అధికార కూటమిలో ఆ ఇద్దరు మాజీ మంత్రులు. ప్రస్తుతం ఒకరిది ‘పవర్’ అయితే మరొకరివి ‘పవర్ ఫుల్’ పాలిటిక్స్. సందర్భం వెతుక్కుని మరీ చెడుగుడు ఆడేసుకునే అలవాటున్న ఆ ఇద్దరు సీనియర్స్ మరోసారి ఢీ అంటే ఢీ అంటున్నారు. దశాబ్ధాల వైరానికి పొత్తులతో ఫుల్ స్టాప్ పడినట్టేనని అనుకుంటున్న టైంలో మళ్లీ పోట్లాటకు సిద్ధమైన ఆ ఇద్దరు ఎవరు? ఈసారి సక్సెస్ ఎవరికి….షాక్ తగిలేది ఎవరికి…?
కొణతాల రామకృష్ణ, దాడి వీరభద్రరావు….ఒకరు సిట్టింగ్ ఎమ్మెల్యే, మరొకరు మాజీ మంత్రి. ఉమ్మడి విశాఖ జిల్లాలో చిరకాల రాజకీయ ప్రత్యర్ధులు. ఒక వర్గం నీడను సైతం మరో వర్గం భరించలేని స్ధాయిలో వైరం నడిచేది. ఈ ఇద్దరు నేతల మధ్య రాజకీయ పరిస్ధితులు మార్పు తీసుకు వచ్చాయి. 2024 ఎన్నికల్లో టీడీపీ,జన సేన పొత్తు సూపర్ హిట్ కొట్టగా అనకాపల్లిలోనూ కొత్త చరిత్ర మొదలైంది. తొలిసారి దాడి, కొణతాల చేతులు కలపడంతో ఇక్కడ ఆధిపత్య రాజకీయాలకు తెర పడినట్టేనని అంతా భావించారు. కానీ, ఏడాది తిరిగే సరికి వాతావరణం మళ్ళీ వేడెక్కుతున్నట్టే కనిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే కొణతాల చర్యలకు ప్రతి చర్యలు వైసీపీ నుంచి కాకుండా … మిత్రపక్షం టీడీపీ నేత దాడి వర్గం నుంచి మొదలవ్వడం ఆసక్తికరగా మారుతోంది. తాజాగా ఇద్దరి మధ్య పవర్ పాలిటిక్స్ హీట్ పుట్టిస్తున్నాయి. అనకాపల్లి గ్రామీణ విద్యుత్ సరఫరా సహకార సంస్థ, పెందుర్తి, అనకాపల్లి, యలమంచిలి, గాజువాక నియోజకవర్గాల రైతుల ప్రయోజనాలతో ముడిపడ్డ RECSను తిరిగి కో ఆపరేటివ్ పరిధిలోకి తీసుకుని రావాలనేది కొణతాల ప్లాన్. రాష్ట్రంలో మూడూ రెస్కో లు వుండగా అనకాపల్లి, చీపురుపల్లి రెస్కోలను గత వైసీపీ ప్రభుత్వం ఈపీడీసీఎల్‌లో విలీనం చేసింది. ఆర్ధిక నష్టాలు, రాజకీయ అవకతవకలు కారణంగా వందల కోట్లు అక్రమాలు జరిగాయనే ఫిర్యాదులపై విచారణ చేయించింది.
