Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత కీలకమైన ఓశాఖ మంత్రి మీద సీఎంవో స్పెషల్ నిఘా పెట్టిందా? అక్కడేం జరుగుతోందో ఎప్పటికప్పుడు ఆరా తీస్తోందా? మంత్రి, చుట్టూ ఉన్నప్రైవేట్ వ్యక్తుల నిర్వాకాలు ఆ స్థాయిలో సర్కార్‌ను ఇబ్బంది పెడుతున్నాయా? ఇంకా చెప్పాలంటే…. ప్రభుత్వ పరువును రోడ్డుకీడుస్తున్నాయా? ఎవరా మహిళా మంత్రి? ఈ ఛాన్స్ దొరకడమే గొప్ప విషయం. మంచి తరుణం మించిన దొరకదనుకుంటూ ఆమె తెగ దండుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజమెంత?
Read Also: FATF Report: పుల్వామా దాడి కోసం పేలుడు పదార్థాలను అమెజాన్‌లో కొన్నారు.. రిపోర్టులో సంచలన విషయాలు..
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో అత్యంత కీలకమైన శాఖను చూస్తున్నారు ఆ మహిళామంత్రి. ఉత్తరాంధ్రకు చెందిన సదరు మినిస్టర్ చుట్టూ.. ఇప్పుడు వివాదాలు ఓ రేంజ్‌లో ముసురుకుంటున్నాయట. ఆ మంత్రి పేషీలో జరుగుతున్న వ్యవహారాలు చూసి ప్రభుత్వ పెద్దలకే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఒకటి కాదు, రెండు కాదు.. రకరకాల వివాదాలతో టాక్ ఆఫ్‌ది కేబినెట్ అవుతున్నారట ఆమె. రాక రాక వచ్చిన అవకాశం, ఇలాంటి ఛాన్స్ మళ్ళీ మళ్ళీ వస్తుందో రాదో.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టేసుకుందామన్నట్టుగా మంత్రిగారి వ్యవహారం ఉందన్న గుసగుసలు పెరిగిపోతున్నాయి. ఇంతా నాటు భాషలో చెప్పాలంటే.. ఎందులో ఛాన్స్ దొరికితే అందులో.. ఆమె పొలిగెట్టె పెట్టి ఊడ్చేసుకుంటున్నారన్న టాక్ నడుస్తోందట ఏపీ సచివాలయ వర్గాల్లో. ఇదంతా చూస్తున్న ఆమెకు అత్యంత సన్నిహితులు సైతం.. మా మేడమంటే.. మేడమే అంటూ సెటైర్స్ వేసుకుంటున్నట్టు చెప్పుకుంటున్నారు. గతంలో సదరు మంత్రి దగ్గర పీఏగా ఉన్న వ్యక్తి చెయ్యని అరాచకం లేదు. చివరికి తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఇచ్చే సిఫారసు లేఖల్ని సైతం అంగడి సరకు చేశారన్న ఆరోపణలున్నాయి.
Read Also: Off The Record: చింతలపూడి వైసీపీలో ఆధిపత్య పోరు
మంత్రిగారికి తెలిసే ఆ వ్యవహారాలన్నీ జరిగాయని అప్పట్లో ప్రచారం జరిగినా.. ఆ ఎపిసోడ్ బయటపడ్డాక ఆ పీఏని పక్కన పెట్టేశారట మంత్రి. వాడు పోతే వీడు.. వీడు పోతే వాడు.. అన్నట్టుగా.. అరాచక పీఏ వెళ్ళిపోయాడని అనుకుంటుండగానే.. ఇప్పుడు మేడమ్ పేషీలోకి కొత్త భాయ్ ఎంటరయ్యాడట. అతనికంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్టుగా.. ఈ కొత్త భాయ్.. ఇంకొంచెం ఎక్కువ అంటున్నట్టు సమాచారం. సదరు మంత్రిగారి శాఖ పరిధిలో అతగాడు వేలుపెట్టని వ్యవహారం లేదట. డీల్స్ సెట్ చేయడంలో భాయ్ మహా ముదురని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని కంత్రీ వ్యవహారాల్లో మంత్రిగారికి అతనే మార్గదర్శి అట. లేటెస్ట్‌గా సదరు భాయ్ డీల్ చేసిన ఓ వ్యవహారం బయటికి పొక్కి.. దాని తీవ్రత చూసి ప్రభుత్వ వర్గాలకు దిమ్మతిరిగి బొమ్మ కనపడిందట. అమ్మనీ, ఇలా కూడా చేస్తారా? అంటూ దాని గురించి విన్న పెద్దలు ముక్కున వేలేసుకున్నట్టు సమాచారం. ఆ డీల్‌కు మంత్రి కూడా ఫుల్‌గా సపోర్ట్ చేశారన్న గుసగుసలు గుప్పుమంటున్నాయి ఏపీ సచివాలయ వర్గాల్లో. ప్రభుత్వానికి అవసరమైన కంప్యూటర్స్ కొనుగోలు చేసే డీల్‌లో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు చెప్పుకుంటున్నారు.
