ఏపీ ప్రభుత్వ విధానాలపై… టీడీపీ వర్గాలు కాస్త అసహనంగా ఉన్నాయా? వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నట్టు ఫీలవుతున్నాయా? అంశం ఏదైనాసరే… ఆచరణకు ముందే ఊదరగొట్టేస్తే… మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారా? అర్ధంకాని అండపిండ బ్రహ్మాండాల గురించి కాకుండా… సామాన్యులకు దగ్గరగా మాట్లాడాలన్న సూచనలు వస్తున్నాయా? అసలు ఏయే అంశాల్లో కాస్త ఎక్కువ చేస్తున్నామన్న అభిప్రాయం కేడర్‌లో ఉంది?
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేపదే వినిపిస్తున్నది, ఇంకా చెప్పాలంటే… హోరెత్తిస్తున్న ఒకే ఒక్క పదం క్వాంటం వ్యాలీ. అందరికంటే ఎక్కువగా సీఎం చంద్రబాబు నోటి నుంచి ఈ మాట ఎక్కువగా వినిపిస్తోంది. హైటెక్ సిటీ నమూనాను చూపిస్తూ… దానివల్ల హైదరాబాద్ ముఖ చిత్రం ఎలా మారిపోయిందో చెబుతూ….. అమరావతి రూపు రేఖల్ని కూడా కొత్తగా కలలుగంటున్న క్వాంటం వ్యాలీ అలా మార్చేస్తుందని చెబుతున్నారు. అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు, పేదలు, ధనవంతుల మధ్య అంతరాన్ని తగ్గించే పి4 కార్యక్రమం గురించి ప్రతి మీటింగ్‌లోనూ ప్రస్తావిస్తున్నారు, వాటి గురించి వివరించే ప్రయత్నం చేస్తున్నారు ఏపీ సీఎం. ఆయన కలలుగంటున్నట్టుగా… ఇవన్నీ అమలైతే… వాస్తవ రూపం దాలిస్తే…. అస్సలు తిరుగే ఉండదు. కేవలం అమరావతే కాదు, మొత్తం రాష్ట్ర ముఖ చిత్రమే మారిపోతుంది. కానీ….ఎక్కడో చిన్న తేడా కొడితే… అన్న అనుమానం కలుగుతోందట ఇప్పుడు టీడీపీ వర్గాల్లో. ఇవి సక్సెస్ అయితే… పార్టీకి కూడా ఎంత మేలు జరుగుతుందో…తేడా కొడితే…. అంతకు మించిన నష్టం జరుగుతుందన్న చర్చలు నడుస్తున్నాయట పార్టీ వర్గాల్లో. అసలు ప్రస్తుతం వీటి ప్రచారం వల్ల వస్తున్న మైలేజ్ ఎంత అని కూడా కొందరు లెక్కలు తీస్తున్నట్టు సమాచారం.
ఇవన్నీ సామాన్య జనానికి అర్ధమయ్యేలా, వాళ్ళ ఆలోచనలకు దగ్గరగా ఉన్నాయా అన్నది ఇప్పుడు టీడీపీలో ఇంటర్నల్ డిస్కషన్ అట. క్వాంటం కంప్యూటర్ గురించి సీఎం చంద్రబాబు పదేపదే ప్రస్తావిస్తున్నారు. కానీ… రాష్ట్రంలో మెజార్టీ ప్రజలకు అదో బ్రహ్మపదార్ధంలా అనిపిస్తోందని, అర్ధంకాని భాషలో కాకుండా…. అసలు క్వాంటం కంప్యూటర్ అంటే ఏంటి? దాని వల్ల కలిగే ప్రయోజనాలేంటి? ఎన్ని ఉద్యోగాలు వస్తాయి లాంటి వాటిని పూర్తిగా వివరింగగలిగినప్పుడే సామాన్య జనం అర్ధం చేసుకుంటారని, దాని గురించి ఆలోచిస్తారన్నది టీడీపీలోమెజార్టీ అభిప్రాయంగా తెలుస్తోంది. అందుకు బదులు ఎవరికి వారు… క్వాంటం, క్వాంటం అంటూ చెప్పుకుంటూ పోతే… సామాన్య జనానికి అర్ధంగాక… వీళ్ళింతే, ఏవేవో చెబుతుంటారని అపార్ధం చేసుకునే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోందట పార్టీలో. అసలు క్వాంటం కంప్యూటర్ అంటే… రాష్ట్రంలో చదువుకున్న వాళ్ళకు సైతం మందికి అర్ధం అవుతుందన్నది టీడీపీ కేడర్ క్వశ్చన్. మనం ఏదన్నా చెబితే… కచ్చితంగా ఉండాలి, చుట్ట కాల్చుకుంటూ రచ్చబండ పక్కన కూర్చున్న వాళ్ళకు కూడా అర్ధమయ్యేలా ఉంటేనే వాళ్ళు కనెక్ట్ అవుతారు తప్ప… అదేదో మనకు సంబంధం లేనిది అన్నట్టుగా ఉండకూడదన్నది కూటమి నాయకుల మనోగతంగా తెలుస్తోంది.
