తెలంగాణ బీజేపీలో సైంధవులు ఉన్నారా? పార్టీ ఎగుదలకు వారే అడ్డుపడుతున్నారా? వాళ్ళని చూసి కొత్తగా చేరదామనుకున్న వాళ్ళు కూడా మనసు మార్చుకుంటున్నారా? ఇంతకీ ఎవరా తేడా లీడర్స్? ఏ రూపంలో పార్టీలోకి చేరికల్ని అడ్డుకుంటున్నారు? తెలంగాణ కమలం పార్టీలోకి చాలా మంది నేతలు ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కొందరు మాత్రం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అలా ఉంటున్న వాళ్ళలో కూడా కొంతమంది టచ్ మీ నాట్ అంటుంటే… కొద్ది మంది మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయారాం… గయారాంల కల్చర్ అన్ని పార్టీల్లో ఉన్నా… తెలంగాణ బీజేపీలో మాత్రం ఇది కాస్త డిఫరెంట్‌గా ప్రొజెక్ట్ అవుతోందట. ఎవరైనా పార్టీలోకి వస్తామంటే…. వాళ్ళ బలాబలాలు, పొలిటికల్ పలుకుబడి లెక్కలు వేసుకుని గేటు తీస్తుంటాయి నాయకత్వాలు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో అప్పటికే ఉన్న నాయకులకు కాస్త అభద్రతా భావం కూడా ఉంటుంది. ఇది కూడా ఏ పార్టీలోనైనా సహజనే. అయితే…. బీజేపీలో మాత్రం ఆ డోస్ కాస్త పెరిగి పార్టీలోకి కొత్తగా రావాలనుకున్నవాళ్లు కూడా భయపడే పరిస్థితులు వస్తున్నాయట. కాషాయ కండువాలు కప్పుకోవడానికి తెలంగాణలో చాలామంది నాయకులు సిద్ధంగా ఉన్నా… ఆల్రెడీ ఉన్న నాయకులు కొందరు అడ్డుకోవడం పరిపాటిగా మారిపోయిందన్నది లేటెస్ట్ హాట్. దీంతో… పార్టీ బలపడకుండా అడ్డుపడుతున్న ఆ సైంధవులు ఎవరన్న చర్చ మొదలైంది పార్టీ వర్గాల్లో. ఆల్రెడీ నియోజకవర్గంలో మేం ఉన్నాక వాళ్ళను ఎలా చేర్చుకుంటారంటూ కొందరు పార్టీ ముఖ్యనేతలనే గడుసుగా ప్రశ్నిస్తుండటంతో… వాళ్లకు కూడా ఏం చేయాలో పాలుపోవడం లేదని చెప్పుకుంటున్నారు.
ఇలాగే…గతంలో వివిధ పార్టీల నుండి పార్టీ వచ్చేందుకు కొందరు సిద్ధపడ్డా… ఫలానా నాయకుడు మమ్మల్ని రానివ్వబోడేమోనన్న అనుమానంతో వెనక్కి తగ్గినట్టు సమాచారం. బీజేపీలో పాత వాళ్ళు కొత్త వాళ్ళను ఎదగనీయరన్న అభిప్రాయం బలంగా ఉంది. కానీ… పాత నేతలు మాత్రం మేమెందుకు అడ్డుకుంటాం… కొత్తదనానికి వెల్కమ్ చెబుతాం, వాళ్ళతో కలిసి తిరుగుతామని అంటున్నారు. మరి సమస్యేముంది? ఇంకెక్కడ తేడా కొడుతోందని అంటే… అసలు మేటరంతా న్యూ వర్సెస్ వెరీ న్యూ అన్నదే అంటున్నారు పార్టీ నేతలు చాలామంది. పార్టీలో మొదట్నుంచి ఉన్నవాళ్ళు ఎవ్వరూ కొత్తదనాన్ని అడ్డుకోవడం లేదట. కానీ.. కొన్నేళ్ళ క్రితం పార్టీలో చేరి… మమ్మల్ని పాతవాళ్ళుగా గుర్తించండని పోరాటాలు చేస్తున్న కొందరే ఇప్పుడు తాజా చేరికల్ని అడ్డుకుంటున్నారన్నది తెలంగాణ బీజేపీ వర్గాల ఇన్నర్ టాక్. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఇటీవలే బీజేపీలో చేరిపోయారు. ఈ విషయంలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎంపీ ఒకరు అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఆయన కూడా గత లోక్‌సభ ఎన్నికలకు ముందు పార్టీలో జాయిన్ అయ్యారు. మరోవైపు పార్టీ నుండి వెళ్లిపోయిన నేతలు కూడా ఉమ్మడి అదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో నాయకులు బీజేపీవైపు చూడకుండా అడ్డుకుంటున్నారట. ఇక తాజాగా ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా…బీజేపీలో చేరాలని అనుకునే వారు కాస్త వెనకా ముందూ ఆలోచించుకోవాలని అన్నారు.
వన్స్ ఎంటరయ్యాక… మీరు కోరుకున్నదేదీ… మీ అసెంబ్లీ నియోజకవర్గంలోనో, లోక్‌సభ నియోజకవర్గంలోనో, మీ జిల్లాలోనో, జరగదని, ఎంత కష్టపడ్డా… చివరికి మీకే టిక్కెట్ వస్తుందన్న గ్యారంటీ కూడా ఉండబోదంటూ బాంబ్ పేల్చారాయన. అంతకు మించి ఇంకొంచెం ఘాటైన పదజాలం కూడా వాడారు రాజా. తెలంగాణ బీజేపీ పార్టీ మా అబ్బ పార్టీ అనుకునే వాళ్ళు, మేం ఏం చెప్తే అదే జరుగుతుందని, ఏం రాస్తే అదే పార్టీ రాజ్యాంగమవుతుందని అనుకునే వాళ్ళతో..రాష్ట్రంలో బీజేపీ సర్వనాశనం అవుతోందని అన్నారు ఎమ్మెల్యే. మొత్తం మీద కమలంలో చేరికలు, అడ్డుకోవడాలపై గట్టి చర్చే మొదలైంది. మరి పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని ఆ సైంధవులకు చెక్ పెడతారో లేక వచ్చినవాళ్ళే మనోళ్ళని అనుకుంటారోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీయవర్గాలు.