రెగ్యులేటరీ కమిషన్ సిఫార్సుల మేరకు ఉత్తరాంధ్రలోని రెండు రెస్కోలను డిస్కం పరిధిలోకి తెచ్చేసింది. అదే సమయంలో కుప్పం ఆర్ఈసీఎస్ మాత్రం సహకార రంగంలో కొనసాగించేందుకు అక్కడి నేతలు పట్టుబట్టి సాధించుకున్నారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనకాపల్లి రెస్కోను తిరిగి కో ఆపరేటివ్ పరిధిలోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు ముమ్మరం చేశారు ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ. కుప్పం తరహాలోనే కొనసాగించాలని కోరుతున్న కొణతాలకు పెందుర్తి, యలమంచిలిలో కూడా జనసేన ఎమ్మెల్యేలే వుండటం కలిసి వస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో మరోసారి ఈ అంశాన్ని గట్టిగా ప్రస్తావించి రెస్కోను పునరుద్ధరించాలని, దాని ద్వారా… రైతులకు మేలు జరుగుతుందనేది ఎమ్మెల్యే ఆలోచనగా చెప్పుకుంటున్నారు. ఇప్పటికే పలుమార్లు ఈ అంశాన్ని కొణతాల ప్రస్తావించడం, మిగిలిన శాసన సభ్యుల మద్దతు కూడగట్టడం కీలకంగా భావిస్తున్నారు. ఐతే, ఆర్ఈసీఎస్ ను తిరిగి సహకార రంగంలోకి మళ్ళించాలనే ప్రయత్నాన్ని మాజీమంత్రి దాడి వీరభద్రరావు తీవ్రంగా విభేదిస్తున్నారట. రెస్కో రాజకీయ అవినీతి కేంద్రంగా మారిందని మొదటి నుంచి వాదిస్తున్నారాయన.
రైతుల ప్రయోజనాల కోసం స్ధాపించిన సంస్ధను గతంలో చైర్మన్లు, ఎమ్మెల్యేలు కొల్లగొట్టారని…కోఆపరేటివ్ స్ఫూర్తికి భిన్నంగా లూటీ చేసేశారనే ఆరోపణలు వున్నాయి. పైగా కొన్నేళ్ళ నుంచి ఆర్ఈసీఎస్ లైసెన్సులను పునరుద్దరణ చేయకుండానే కార్యకలాపాలు నిర్వహించేశారు. ఈ పరిస్థితుల్లో… మూడేళ్ళుగా ఆపరేషన్స్‌ను ఈపీడీఎసీఎల్, ఇతర వ్యవహారాలను పర్సన్ ఇన్చార్జ్ హోదా లో కలెక్టర్ నిర్వహిస్తున్నారు. ఫలితంగా రెస్కోకు 800కోట్లదాకా ఆదాయం సమకూరిందనేది ఓ లెక్క. గతంలో లాభాలు లేకపోగా ఎదురు నష్టాలను భరించాల్సిన పరిస్ధితి వచ్చిందంటే…అవినీతి తారాస్ధాయిలో జరగడమే కారణం అనే వాదన వుంది. దీంతో… మరోసారి రెస్కోను సహకార రంగంలోకి దించాలనే ఆలోచనలు రాజకీయ ప్రయోజనాలతో ముడిపడినవేనన్న అభిప్రాయంతో వున్నారట దాడి. దీంతో ఆయన ఎమ్మెల్యే ప్రతిపాదనలతో విభేదిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు ఎఫ్డీలు, మిగులు నిధులతో కళకళలాడిన ఖజానాను గుల్ల చేయడం వెనుక అక్రమాలు బహిరంగ రహస్యమేనని ఆ వర్గం బలంగా వాదిస్తోంది. దీంతో ఎమ్మెల్యే, మాజీ మంత్రి వర్గాల మధ్య పొలిటికల్ హీట్ పెరుగుతోంది. అవసరం అయితే పార్టీ పెద్దల ముందు ఆర్ఈసీఎస్ అక్రమాల నివేదికను ఆవిష్కరించి నిర్ణయం తీసుకోవాలని కోరేందుకు దాడివీరభద్రరావు సన్నద్ధం అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ దిశగా కీలకమైన ఆధారాలతో కూడిన నివేదికను సిద్ధం చేస్తున్నారని సన్నిహితుల సమాచారం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింటేంటే….రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం ఇద్దరు నేతలు మొదటిసారి విభేదించుకోవడం. దీంతో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.