అంతా డాడీనే చూసుకుంటారా? పనులకు పర్మిషన్స్ ఇవ్వాలన్నా, అధికారిక సమీక్షలు చేయాలన్నా… అన్నీ ఆయనేనా? తనకు ప్రత్యేకంగా ఏ హోదా లేకున్నా… మంత్రిగారి ఫాదర్ హోదాలో మొత్తం చక్కబెట్టేస్తున్నారా? ఇప్పటికీ నా చేతులు మీ చేతుల్లోనే ఉన్నాయి డాడీ… అన్నది సినిమా డైలాగ్ అయితే… నియోజకవర్గాన్ని మీ చేతుల్లో పెడుతున్నా డాడీ అన్నది ఆ మంత్రిగారి డైలాగ్ అట. ఎవరా మినిస్టర్? ఏంటా కథ?
వాసంశెట్టి సుభాష్…. ఏపీ కార్మిక శాఖ మంత్రి.గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు టిడిపిలో చేరి, రామచంద్రపురం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా కూడా జాక్ పాట్ కొట్టేశారు. అయితే… శాఖ సంగతేమోగానీ….లోకల్‌గా మాత్రం… మినిస్టర్ సాబ్…. రిబ్బన్ కటింగ్‌లు, కొబ్బరి కాయలు కొట్టడానికే పరిమితమయ్యారట. ఏం… అంతకు మించి ఆయన చేయడానికేం పని లేదా? నియోజకవర్గం మొత్తం అంత సుభిక్షంగా ఉందా అంటే…. అయ్యో… ఎంత మాట, అలాంటిదేం లేదండీ… ఇక్కడా…ఇబ్బందులున్నాయ్. చేయాల్సిన పనులు చాలా ఉన్నాయ్… కాకుంటే… అంతా ఫాదర్ చూసుకుంటారన్నది లోకల్ వాయిస్. ఫాదరంటే ఏ చర్చి ఫాదరో కాదండోయ్. సాక్షాత్తు మంత్రివర్యుల కన్న తండ్రి. రామచంద్రపురంలో ఏ పని కావాలన్నా డాడీని అప్రోచ్ అవ్వాల్సిందేనట. సుభాష్ సొంత నియోజకవర్గం అమలాపురం…ఎస్సీ రిజర్వుడు కావడంతో గత ఎన్నికల్లో చివరి నిమిషంలో రామచంద్రపురం నుంచి పోటీ చేసి గెలిచారాయన. రిజల్ట్ వచ్చిన మరుక్షణం నుంచే… డాడీ డైరెక్ట్ అయిపోయారట. పని ఏదైనా నాకు చెప్పే చేయాలని, తాను టిక్ పెట్టిన పనులు మాత్రమే కంప్లీట్ చేయాలని ఆదేశాలు ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. అబ్బాయి మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో బిజీబిజీగా ఉంటారు కాబట్టి… ఇక్కడంతా మనమే అంటూ ఓపెన్ అయిపోతున్నారట ఆయన. లోకల్ పంచాయతీలు ఏమైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి కూడా నిర్మొహమాటంగా చెప్పేస్తున్నారట డాడీ. అటు మంత్రిగారు కూడా… నాన్నకు ప్రేమతో అంటూ…. నియోజకవర్గ వ్యవహారాలన్నిటినీ ఆయనకే అప్పగించేసినట్టు తెలిసింది. పరిచయస్తులు ఎవరన్నా ఆయనకు డైరెక్ట్ అయితే… నాన్నగారిని కలవండని సింపుల్ గా చెప్పాల్సింది చెప్పేస్తున్నట్టు సమాచారం.
