ఎక్కడ…? ఎమ్మెల్సీ ఎక్కడ…? పోస్ట్ వచ్చిన కొత్తల్లో పెద్ద పెద్ద టూర్ ప్లాన్స్ వేసి కొన్నాళ్ళు ఓ రేంజ్‌లో హడావిడి చేసిన నాయకుడు ఇప్పుడెందుకు ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు? అసలు ఏపీకే ఆయన చుట్టమైపోయారా? ప్రస్తుతం జనసేన వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ఏ ఎమ్మెల్సీ కోసం పార్టీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి? ఎందుకలా..? నాగబాబు…. జనసేన కీలక నేత. పార్టీలో పవన్ తర్వాత ఆ స్థాయి ప్రాధాన్యం ఇస్తుంది కేడర్. ఇక ఎమ్మెల్సీ పదవివచ్చిన కొత్తల్లో బాగా…. బిజీ బిజీగా గడిపారాయన. ఉత్తరాంధ్ర పర్యటనలు, పిఠాపురం మీటింగులు, పార్టీ బలోపేతానికి కమిటీలు అంటూ… గట్టి హంగామానే చేశారు. అదంతా చూసిన కేడర్ కూడా అన్నదమ్ములిద్దరూ యాక్టివ్ రోల్‌లో ఉంటే… క్షేత్ర స్థాయి నుంచి పార్టీ నిర్మాణం బాగా జరుగుతుంది. పవన్ ప్రభుత్వ వ్యవహారాల్లో బిజీగా ఉన్నా…. నాగబాబు పార్టీ పనుల్ని చక్కబెట్టవచ్చని అనుకున్నారట. అందుకు తగ్గట్టే ఎమ్మెల్సీ కూడా ఉత్తరాంధ్ర మీద ఫోకస్ పెట్టడానికి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాను కార్య క్షేత్రంగా ఎంచుకున్నట్టు కనిపించింది. జిల్లాకు వరుస టూర్స్ వేయడంతో… అది ఫిక్స్ అని కూడా అనుకున్నారు చాలామంది. కట్ చేస్తే… ఆ హడావిడి అంతా… మూన్నాళ్ళ ముచ్చటగానే మిగిలిపోయినట్టు కనిపిస్తోందని జనసేన వర్గాలే చెవులు కొరుక్కుంటున్న పరిస్థితి. నాగబాబులో ఆ ఉత్సాహం ఇప్పుడు కనిపించడం లేదని, ఎక్కువగా హైదరాబాద్‌లోనే ఉంటూ రాష్ట్రానికి చుట్టపు చూపుగా వస్తున్నారని, ఎందుకిలా…? అన్న చర్చ జరుగుతోంది పార్టీ సర్కిల్స్‌లో. ఎమ్మెల్సీ హోదాలో… ఫుల్ లెంగ్త్ రోల్ పోషిస్తారనుకున్న నాయకుడు సడన్‌గా ఇలా ఎందుకు చేస్తున్నారన్నది గ్లాస్ కేడర్ క్వశ్చన్. క్షేత్ర స్థాయి పర్యటనల సంగతి తర్వాత…. అసలు ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కనీస స్పందన కూడా ఎందుకు ఉండటం లేదో అర్ధం కావడం లేదని అంటున్నారు కార్యకర్తలు. ఉలుకు పలుకు లేకుండా ఉండటం, పొలిటికల్ స్క్రీన్ మీద నాకేం క్యారెక్టర్ లేదన్నట్టుగా వ్యవహరించడం ఏంటో అర్ధం కావడం లేదంటున్నారు పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు. అటు పొలిటికల్ సర్కిల్స్‌లో కూడా దీనికి సంబంధించి రకరకాల అనుమానాలు పెరుగుతున్నాయి.
నాగబాబు పొలిటికల్ ఆబ్సెన్స్ వెనక బలమైన కారణాలే ఉండి ఉండవచ్చన్నది మెజార్టీ అభిప్రాయం. గతంలో స్వయంగా సీఎం చంద్రబాబే నాగబాబుకు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేగాని, ఎమ్మెల్సీగాని అవకముందే… మంత్రి పదవి ఇస్తానని స్వయంగా ముఖ్యమంత్రే ప్రకటించడం, అధికారిక లేఖ ఇవ్వడం బహుశా చరిత్రలో అదే మొదటిసారి కావచ్చని అంటున్నారు. ఆ మాట చెప్పి ఏడాది కావొస్తున్నా..ఇప్పటికీ నాగబాబుకు కేబినెట్ బెర్త్ దక్కలేదు, అసలా ఊసే వినిపించడం లేదు. దీంతో… ప్లాన్ మారిపోయిందా..? క్యాస్ట్ ఈక్వేషన్ బ్రేక్ అయిందా..అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఎమ్మెల్సీ పొలిటికల్ మౌనానికి, మంత్రి పదవికి లింక్ ఉందా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల డౌట్. తమ్ముడు పవన్ అన్నా… అని పిలిస్తే వెంటనే పలికేంత దూరంలో ఇన్నాళ్ళు ఉన్న నాగబాబు ఇప్పుడు మాత్రం ఎక్కువగా హైదరాబాద్‌కే పరిమితం అవడానికి కారణం అసంతృప్తే కావచ్చన్నది ఎక్కువ మంది అభిప్రాయం. పార్టీ ప్రధాన కార్యదర్శి అయినా కూడా….ప్రస్తుతం ఎక్కడా యాక్టివిటీస్‌లో కనిపించకపోవడం జనసేన శ్రేణుల్లో గందరగోళం పెంచుతోంది. పవన్ పాలనా వ్యవహారాల్లో బిజీగా ఉన్నా.. నాగబాబు పార్టీని నడిపిస్తారని అనుకున్న జనసేన నేతలు ఈ పరిణామంతో డీలా పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రతిసారీ… పవన్‌ను తాము కలవడం సాధ్యం కాదు కాబట్టి… క్షేత్ర స్థాయి పరిస్థితులు, పార్టీ వ్యవహారాలను నాగబాబు ద్వారా పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకు వద్దామనుకున్న వాళ్ళంతా డిజప్పాయింట్ అవుతున్నట్టు చెబుతున్నారు. అంతేకాదు అన్న, మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్ మీద పెద్ద రచ్చ జరిగినా…..నాగబాబు మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఏంటన్న చర్చలు నడుస్తున్నాయి. పవన్‌కు అంటే… పొలిటికల్ కంపల్షన్స్ ఉంటాయి. కానీ… నాగబాబుకు మాట్లాడడానికి ఏమైందన్న విమర్శలు సైతం వస్తున్నాయి. మరి ఎమ్మెల్సీ ఈ మౌనాన్ని ఇలాగే కొనసాగిస్తారా లేక నిశ్శబ్దాన్ని వీలైనంత త్వరగా బద్దలు కొడతారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.