ఒకప్పుడు జెంటిల్‌మేన్ ఇమేజ్ ఉన్న ఆ ఎంపీకి ఇప్పుడు బ్యాడ్‌మ్యాన్ ఇమేజ్ పెరుగుతోందా? కేవలం గడిచిన ఏడాది కాలంలోనే… ఆయన వ్యవహారాల మీద వ్యతిరేకత పెరిగిందా? ఎంపీ సాబ్ కూడా మరక మంచిదే అన్నట్టు… ఆరోపణల్ని పట్టించుకోకుండా బండలు పగలగొట్టేస్తున్నారా? ఎవరా లోక్‌సభ సభ్యుడు? ముందుకు, ఇప్పటికి ఆయనలో వచ్చిన మార్పు ఏంటి? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్ది.. నెల్లూరు ఎంపీ. కేంద్ర పెద్దలతోగానీ….. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధిష్టానంతోగానీ… ఆయనకుండే సంబంధాలు వేరే లెవల్ అని చెప్పుకుంటారు. పార్టీలకు ఆయన అండగా, ఆయనకు పార్టీలు అండగా ఉంటాయని అంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఆయన ఎక్కడా తగ్గరన్నది సింహపురి టాక్. అంతకు ముందు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పని చేసినా…. గత ఎన్నికల్లో టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ గెలిచినా.. ఆయన లెక్కే వేరంటారు.
పార్టీలకు అతీతంగా ఓటర్లు ఆయన్ని ఆశీర్వదించారన్నది పరిశీలకుల మాట. అయితే…. ఇప్పుడున్న వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పాత మనిషి కాదన్న చర్చలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో పెరిగిపోతున్నాయట. ఈసారి లోక్‌సభ ఎంపీగా గెలిచాక ఆయన పూర్తిగా మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఆ.. వీపీఆర్‌కు, ఈ.. వీపీఆర్‌కు తేడా కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని ఆల్రెడీ బయట రాగం మొదలైపోగా…. ఇప్పుడు సొంత పార్టీలోనే ఓ వర్గం తాళం వేస్తోందట. ఆయన నెల్లూరు ఎంపీగా గెలిచి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశారు వీపీఆర్. సొంత నిధులతో వికలాంగులకు ట్రై సైకిల్స్ పంపిణీ, మారుమూల గ్రామాల్లో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు, నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్యలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే… కేంద్రం నుంచి నిధులు రాబట్టడడం, నియోజకవర్గంలో కేంద్ర సంస్థల ఏర్పాటులో కీలకంగానే ఉన్నారు. కానీ… అంతకు మించిన తేడాలేవో జరిగిపోతూ… వీపీఆర్ ప్రతిష్టను మసకబారుస్తున్నాయన్నది లేటెస్ట్ టాక్. ఈసారి ప్రభుత్వం అధికారంలోకి రాగానే… వేమిరెడ్డి గత వైఖరికి భిన్నంగా మారిపోయారట. అవినీతి ఆరోపణలు కూడా వెల్లువెత్తుతున్నాయి. మైనింగ్ వ్యవహారాల్లో తల దూర్చడమే అందుకు ప్రధాన కారణమని చెప్పుకుంటున్నారు. అనుమతులు లేని గనుల నుంచి తెల్ల రాయిని యదేచ్ఛగా తరలించేస్తున్నారనే ఆరోపణలు ఆయన్ని చుట్టు ముడుతున్నాయి. దీంతో… వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడు ఆయన తెచ్చుకున్న మంచి పేరు ఇప్పుడు టీడీపీ ఎంపీ అయ్యాక… ఆ పార్టీలోని కొందరి వల్ల పోతోందన్నది ఎంపీ వ్యతిరేక శిబిరం చెబుతున్న మాట. గతంలో మైనింగ్ ద్వారా కోట్లు కొల్లగొట్టిన నేతలు కూడా… ఇప్పుడు VPR టార్గెట్‌గా ఆరోపణలు చేస్తున్నారు. మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులను మేనేజ్ చేసుకుని వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేస్తున్నారన్న మాటలు సొంత పార్టీ వర్గాల నుంచి కూడా బలంగా వినిపిస్తున్నాయి. క్వార్ట్జ్ గనులున్న అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఓ ప్రజా ప్రతినిధి ఎంపీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారట.
గతంలో టీడీపీ అధినేత దగ్గర కూడా దీనిమీద పంచాయతీ పెట్టారట. అదలా జరుగుతుండగానే….మరో వివాదం ఆయన్ని చుట్టుముట్టింది. కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటి మీద దాడి వెనక VPR మనుషులు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఉద్దేశించి ప్రసన్న చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మహిళను అలా అంటారా అంటూ… ఆమె మీద సానుభూతి పెరిగింది. పార్టీగా టీడీపీ వైపు నుంచి కూడా పూర్తి మద్దతు లభించింది. కానీ అదే సమయంలో…. జిల్లాలో దాడులు సంస్కృతి సరికాదనే అభిప్రాయం కూడా వ్యక్తమౌతోంది. మైనింగ్ వ్యవహారంలో ప్రభాకర్‌రెడ్డిపై టీడీపీలో అసంతృప్తి సెగలు ఉన్నప్పటికీ.. నేరుగా ఎవరూ ఆయనకు వ్యతిరేకంగా మట్లాడే సాహసం చేయడం లేదట. వాళ్ళే తెలివిగా… వైసీపీలోని ఓ వర్గాన్ని రెచ్చగొట్టి ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వైసీపీలో కూడా కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి, మాజీ మంత్రి అనిల్ మినహా మిగతా వాళ్ళు ఎవరూ… వీపీఆర్‌ని బాహాటంగా విమర్శించడం లేదు. ఆయన పైకి కనిపించేంత సాఫ్ట్ కాదని కూడా నెల్లూరు టీడీపీలో గుసగుసలాడుకుంటున్నారట. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న ఇంటి మీద దాడి చేసింది ఎవరైనా.. వేళ్ళన్నీ వీపీఆర్ వైపు చూపుతుండటం ఆయనకు మైనస్ అయిందన్న అంచనాలున్నాయి. మొత్తం మీద లోక్‌సభ సభ్యుడిగా ఏడాది కాలంలో ఆయన మీద ప్రశంసలకంటే మరకలే ఎక్కువగా ఉన్నాయని మాట్లాడుకుంటున్నాయి సింహపురి రాజకీయవర్గాలు.