Off The Record: కాబోయే ఎమ్మెల్సీ విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక అంతకు మించి అంటారా? ఎలాగూ నాది అధిష్టానం కోటా కదా.. ఇంకో అడుగు ముందుకేస్తే పోయేదేముందని ఆమె అనుకుంటే పరిస్థితి ఏంటి? ఎమ్మెల్సీ దక్కించుకున్న ఊపులో కేబినెట్ బెర్త్ మీద కూడా కర్చీఫ్ వేసే అవకాశం ఉందా? ఆ విషయమై కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి?.. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో ఎవ్వరూ ఊహించని విధంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ సీటు దక్కించుకున్నారు సీనియర్ లీడర్ విజయశాంతి. అసలామె రేస్‌లో ఉన్నట్టు లాస్ట్ మినిట్ వరకు ఎవరికీ తెలియదు. అంతెందుకు…. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డికి కూడా ముందస్తు సమాచారం లేదట. విజయశాంతి విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని హైకమాండ్ పెద్దలు ఫోన్లో చెప్పేసరికి మారు మాట్లాడలేక ఇద్దరూ తలూపాల్సి వచ్చిందన్నది గాంధీభవన్ టాక్. ఇదే ఇప్పుడు పార్టీ వర్గాల్లో హాట్ టాపిక్. ఎమ్మెల్సీ ఎంపికకే అవాక్కవుతున్న నాయకుల్ని ఇప్పుడు కొత్తగా మరో డౌట్ వేధిస్తోందట. అంత ప్లాన్డ్‌గా, రాష్ట్రంలో ఎవ్వరికీ తెలియకుండా…. ఏఐసీసీ స్థాయిలో పావులు కదిపి సీటు దక్కించుకున్న విజయశాంతి అక్కడితో ఆగుతారా? లేక కేబినెట్ బెర్త్‌దాకా వెళ్తారా అన్న ప్రశ్నకు సమాధానం వెదికే పనిలో ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఒక్క ఛాన్స్ అంటూ… తెలంగాణ కాంగ్రెస్ పెద్దల చుట్టూ చాలా మంది తిరిగి తిరిగి…అలిసి పోయారు. పార్టీ చెప్పిన పనులు చేసి… సొంత డబ్బులు ఖర్చు చేసుకున్నారు. కానీ పదవులు మాత్రం అందని ద్రాక్షలాగే మారిపోయాయి.
Read Also: CM Revanth Reddy: నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
ఇక, ఆశావహుల జాబితా మాత్రం కొండవీటి చాంతాడంత పెరుగుతూనే ఉంది. నామినేటెడ్‌తో సహా ఇతర పదవులేవీ భర్తీ అవక నైరాశ్యంలో ఉన్నారు చాలామంది నాయకులు. ఇలాంటి పరిస్థితుల్లో…. విజయశాంతి డైరెక్ట్‌గా అధిష్టానం కోటాలో ఎమ్మెల్సీ దక్కించుకోవడం సహజంగానే చాలామందికి మింగుడుపడటం లేదట. వాళ్ళ విశ్లేషణలు, అసంతృప్తులు అలా నడుస్తుండగానే…. మంత్రి పదవుల ఆశావహులకు కొత్త భయం పట్టుకున్నట్టు తెలుస్తోంది. ఏడాదిన్నరగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్న కేబినెట్ విస్తరణకు ఇక లైన్ క్లియర్ కావచ్చంటున్నారు. అదే జరిగితే… ఇప్పుడు విజయశాంతి రేస్‌లోకి వచ్చి ఎక్కడ తమ అవకాశాన్ని తన్నుకుపోతారోనన్న భయం ఉందట కొందరు ఆశావహుల్లో. సామాజిక సమీకరణాల పరంగా చూసుకుంటే… తెలంగాణ కేబినెట్‌లో బీసీలకు మరో మంత్రి పదవి ఇవ్వవచ్చన్న చర్చ నడుస్తోంది. విజయశాంతికి ఢిల్లీ నాయకత్వపు అండదండలు పుష్కలంగా ఉన్నందున…. ఆ కోటాలో…ఆమె మంత్రి అయ్యే అవకాశం లేకపోలేదన్న ప్రచారం ఇప్పటికే కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతోంది. అటు విజయశాంతి సన్నిహితులు కూడా మంత్రి పదవిపై మా మా నాయకురాలు ధీమాగా ఉన్నారని చెబుతున్నారట. దీంతో బీసీ ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతున్నట్టు సమాచారం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే అండదండలతో ఆమె ఎమ్మెల్సీ అయ్యారన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో…ఏమో… గుర్రం ఎగరావచ్చన్న అంచనాలు పెరుగుతున్నాయి కాంగ్రెస్ వర్గాల్లో. స్వభావ రీత్యా కూడా విజయశాంతి మంత్రి పదవి కోసం గట్టిగానే ప్రయత్నించవచ్చన్న విశ్లేషణలు ఉన్నాయి. అసలు మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్న విషంలోనే ఇంకా క్లారిటీ లేకుంటే… సోషల్ మీడియాలో కొందరు మరీ ఓవర్ అయిపోయి విజయశాంతికి ఫలానా శాఖ అని కూడా పోస్టింగ్స్ పెట్టేస్తుండటంతో అసలేం జరగబోతోందన్న టెన్షన్ పెరుగుతోందట కాంగ్రెస్ కేడర్‌లో. ఇక ఇదే సమయంలో మరో వెర్షన్ కూడా వినిపిస్తోంది. ఢిల్లీ పెద్దల ఆశీస్సులతో ఎమ్మెల్సీ సీటు అయితే తెచ్చుకోగలరుగానీ…. రాష్ట్ర నాయకత్వంతో సయోధ్య లేకుండా మంత్రి పదవి అంత తేలికా అన్న ప్రశ్న వస్తోందట కొందరికి. ఫైనల్‌గా ఈ ఎపిసోడ్‌లో ఎలాంటి ట్విస్ట్‌లు ఉంటాయో చూడాలి మరి.