ఆయన అపోజిషన్ ఎమ్మెల్యే. పైగా జిల్లా పార్టీ అధ్యక్షుడు. నేను కలలో కూడా ఊహించని ప్రచారం ఒకటి… నిద్ర పట్టకుండా చేస్తోందని తెగ ఫీలైపోతున్నారట. ఔనా…!. నిజమేనా…? అలా చేశావా అంటూ ఈ మధ్య కాలంలో తెలిసినోడు తెలియనోడు… ఆరాలు తీయడంతో ఇదేం ఖర్మారా దేవుడా అని తెగ ఫీల్ అయిపోతున్నారు. అమ్మ తోడు నాకేం సంబంధం లేదని నెత్తీ నోరు బాదుకుంటున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఆయన మీద జరుగుతున్న ప్రచారం ఏంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా రాజకీయాల్లో కొత్త పోకడలు చర్చనీయాంశమవుతున్నాయి. వైసీపీ కంచుకోటలైన పాడేరు, అరకు నియోజకవర్గాలపై కూటమి పార్టీలు ప్రత్యేక శ్రద్ధ పెట్టాయి. వైసీపీ అధికారంలో ఉన్నా లేకపోయినా ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీ సీటు గెలుచుకుని తిరుగులేదని నిరూపిస్తోంది. దీనిని బ్రేక్ చేసేందుకు టీడీపీ రాజకీయ ప్రయత్నాలు చేస్తుంటే…..మిత్రపక్షం జనసేన అభివృద్ధి కోణంలో నరుక్కుని వస్తోంది. అరణ్యం, ఆదివాసీల మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అడవితల్లి బాట పేరుతో రహదారులు నిర్మాణం ద్వారా డోలీ మోతలు రహిత ప్రాంతంగా మార్చడం లాంటి ప్రాధాన్యతలు గా పెట్టుకుని పనులు చేయిస్తున్నారాయన. అటు సంస్థాగతంగా పార్లమెంట్ బాధ్యతలు ఎమ్మెల్సీ నాగబాబు చేతుల్లో పెట్టడం ద్వారా అరకు, పాడేరు అసెంబ్లీ స్థానాలపై జనసేన ఆలోచనలు అర్ధం అవుతున్నాయి. అదే సమయంలో ఇక్కడ కూటమికి చిక్కులు లేకపోలేదు. 1/70 పటిష్టంగా అమలు చేయడం, జీవో నెంబర్ 3 సాధన కోసం పట్టుబడుతున్నాయి ఆదివాసీ సంఘాలు. ఇక బాక్సైట్ మైనింగ్, హైడ్రో పవర్ ప్లాంట్స్ వంటివి ఎప్పటికైనా తమ మనుగడకు ముప్పేనని గిరిజన సమాజం భయపడుతోంది.ఈ క్రమంలో… పాలక పక్షానికి మింగుడు పడకుండా తయారయ్యా రట పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు. జిల్లా పార్టీ అధ్యక్షుడు హోదాలో ASR జిల్లాలో యాక్టివ్ రోల్ తీసుకుంటున్న శాసనసభ్యుడు రాజకీయ ఒత్తిళ్ళకు లొంగడం లేదన్నది లోకల్ టాక్. అందుకు తగ్గట్టే వైసీపీ అధిష్టానం కూడా ఆయనకు ప్రాధాన్యం ఇస్తోంది. మరోవైపు 2009 తర్వాత టీడీపీ ఒక్కసారి కూడా ఇక్కడ విజయం సాధించలేదు.
ఇలాంటి రాజకీయ వాతావరణంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. పట్టున్న ప్రాంతం కావడంతో ఇక్కడి సర్పంచ్‌లు జెడ్పీటీసీలు, మండలాధ్య క్ష పదవుల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలని భావిస్తోంది వైసీపీ. సరిగ్గా ఇక్కడ నుంచే కొత్త మార్క్ పాలిటిక్స్ షురూ అయ్యాయి. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు లక్ష్యంగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం మొదలెట్టారు ప్రత్యర్థులు. అదీకూడా… ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను పొగుడుతున్నారనే పోస్టులు సామాజిక మాధ్యమాల్లో తెగ తిరిగేస్తున్నాయి. “ఎన్నో ఏళ్లుగా నిర్లక్ష్యానికి గురైనఏజెన్సీ ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ దేవుడిలా కనిపిస్తున్నారు” అనే పోస్టింగ్స్ చక్కర్లు కొడుతున్నాయి. “ఎప్పుడైతే వైసీపీ ఎమ్మెల్యే పొగిడారో అప్పుడే కూటమి సక్సెస్ “అయినట్టు అనే మరో ప్రచారం కూడా స్థానిక గ్రూపుల్లో కూడా విస్తృతంగా జరుగుతోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి, ఏజెన్సీకి ఏమాత్రం సంబంధం లేని ఏరియాల నుంచి ఇలాంటి పోస్ట్‌లు పెడుతుందగా… మొదట్లో లైట్ తీసుకున్నారట ఎమ్మెల్యే. కానీ, అది తన వ్యక్తిత్వాన్ని, పార్టీని డ్యామేజ్ చేసే ప్రమాదం తలెత్తడం, మౌత్ పబ్లిసిటీగా మారితే కౌంటర్ చేయడం కష్టమని గుర్తించి హై కమాండ్ నోటీస్‌కు తీసుకువెళ్ళారట. రాజకీయంగా తనను ఎదుర్కొలేకే నైతికత మీద బురదజల్లుతున్నారని ఆవేదన చెందుతున్నారాయన. అసలు తాను కానీ తన ఇంట్లో వాళ్లు కానీ పవన్ కళ్యాణ్ సినిమాలు కూడా చూడమని అటువంటిది రాజకీయంగా ప్రత్యర్థి పార్టీ అయిన జనసేన అధ్యక్షుడిని ఎలా పొగుడుతానని అడుగుతున్నారు ఎమ్మెల్యే. ఈ పోస్ట్‌లు పెడుతున్నది నిజంగా జనసేన అభిమానులేనా లేక సొంత పార్టీలోని వైరి వర్గం పనా…?. అనే అనుమానాలు వైసీపీ శ్రేణులకు వస్తున్నాయి. దీనిపై ఎమ్మెల్యే ఎక్కడా బయటపడకపోయినా అధినాయకత్వం గట్టిగా స్పందించాలని కోరుకుంటున్నట్టు సమాచారం…

