Site icon NTV Telugu

Off The Record: తల ఉండి మొండెం లేనట్టుగా టీపీసీసీ

Cng

Cng

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో ఎడ్డెమంటే తెడ్డెమన్న వాతావరణం కనిపిస్తోందా? నెలల తరబడి పార్టీ కమిటీలు వేసుకోలేకపోవడానికి అదే కారణమా? పీసీసీ అధ్యక్షుడు ఇన్నాళ్ళపాటు చేసిన కసరత్తును ఇన్ఛార్జ్‌ పక్కన పెట్టేశారా? ఆమె మళ్ళీ ఫ్రష్‌గా ప్రాసెస్‌ మొదలెట్టబోతున్నారా? ఎన్నాళ్ళిలా? తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది?

Read Also: PM Modi: ఇది “యుద్ధాల యుగం” కాదు, అలాగే “ఉగ్రవాద యుగం” కూడా కాదు..

కాంగ్రెస్ తెలంగాణలో అధికార పార్టీ. కానీ.. పవర్‌లో ఉన్న పార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ కనిపించడం లేదని సొంత నేతలే మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకా… నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే.. తల మాత్రమే ఉండి మొండెంలేనట్టుగా మారిపోయిందట తెలంగాణ కాంగ్రెస్‌. పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించి నెలలు గడుస్తున్నా.. ఇంతవరకు కమిటీల్ని ప్రకటించలేని దైన్యం. పొలిటికల్‌ సర్కిల్స్‌లో ఎక్కడ చూసినా… అధికారంలో ఉన్న పార్టీ కమిటీల్ని వేసుకోలేకపోతోందన్న చర్చ తప్ప మరోటి లేదు. ఇన్నాళ్లు రకరకాల మార్పులు చేర్పులు, ఇన్ఛార్జ్‌ మారడం చుట్టూ నడిచింది వ్యవహారం. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్‌ మీనాక్షి నటరాజ్ వచ్చి కూడా మూడు నెలలవుతోంది. పార్టీ నేతలు కావచ్చు… బయట చర్చ కావచ్చు.. అందరిదీ ఒకటే మాట. పిసిసి చీఫ్‌గా మహేష్ గౌడ్ గతంలో చేసిన కసరత్తుకు సంబంధించిన నివేదికను అధిష్టానానికి పంపి ఆమోద ముద్ర వేయిస్తే ఓ పనైపోతుంది కదా అన్నదే వాళ్ల అభిప్రాయం. అలా ముందు కమిటీల్ని ఫైనల్‌ చేసేస్తే.. ఇక పార్టీ వ్యవహారాలు మొదలు పెట్టుకోవచ్చన్నది వాళ్ళ అభిప్రాయం.

Read Also: War-2 : తెలుగు రైట్స్ కు భారీ డిమాండ్.. బడా నిర్మాతల పోటీ..?

కానీ, అలా కాకుండా.. మీనాక్షి నటరాజన్ మళ్ళీ కమిటీల కసరత్తు మొదలుపెట్టాలని భావిస్తున్నట్టు సమాచారం. చాలా రోజులుగా పీసీసీ కమిటీ కూర్పుపై కసరత్తు జరుగుతోంది. కానీ… ఆ ప్రాసెస్‌ని పక్కన పెట్టేసి మీనాక్షి మళ్ళీ ఎ నుంచి స్టార్ట్‌ చేస్తే.. రెడ్డొచ్చె.. మొదలెట్టె సామెతలా అవుతుంది తప్ప సాధించేదేం ఉండదన్న అభిప్రాయం బలంగా ఉందట పార్టీలో. కమిటీల కూర్పు ఇప్పటికే ఆలస్యమైంది. దీంతో పార్టీ నేతలంతా తలపట్టుకుంటున్నారు. కానీ… ఉన్నత స్థాయిలో మాత్రం అదేం పట్టినట్టు కనిపించడం లేదట. కమిటీల్లో పాత కొత్తల కలయిక ఉండాలని భావించడం మంచిదే. కానీ, ఆ పేరుతో జీడిపాకం సీరియల్‌లా సాగదీయడం ఏంటన్నది ఎక్కువ మంది నేతల ప్రశ్న. మరోవైపు ఇప్పటి వరకు చేసిన కసరత్తునకు ఢిల్లీలో ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో ఉన్నారట పిసిసి చీఫ్ మహేష్ గౌడ్. అదే సమయంలో ఇన్ఛార్జ్‌ మీనాక్షి… ఆశావహుల జాబితా ఇవ్వండి.. ఫైనల్ చేద్దాం అనేయడంతో… కథ మొదటికి వచ్చిందా..? అన్న చర్చ జరుగుతోంది పార్టీలో. 2017 నుంచి పార్టీని అంటిపెట్టుకుని పని చేసిన వారికి పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారట ఇన్ఛార్జ్‌. అటు ఆశావహుల్లో మాత్రం టెన్షన్‌ పెరుగుతోందట.

Read Also: Congress: జమ్మూ కాశ్మీర్‌ని పాక్‌లో భాగంగా చూపించిన కాంగ్రెస్ పోస్ట్.. బీజేపీ విమర్శలు..

అయితే, ఏదో ఒకదాన్ని ప్రామాణికంగా తీసుకుని పదవులు ఇవ్వకుండా ఈ కాలయాపన ఎందుకని అడుగుతున్నారు వాళ్ళు. అటు నామినేటెడ్ పదవుల్ని భర్తీ చేయక, ఇటు పార్టీ పదవులు ఇవ్వక పోవడంతో పార్టీలో డీలా వాతావరణం పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఎవరి ఆలోచన ఎలా ఉన్నా… పాత..కొత్తవారిని సమన్వయం చేసుకుంటూ… కమిటీలు వేసుకోవాల్సిందే. కానీ… దాన్ని ఎక్కువగా నాన్చి, వివాదాలు పెరిగేలా చేస్తే.. అసలుకే ఎసరు కావచ్చు వార్నింగ్స్‌ సైతం ఉన్నాయి. ఇటీవల కేరళ పీసీసీ కమిటీని ప్రకటించారు. దీంతో తెలంగాణకు కూడా త్వరలోనే ప్రకటిస్తారని లెక్కలేసుకుంటున్నారు నాయకులు. కానీ… కూర్పు విషయంలో పీసీసీ ఆలోచన ఒకటి కాగా… ఇన్ఛార్జ్‌ తీరు మరోలా ఉందన్న ప్రచారం మాత్రం వాళ్ళని కంగారు పెడుతోందట. అధికారంలో ఉండి కూడా పీసీసీ కొత్త అధ్యక్షుడిని నియమించి 8 నెలలు గడుస్తున్నా… కనీసం కమిటీని వేసుకోలేక పోవడం, ఏదో ఒక కారణం చెప్పి ఎప్పటికప్పుడు ఆపేయడం అంటే… నాయకులు, కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్న వాదన మాత్రం గట్టిగా ఉంది తెలంగాణ కాంగ్రెస్‌లో. పార్టీ పెద్దలు దీన్ని అర్ధం చేసుకుని ఎలా సెట్‌ చేస్తారో చూడాలి మరి.

Exit mobile version