Read Also: Crime News: అసూయ, పగ, ప్రతీకారం.. ఉన్మాదులుగా మారుతున్న మనుషులు! ఈ చిన్నమ్మే ఉదాహరణ
ఇందులో ఒక కీలక అధికారిని కూడా ఇన్వాల్వ్ చేశాడట సదరు భాయ్. ఈ డీల్ సెట్ కావాలంటే ఆ అధికారి అవసరం ఉంది. అదే సమయంలో ఆయనకో బలహీనత ఉంది. దాన్ని ఫుల్‌ఫిల్ చేస్తామని చెప్పి ముగ్గులోకి దించినట్టు తెలుస్తోంది. మంచి పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న అధికారికి కీలకమైన పోస్టింగ్ ఆఫర్ చేసి డీల్ కుదుర్చుకున్నారట. ఎలాంటి జంకుగొంకు లేకుండా హైదరాబాద్‌లో కోట్ల రూపాయల ముడుపులు చేతులు మారినట్టు ప్రచారం జరుగుతోంది. అసలు ఇలాంటి వ్యవహారాల్లో సదరు మంత్రి గారు అసలు భయపడరన్న టాక్ సైతం ఉంది. వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రస్తావన వస్తే చాలు.. అంతెత్తున ఎగిరి పడతారు మంత్రిగారు. అలా జగన్ తిడుతూ ఉంటే.. ప్రభుత్వ పెద్దలు తనకు మార్కులు వేస్తారన్న భ్రమలో.. శాఖాపరంగా తాను చేయాల్సింది చేస్తుంటారని, అయినా సరే.. కంప్యూటర్స్ కొనుగోలులో కోట్లు చేతులు మారిన వ్యవహారం బయటికి పొక్కగానే మంత్రికి సంబంధించిన అన్ని వ్యవహారాల గురించి కూపీ లాగుతున్నట్టు సమాచారం.
Read Also: Marriage Fraud: పెళ్లి పేరుతో ఒంటరి మహిళను ట్రాప్ చేసి రూ. 28 కోట్ల మోసం..
అసలే, గతంలో పీఏ వ్యవహారాల కారణంగా అనేక ఇబ్బందులు వచ్చాయి. అది చాలదన్నట్టు.. ఇప్పుడు కొత్తగా భాయ్ లైన్‌లోకి వచ్చాడు. ఆ వ్యవహారాలన్నీ మంత్రి కనుసన్నల్లోనే జరిగాయని, మొత్తం ఆమెకు తెలుసునన్న నివేదిక ప్రభుత్వ పెద్దలకు అందిందట. దీంతో పాటు మంత్రి మంత్రి ఓఎస్డీ.. వ్యవహారం కూడా అత్యంత వివాదాస్పదంగా మారుతోందంటున్నారు. ఆయన కూడా అవినీతి వ్యవహారాల్లో తలదూర్చడం ఇష్టారాజ్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. గతంలో పేషీలో ఉన్న ఒక సిన్సియర్ అధికారిని ఓఎస్డీ బయటకు పంపించినట్టు సమాచారం. అలా, మొత్తానికి ఉత్తరాంధ్ర మహిళా మంత్రి వ్యవహారం మీద ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నాయి సచివాలయ వర్గాలు. తాజా వ్యవహారంలో భాయ్ పాత్ర ఏంటి? ఇందులో ఇంకెవరెవరున్నారు? మంత్రిగారి పేషీలో ఓఎస్డీ వ్యవహారం ఎలాఉంది లాంటి అన్నిటికి సంబంధించి వివరాలు సేకరిస్తున్నారట ప్రభుత్వ పెద్దలు. ప్రస్తుతం ఈ వ్యవహారమై ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అయింది.
