రమణలో ఓ రాజకీయ వ్యూహకర్త హస్తం. పొరుగు రాష్ట్రానికి చెందిన ఓ వ్యాపారి దొంగ పత్రాలతో ప్రభుత్వ భూమిని కొట్టేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ప్రయత్నం. ఆ వివాదం కాస్తా… అలా అలా… హైదరాబాద్‌లోని ఓ పోలీసు ఉన్నతాధికారి దగ్గరికి చేరింది. కానీ… అక్కడ ఏం జరిగిందో ఏమోగానీ… యెన్నంకు, సదరు పోలీస్ ఆఫీసర్‌కు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగిందట. ఒక వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకుంటుంటే… సహకరించాలంటూ…డీసీపీని ఎలా ఆదేశిస్తారని ఆ పోలీస్ అధికారితో ఆర్గ్యుమెంట్‌కు దిగాడట ఎమ్మెల్యే.
అసలు సివిల్ వివాదాల్లో పోలీసులు ఎందుకు తలదూర్చుతున్నారని ప్రశ్నించడంతో చిర్రెత్తుకొచ్చిన ఆ అధికారి… అన్నీ మీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలే చెబుతారు. తిరిగి మీరు వచ్చి నన్ను ప్రశ్నిస్తారంటూ ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాట మాట పెరిగినట్టు తెలిసింది. ఒక దశలో ఏం చేసుకుంటావో చేసుకో…. అంటూ పోలీసుల పెద్ద అధికారి విసురుగా అటాక్ చేయడంతో ఎమ్మెల్యే యెన్నం కూడా… సదరు అధికారికి అసెంబ్లీలో ప్రివిలేజ్ మోషన్ నోటీస్ ఇవ్వడానికి సిద్ధమయ్యారట. డైరెక్ట్‌గా స్పీకర్ దగ్గరికి వెళ్ళి ప్రివిలేజ్ నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పలువురు మంత్రులు నచ్చజెప్పడంతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నట్టు తెలిసింది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే… ఎమ్మెల్యేకు ఆ పోలీసు అధికారి సారీ చెప్పడంతో వ్యవహారం సద్దుమణిగినట్లు కనిపించినప్పటికీ…. భూవివాదం మాత్రం నివురుగప్పిన నిప్పులానే ఉందట.