కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన టైం వచ్చిందా? ఇచ్చిన మాట నిలబెట్టుకోమన్న వత్తిడి పెరిగిపోతోందా? స్థానిక ఎన్నికల్లో కోటా సంగతి సరే… ముందు మీ చేతిలో ఉన్న ఆ పని సక్కంగా పూర్తిచేసి నిజాయితీగా వ్యవహరించమన్న వత్తిళ్ళు పెరిగిపోతున్నాయా? ఏ విషయంలో సోషల్ జస్టిస్ కోసం పార్టీ మీద ప్రెజర్ పెరుగుతోంది? అది అమలయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన కసరత్తు మొదలుపెట్టింది తెలంగాణ కాంగ్రెస్. ఇందుకోసం 22 మంది పరిశీలకులను నియమించింది అధిష్టానం. వాళ్ళు ఇప్పటికే జిల్లాల పర్యటన మొదలుపెట్టేశారు. వీరికి తోడు రాష్ట్ర నాయకత్వం కూడా ఒక్కో జిల్లాకు ముగ్గురు చొప్పున పరిశీలకులను నియమించింది. హైకమాండ్ తీసుకున్న విధాన నిర్ణయం ప్రకారం… ఇకపై పార్టీ వ్యవహారాల్లో డీసీసీ అధ్యక్షులు కీలకం కాబోతున్నారు. చివరికి పార్టీ అభ్యర్ధుల ప్రకటన విషయంలో కూడా… డీసీసీల నిర్ణయమే ఫైనల్ కాబోతోంది.
అందుకే.. లాయలిస్ట్‌లు, పార్టీ కోసమే పని చేసే వాళ్ళు, చేసిన వాళ్ళకు జిల్లా అధ్యక్ష పదవులు ఇవ్వాలని నిర్ణయించింది. అదే ప్రామాణికంగా పనిచేయాలని ఏఐసీసీ పరిశీలకులకు దిశానిర్దేశం చేసిందట ఢిల్లీ నాయకత్వం. ఐతే…. ఇక్కడే మరో ఆసక్తికరమైన, అతి ముఖ్యమైన చర్చ మొదలైంది కాంగ్రెస్ సర్కిల్స్‌లో. పార్టీ ఇప్పటికే సామాజిక న్యాయం మీద ఫోకస్ పెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. పార్టీ పదవుల్లో కూడా 42 శాతం బీసీలకు ఇవ్వాలని గతంలోనే నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికలలోపు రిజర్వేషన్ల వ్యవహారం కొలిక్కి రాకపోతే… కాంగ్రెస్ ఇచ్చే టిక్కెట్లలో 42 శాతం బీసీలకు కేటాయించాలన్న అంశాన్ని కూడా చర్చించింది నాయకత్వం.
ఆ క్రమంలోనే.. ఇప్పుడు జిల్లా అధ్యక్షుల నియామకానికి సంబంధించిన ప్రక్రియ మొదలైంది కాబట్టి… డీసీసీ అధ్యక్ష పదవుల్లో కూడా బీసీలకు 42 శాతం ఇస్తారా..? లేదా అన్న ప్రశ్న వస్తోంది. ఆ లెక్క ప్రకారం ఎన్ని జిల్లాలకు బీసీలను అధ్యక్షులుగా నియమిస్తారన్నది ఇప్పడు ఇటు పార్టీ, అటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా హాట్ టాపిక్ అయింది. ఇప్పటికే అధ్యక్ష పదవులు మినహా మిగిలిన పోస్ట్‌లకు సంబంధించిన కూర్పు ఫైనలైంది. దీంతో… డీసీసీల్లో ఇప్పుడు ఏ మాత్రం సామాజిక న్యాయం పాటిస్తారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు. పార్టీ వేస్తున్న కమిటీల్లో కూడా 42 శాతం బీసీలే ఉండేలా చర్యలు తీసుకుంటారా..? లేదంటే పార్టీ కోసం పని చేసిన వాళ్ళు… లాయలిస్టులు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారా అన్నది ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వ్యవహారం కోర్టుల్లో క్లియర్ అవకుంటే…. పార్టీ తరుపున అమలు చేస్తాం అని చెప్పిన క్రమంలో… అంతకంటే ముందు డీసీసీల్లో అమలు చేసి చిత్తశుద్ది చాటుకోవాలన్న వత్తిడి పెరుగుతోంది. దీంతో…కాంగ్రెస్ పెద్దల నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంతా.