ఆ ఎమ్మెల్యే కన్ను పడితే…. ఎటువంటి భూమి అయినా ఖల్లాసేనా? ఇప్పటికే వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబట్టేశారా? తమ్ముడితో కలిసి నియోజకవర్గంలోని కొండల్ని పిండి చేసేస్తున్నారా? ఈడీ దాడుల్లో అయ్యగారి బాగోతం మొత్తం అద్దంలో కనిపించిందా? అంత అడ్డగోలు వ్యవహారాలు నడిపిస్తున్న ఆ ఎమ్మెల్యే ఎవరు? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా బాగోతం? పటాన్‌చెరు నియోజకవర్గం టెక్నికల్‌గా సంగారెడ్డి జిల్లాలో ఉన్నా…. హైదరాబాద్ మహానగరంలో భాగంగానే భావిస్తుంటారు అంతా. ఇక ఔటర్ రింగ్ రోడ్డుకి ఆనుకునే ఉంటాయి సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలు. దాంతో… ఇక్కడ భూముల విలువ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. రేట్ల పరంగా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌తో పోటీ పడుతుంటాయి పటాన్ చెరు, అమీన్‌పూర్, తెల్లాపూర్, కొల్లూరు భూములు. సరిగ్గా ఇక్కడే తన పొలిటికల్, మజిల్ పవర్ వాడి పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూముల్ని చెరబడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏ ల్యాండ్ మీదైనా సార్ కన్నుపడితే ఖల్లాసేనని చెప్పుకుంటారు నియోజకవర్గంలో. 2014 నుంచి ఆయనే ఇక్కడ ఎమ్మెల్యే. దీంతో…నియోజకవర్గంలో గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడెక్కడ ఉందో… అణువణువూ మహిపాల్‌రెడ్డికి తెలుసు. సరిగ్గా… హైదరాబాద్ రియలెస్టేట్ రంగం పుంజుకునే టైంకి బీఆర్ఎస్ అధికారంలో ఉండటం, ఆ పార్టీ తరపున ఆయనే ఎమ్మెల్యేగా కొనసాగడంతో ఇక హద్దూ అదుపూ లేకుండా…. కంటికి నదురుగా కనిపించిన ప్రభుత్వ భూమినల్లా కబ్జా చేశారంటూ తీవ్ర ఆరోపణలున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల ఎకరాల ప్రభుత్వ భూమిని ఆయన అనుచరులు కూడా అప్పనంగా కాజేశారని చెప్పుకుంటారు.
అమీన్‌పూర్‌లో గోల్డెన్ కీ అనే వెంచర్ వేశారు ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి. అదంతా ప్రభుత్వ భూమేనని అప్పట్లో ఆయన ప్రత్యర్థులు ఆరోపించారు. ఇక పటాన్‌చెరు అతిపెద్ద పారిశ్రామికవాడ. గతంలో ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇక్కడ కార్మిక సంఘ నాయకుడిగా పని చేశారు. ఆ క్రమంలో అప్పుడు కూడా… ఏదో ఒక వంకతో యాజమాన్యాల నుంచి అడ్డగోలు వసూళ్ళకు పాల్పడ్డారన్న ప్రచారం జరిగింది. ఇక సార్… ఎన్నికల ఖర్చులో మెజార్టీ వాటా వివిధ పరిశ్రమల యాజమాన్యాలదేనట. ఎలక్షన్ టైం వస్తే చాలు… ఫండింగ్ పేరుతో ఎమ్మెల్యే, ఆయన అనుచరుల పంట పండినట్టేనని అంటున్నారు. ఇక మహిపాల్ రెడ్డికి మైనింగ్ బిజినెస్ కూడా ఉంది. సంతోష్ శాండ్ అండ్ గ్రానైట్ పేరుతో తమ్ముడు మధుతో కలిసి మైనింగ్ వ్యాపారం చేస్తున్నారాయన. పవర్ ఉంది, పలుకుబడి ఉంది, చేతిలో మైనింగ్ కంపెనీ ఉంది. ఇంకేం… ఆ దెబ్బకు పటాన్‌చెరు నియోజకవర్గంలోని గుట్టలన్నీ పాము పుట్టల సైజ్‌కు తరిగిపోయాయట. రూల్స్ గీల్స్ జాన్తానై… అడ్డొచ్చిన కొండను అడ్డంగా పిండి చేసేయడమేనంటూ విచ్చలవిడి మైనింగ్ చేశారన్న ఆరోపణలున్నాయి. ఎమ్మెల్యే మైనింగ్ కంపెనీపై గతంలో ఏకంగా ఈడీ దాడులు జరిగాయి. మహిపాల్‌రెడ్డి, ఆయన సోదరుడి ఇంట్లో సోదాలు చేశారు అధికారులు.