దీంతో సొంత పార్టీ నేతలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారట. గతంలో ఎప్పుడూ ఇలా చూడలేదని రామచంద్రపురానికి కొత్త ట్రెండ్‌ని పరిచయం చేస్తున్నారంటూ… గుసగుసలాడుకుంటున్నారట. నియోజకవర్గంలో ఏ ప్రభుత్వ కార్యక్రమాలు జరగాలన్నా… ముందు సత్యంగారి పర్మిషన్ ఉండి తీరాల్సిందేనంటున్నారు. మూడు మండలాలు, రామచంద్రపురం మున్సిపాలిటీలో జరుగుతున్న పరిణామాలను ఎప్పటికప్పుడు తనకు అప్డేట్ చేయాలని అంటున్నారట మినిస్టర్ డాడీ. ఇక్కడ ప్రతి పనికి ఒక లెక్క ఉంటుంది, దానిని ఈక్వల్ చేయకపోతే పనులు ఆగుతాయని కూడా అంటున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. ఎన్నికల్లో ఏ ఊరికి ఎంత ఖర్చు పెట్టామో తన దగ్గర బుక్ ఉందని గుర్తు చేస్తున్నారట సత్యం. ఆ బుక్ లో ఉన్న లెక్కలన్నిటినీ సరిచేయాలి కదా అంటున్నట్టు తెలిసింది. అక్కడితో ఆగలేదట సత్యం సాబ్. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎమ్మెల్యే హోదాలో కూర్చుని అధికారులతో రివ్యూ చేస్తున్నారు తనకు మొత్తం డేటా కావాలని, తన దృష్టికి రాకుండా సొంత నిర్ణయాలు తీసుకోవద్దని షాడో వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారట. అన్నీ మంత్రి చెప్పాలంటే అవ్వదు కదా… ఆయనకి రాష్ట్రంలో సవాలక్ష పనులు ఉంటాయి కదా…… మందు నాకు చెప్పండి… నేను ఫ్రీ గానే ఉన్నాను కదా… అంటూ… ఆఫీసర్స్‌కి స్మూత్ గా స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. బదిలీల్లో కూడా సత్యం గారిని సంతృప్తి పరిచిన వారికే పనులయ్యాయని ఉద్యోగుల్లో గుసగుసలు నడుస్తున్నాయి..
షాడో ఎమ్మెల్యేగా ప్రభుత్వ కార్యాలయాలలో కూర్చునిమరీ… డైరెక్ట్ గా ఆదేశాలు ఇచ్చేస్తున్నారట డాడీ.. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వ్యవహారాల్లో కూడా మంత్రిగారి తండ్రి జోక్యం గురింతి గట్టిగానే మాట్లాడుకుంటున్నారు. ఇది చూసి మొదటి నుంచి టిడిపిలో ఉన్న ద్వితీయ శ్రేణి నేతలు సైతం అవాక్కవుతున్నారట. మరీ ఇంత కమర్షియల్ అయితే ఎలాగని చర్చించుకుంటున్నట్టు తెలిసింది. పార్టీ ఆవిర్భావం నుంచి అన్ని ఎన్నికల్లో పని చేశాం. ఇప్పుడు చివరి నిమిషంలో వాళ్ళు వచ్చి ఇలా… కలిసొచ్చే పనులు చెప్పండి అనడం ఎంతవరకు సమంజసం అంటున్నారట పాత టీడీపీ నాయకులు. ఒకవేళ గ్రామాలలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు చేద్దామంటే… ఆ కాంట్రాక్ట్‌లు ఎవరు చేస్తారు? మనకు ఉపయోగపడతారా అని సత్యం ప్రశ్నించడంతో సైలెంట్ అయిపోతున్నారట పాత నేతలు. మొత్తానికి రామచంద్రపురం లో ఎమ్మెల్యే డాడీ షాడో గా మారారన్నది గట్టిమాట. ఆయన మంత్రిగా బిజీగా ఉంటున్నారో, లేక నియోజకవర్గాన్ని ఫాదర్ చేతుల నుంచి విడిపించుకోలేకపోతున్నారోగానీ… స్థానికులకు మాత్రం ఇదంతా కొత్త కొత్తగా ఉందట. వ్యవహారం ఇలాగే ఉంటే.. రామచంద్రపురం సైకిల్‌కు రిపేర్లు అతి త్వరగా వచ్చేస్తాయని వార్నింగ్ ఇస్తున్నారు స్థానిక నాయకులు.