అందరిదీ ఒకే పార్టీ…. అంతా అధికారంలోనే ఉన్నారు. అయినా సరే… ఎవరికీ ఎవరితో పడటం లేదా? ఆ ఉమ్మడి జిల్లాలో టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఢీ అంటే ఢీ అంటున్నారా? లోపం ఎక్కడుంది? ఎందుకు మొదలైందా సమస్య? మరీ ఘోరంగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థి ఎందుకు వచ్చింది? ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయాలే వేరప్పా….అక్కడ ఎవరి మాటా ఎవరూ వినరప్పా…ఎవరికి వారే రాజులు, రారాజులు. ఇదీ జిల్లాలో సమస్యల ప్రస్తావన వచ్చినప్పుడల్లా… కొందరు పెద్ద నాయకుల మధ్య జరిగే చర్చ. ఎవరికి వారే మోనార్క్‌లమనుకోవడం ఒక ఎత్తయితే… బౌండరీస్ ఫిక్స్ చేసుకుని అవతలి వాళ్ళు ఎవరైనాసరే… నా నియోజకవర్గంలో వేలు పెడితే ఊరుకునే ప్రసక్తే లేదన్నట్టుగా ఉంటుంది వ్యవహారం. ఈ వైఖరే ఇప్పుడు జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో సమస్యలకు దారితీస్తోందట. అధికార పార్టీకే చెందిన కొందరు ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొందని చెప్పుకుంటున్నారు. దీంతో లోక్‌సభ సభ్యులు కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నట్టు సమాచారం. మిగతా చోట్ల అధికారిక కార్యక్రమాలైనా సరే… కాలుపెట్టలేని పరిస్థితి వుందంటున్నారు. గెలిచి ఏడాది దాటాక కూడా కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీలు కాలు పెట్టలేకపోయారంటే…. పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చని అంటున్నారు పరిశీలకులు.
అదే సమయంలో ఒంటి చేత్తో చప్పట్లు మోగవుకదా… ఎంపీల వైపు నుంచి సమస్య ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. నంద్యాల జిల్లాలోని రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రమే ఎంపీ, ఎమ్మెల్యేలు కలసి పనిచేస్తున్నారు. మిగిలిన ఐదు చోట్ల ఎవరి దారి వారిదే. కేంద్రప్రభుత్వ నిధులతో మంజూరైన వికలాంగుల పరికరాల పంపిణీ, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం కోసం ఆ మధ్య శ్రీశైలం సెగ్మెంట్‌లోని ఆత్మకూరుకు ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మాజీ మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి వెళ్లగా … లోకల్ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేకి చెప్పకుండా, ఆయనతో కలిసి కార్యక్రమాలు నిర్వహించకుండా మీకు మీరు వచ్చి సొంతంగా కార్యక్రమాలు చేసుకుని వెళ్తామంటే ఊరుకుంటామా అంటూ బీభత్సం చేశారు. ఏరాసు ప్రతాప రెడ్డి, ఆయన ఇంటి మీద దాడి కూడా చేశారు. అసలు విషయం ఏంటంటే… శ్రీశైలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి కలసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదట. అటు పాణ్యం సెగ్మెంట్‌లోనూ… ఎంపీ శబరి వికలాంగులకు పరికరాల పంపిణీ కార్యక్రమం ఖరారు చేసుకొని తర్వాత రద్దు చేసుకున్నట్టు తెలిసింది. ఇక్కడ కూడా ఎంపీకి, ఎమ్మెల్యే గౌరు చరితకు మధ్య సయోధ్య లేదని చెప్పుకుంటున్నారు. ఫీల్డ్ అసిస్టెంట్స్, నామినేటెడ్ పదవుల విషయంలో విబేధాలు ఉన్నట్టు సమాచారం.
నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్యకు, నంద్యాల ఎంపీ శబరికి అస్సలు పడటం లేదట. ఎమ్మెల్యే జయసూర్య టీడీపీ నంద్యాల పార్లమెంటు మాజీ ఇంచార్జి శివానంద రెడ్డి వర్గీయుడు అన్న కారణంతో ఇద్దరి మధ్య విభేదాలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల, ఎంపీ శబరి మధ్య అస్సలు సమన్వయం లేదట. ఎన్నికల సమయంలో కలిసి ప్రచారం చేయడం మినహా…ప్రభుత్వం ఏర్పడ్డాక… ఇంతవరకు వాళ్ళిద్దరూ కలిసి ఒక్క ప్రభుత్వ కార్యక్రమంలో కూడా పాల్గొనలేదు. అయితే… డోన్ నియోజకవర్గంలో మాత్రం ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, ఎంపీ బైరెడ్డి శబరి సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మళ్ళీ బనగానపల్లె దగ్గరికి వచ్చేసరికి మాత్రం తేడా కొడుతోంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, శబరి వ్యవహారం ఉప్పు నిప్పులాగే ఉందని చెప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో ఏ కార్యక్రమానికి అటెండ్ అవలేదు. నంద్యాల నియోజకవర్గంలో మాత్రం మంత్రి ఫరూక్, ఎంపీ మధ్య అంతగా విబేధాలు లేవని తెలిసింది. అటు కర్నూలు జిల్లాలో కూడా ఎంపీ బస్తిపాటి నాగరాజుకు, మెజార్టీ ఎమ్మెల్యేలకు పొసగడం లేదంటున్నారు. ఎంపీని కొందరు లెక్కచేయడం లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడే స్వయంగా చెప్పడం ఇక్కడ ప్రత్యేకం. సీఎం చంద్రబాబు బీసీలకు ప్రాధాన్యత ఇచ్చి గెలిపిస్తే ఎంపీని ఖాతరు చేయకపోవడం కరెక్ట్ కాదని అభిప్రాయపడ్డారు తిక్కారెడ్డి.
బస్తిపాటికి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరికి మధ్య సమన్వయం ఉంది. ఇక మిగిలిన ఎమ్మెల్యేలందరితో ఆయన సంబంధాలు అంతంత మాత్రమేనట. ఇలా… ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేక.. ఎవరికి వారే అన్నట్టుగా ఉండటంతో… మధ్యలో కేడర్ నలిగిపోతున్నట్టు సమాచారం. మరోవైపు ఎమ్మెల్యేలతో కలసి పనిచేయాలని, వాళ్ళ ప్రమేయం లేకుండా అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగే ప్రయత్నం చేయవద్దని ఎంపీలకు టీడీపీ అధిష్టానం స్పష్టమైన ఆదేశాలిచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వాటిని పాటిస్తారా లేదా అన్న సంగతి పక్కనబెడితే… అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల మధ్య సమన్వయం లేకపోతే… అభివృద్ధి పడకేసి… అంతిమంగా పార్టీ కూడా దెబ్బతింటుందన్నది టీడీపీ కేడర్ వాయిస్.