ఆ టైంలో వందల కోట్ల రూపాయల విలువైన డాక్యుమెంట్స్‌ను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది. 300 కోట్ల రూపాయల అక్రమ మైనింగ్ కేసులో సోదాలు నిర్వహించిన ఈడీ… తాజాగా 80 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. అలాగే అనుమతి లేని చోట మైనింగ్ చేసినట్టు నిర్ధారించింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ఆడిందే ఆట పాడిందే పాటగా నడిచింది. అందుకే అక్రమ మైనింగ్ అని తెలిసి కూడా అధికారులు ఎవ్వరూ అడ్డు చెప్పలేకపోయారట. దాన్ని ఆసరా చేసుకుని గూడెం బ్రదర్స్ కొండలు, గుట్టల్ని మాయం చేసేశారని చెప్పుకుంటారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మహిపాల్ రెడ్డి అక్రమాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉన్నతాధికారుల ఆదేశాలతో జిల్లా మైనింగ్ అధికారులు మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు మధుకి చెందిన గ్రానైట్ కంపెనీలపై దాడులు చేశారు. ఆ రైడ్స్‌లో సంచలన విషయాలు బయటపడ్డాయి. ప్రభుత్వానికి కట్టాల్సిన సీనరేజిని భారీగా ఎగ్గొట్టారని గుర్తించి భారీగా ఫైన్ వేశారు. 72.87 లక్షల మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని తవ్వేసి కేవలం 8.48 లక్షల మెట్రిక్ టన్నులకే సీనరేజీ చెల్లించినట్టు గుర్తించారు. దీంతో… మొత్తం కలిపి 341 కోట్ల రూపాయల సీనరేజీ చెల్లించమంటూ మదుసూధన్ రెడ్డికి నోటీసులు ఇచ్చారు.
ఇదే కేసులో ఎమ్మెల్యే తమ్ముడు జైలుకి వెళ్లి వచ్చారు. ఇక ఆ తర్వాత 2025 జులైలో కాంగ్రెస్‌లో చేరారు మహిపాల్ రెడ్డి. కేసుల నుంచి ఉపశమనం కోసం, అలాగే ప్రభుత్వానికి చెల్లించాల్సిన 341 కోట్ల పెనాల్టీ నుంచి తప్పించుకోవడానికే కండువా మార్చేసినట్టు అప్పట్లో గుసగుసలు వినిపించాయి. ఇలా అక్రమంగా సంపాదించిన డబ్బుల్నే ఆయన ఎన్నికల్లో మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చుచేసి గెలుస్తున్నారన్నది ప్రత్యర్థుల ఆరోపణ. మహిపాల్‌రెడ్డికి ప్రజా బలంకంటే డబ్బు బలమే ఎక్కువని ఆయన ప్రత్యర్థులు ప్రచారం చేస్తుంటారు. ఇక ఇదే సమయంలో మహిపాల్‌రెడ్డి మళ్లీ బీఆర్‌ఎస్ వైపు చూస్తున్నారన్న ప్రచారం కొద్ది రోజులుగా జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే… పాత కేసుల్ని మళ్ళీ తిరగదోడతారా అన్నది నియోజకవర్గంలో నడుస్తున్న తాజా చర్చ. ఓవరాల్‌గా గూడెం బ్రదర్స్ పటాన్‌చెరు ఏరియాలోని ప్రభుత్వ భూముల్ని చెరబడుతున్నారని, అక్రమ దందాలతో అడ్డగోలుగా సంపాదించిన సొమ్మును రాజకీయంగా నిలదొక్కుకోవడానికి వాడుతున్నారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి నియోజకవర్గంలో.