Site icon NTV Telugu

Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?

Congress

Congress

Off The Record: గాడిద కష్టం కన్నా… నెమలి నాట్యానికి విలువ ఎక్కవ అన్నట్లుగా తయారైందట అక్కడ కాంగ్రెస్‌ కేడర్‌ పరిస్థితి. అంతేకాదు ఊరందరిదీ ఒకదారైతే ఉలిపికట్టెదొక దారి అన్నట్లుగా ఉన్న ఆ ఎమ్మెల్యే వ్యవహారాన్ని జీర్ణించుకొలేకపోతున్నారట కార్యకర్తలు. ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? ఎందుకలా మారిపోయింది?

Read Also: TDP vs Janasena: కూటమి నేతల మధ్య విభేదాలు.. చెక్ పెట్టే పనిలో పెద్దలు!

తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒకటి ఎమ్మెల్యే మందుల సామేల్ వెంట ఉంటే.. మరొక వర్గం జిల్లా సీనియర్ నేతల వెంట నడుస్తోందన్నది ఓపెన్ టాక్‌. కొంత కాలంగా రెండు వర్గాల క్యాడర్ మధ్య మాటలు పేలుతున్నాయి. సందర్భం ఏదైనా, వేదిక ఎక్కడైనా రచ్చ రొటీన్ గా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరారు మందుల సామేల్…. ఆయనకు లోకల్ కాంగ్రెస్ క్యాడర్ తోపాటు… నియోజకవర్గంపై పట్టున్న ఉమ్మడి జిల్లా సీనియర్ నేతలు రెడ్ కార్పెట్‌ పరిచారు.. ఎన్నికల్లో అన్ని రకాలుగా సహకరించి భారీ మెజారిటీతో గెలిపించారు.. రాష్ట్రంలో హస్తం పార్టీ అధికారంలోకి రావడంతో.. ఇక అంతా స్వర్ణయుగమే అనుకున్న తుంగతుర్తి హస్తం పార్టీ క్యాడర్ కు ఆదిలోనే షాక్ ఇచ్చారట ఎమ్మెల్యే. గెలిచింది నేను, ఎమ్మెల్యేను నేను… ఇక అంతా నేనే అన్నట్టు వ్యవహరించారట. నియోజకవర్గంపై పట్టున్న నేతల్ని కూడా ఇక్కడేం పని అంటూ రాజకీయం మొదలుపెట్టారట.

Read Also: Pakistan: కవ్విస్తున్న పాకిస్తాన్.. రాజస్థాన్ సరిహద్దుల్లో ఎయిర్ డిఫెన్స్, ఆర్టిలరీ యూనిట్స్..

అయితే, పదేళ్లు పార్టీ కోసం పని చేసిన క్యాడర్ ను, లీడర్ లను కాదని తన వెంట వచ్చిన నేతలకు, ఆ తరువాత బీఆర్ఎస్ నుండి వచ్చిన వారికి పదవుల్లో ప్రాధాన్యత ఇవ్వడాన్ని పాత కాంగ్రెస్‌ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్టు సమాచారం. పాత, కొత్త వర్గాలుగా విడిపోయిన హస్తం పార్టీ నేతలు నియోజకవర్గంలో పైచేయి కోసం ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆధిపత్య పోరులో వలస నేతలకే ఎమ్మెల్యే అండగా నిలబడటంతో సమస్య మరింత జటిలమైందని అంటున్నారు. దీంతో తుంగతుర్తి నియోజకవర్గంపై గట్టి పట్టున్న ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నేతలు, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి లతోపాటు సీనియర్ నేత రాజగోపాల్ రెడ్డి దగ్గరికి వెళ్ళారట పాత కాంగ్రెస్ నేతలు.. ఎమ్మెల్యే దగ్గర విలువ లేకపోవడం వల్లే తుంగతుర్తి పాత కాంగ్రెస్‌ నాయకులు సీనియర్స్‌కు దగ్గరైనట్టు చెప్పుకుంటున్నారు. దీంతో మరో అడుగు ముందుకేసిన ఎమ్మెల్యే.. తనను కాదని జిల్లా సీనియర్లతో సన్నిహితంగా ఉంటున్న ఆ నేతలను పార్టీ కార్యక్రమాలకు, పదువులకు మరింత దూరం చేశారట.

Read Also: Congress BC Leaders: రేపు తెలంగాణ గవర్నర్ను కలవనున్న కాంగ్రెస్ బీసీ నేతలు..

ఇక, కొన్ని సందర్భాలలో కేసులు పెట్టించేందుకు కూడా వెనకాడలేదని సమాచారం. అధికారుల దగ్గర కూడా పాత వాళ్లకు ప్రాధాన్యత లేకుండా చేసినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాలతో కొంత కాలంగా రగిలిపోతున్న పాత కాంగ్రెస్ నేతలు.. ఇప్పటికే పలు మార్లు రోడ్డెక్కగా.. సభలు, సమావేశాల్లో తమ గోడు వెళ్లబోసుకున్నారట. అయినా ప్రయోజనంలేకుండా పోయిందని అంటున్నారు. తాజాగా సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మందుల సామేలుకు వ్యత్తిరేకంగా అర్వపల్లి కాంగ్రెస్ నేతలు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేయడం కలకలం రేపింది. ఇలాంటివి ముందు ముందు ఇంకా పెరగవచ్చని అంటున్నారు.తుంగతుర్తిలో వ్యవహారాన్ని చక్కదిద్దేందుకు పార్టీ పెద్దలు భవనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని రంగంలోకి దింపినా సయోధ్య కుదరలేదట. అవమాన భారంతో రగిలిపోతున్న తుంగతుర్తి పాత కాంగ్రెస్ నేతలు సభ, సమావేశం, వేదిక ఏదైనా… రచ్చ చేసేందుకు సిద్దం అవుతుండటం అధికార పార్టీని కలవర పెడుతోందట.

Exit mobile version