ఇక 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. అందుకు సంబంధించి అనేక సమావేశాలు కూడా జరిగాయి. ఐదేళ్ళలో 20 లక్షలు ఉద్యోగాలు ఇవ్వాలంటే… ఏడాదికి నాలుగు లక్షలు ఉండాలి. ఇది అసలు ఆచరణలో సాధ్యమా…లేక అలవికాని, అమలు చేయలేని హామీగానే మిగిలి పోతుందా అన్న కంగారు సైతం తెలుగుదేశం కేడర్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. మరి ఇప్పటిదాకా ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి లెక్క చూసుకోవాలని, దాన్ని బట్టి సవరణలో వివరణలో ఉంటే మంచిది తప్ప…. ఎప్పుడూ… 20 లక్షల పాట పాడుతూనే ఉంటే… చివరికి ఏదో ఒక పాయింట్‌లో అది బూమరాంగ్ అవుతుందన్న టాక్ సైతం నడుస్తోంది టీడీపీ సర్కిల్స్‌లో. ఇక p4 సంగతి సరే సరి.
సమాజంలో ధనికులు పేదలకు సాయం చేయాలి, వారికి చేయూతనివ్వాలన్న కాన్సెప్ట్ మంచిదే అయినా…అది స్వచ్చందంగా ఉండాలి. ఆ మధ్య ఉద్యోగులకు టార్గెట్స్ పెట్టారన్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. చివరికి ప్రభుత్వం నాలుక్కరుచుకుని ఎవ్వరికీ టార్గెట్ పెట్టలేదని, వాళ్ళకు ఇష్టం అయితేనే అంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ అమలులో వచ్చే ఇబ్బందులు అన్ని ఇన్ని కావన్నది రాజకీయవర్గాల మాట. ధనికులకు పేద కుటుంబాల్ని దత్తత ఇచ్చేస్తే…. మధ్యలో పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఏం చేస్తుందన్న ప్రశ్నలు కూడా ఇప్పటికే మొదలైపోయాయి. అసలు ఎంతమంది అందుకు సముఖంగా ఉంటారు? రాష్ట్రంలో ఉన్న బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే స్థాయి మార్గదర్శులు ఎందరున్నారులాంటి అనుమానాలు చాలా మందికి ఉన్నాయట. ఇలా ప్రభుత్వం కీలకంగా భావిస్తున్న అంశాల మీద సామాన్య జనంలో సైతం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. వాస్తవాలతో పొంతన లేకుండా… పెద్ద పెద్ద టార్గెట్స్ పెట్టుకుంటే… రేపు ఎక్కడ చిన్న తేడా కొట్టినా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని, గతంలో అమరావతి విషయంలో ఇదే కదా జరిగింది అంటూ కూటమి వర్గాల్లోనే అంతర్గత చర్చ జరుగుతోందట. అలాంటి విషయాల్లో ప్రచారం ఎక్కువ చేయకుండా… టార్గెట్ రీచ్ అయ్యాక ఎంత ఎక్కువగా చెప్పుకున్నా ఇబ్బంది ఉండబోదన్నది టీడీపీ కేడర్ మనోగతం అట.