OTR : మిర్యాలగూడలో ‘ముగ్గురు’ నేతల యుగో గేమ్.. ఆధిపత్య పోరులో నలుగుతున్న క్యాడర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ నియోజకవర్గంలో మూడు ముక్కలాట నడుస్తోందా? నేతల మధ్య సమన్వయం లేక చివరికి డీఎస్పీ పోస్టింగ్ కూడా పెండింగ్‌లో పడిందా? ఎవరికి వారు మేం కోరుకున్నట్టే జరగాలని పట్టుదలకు పోవడమే సమస్యగా మారుతోందా? అంత పంతాలకు పోతున్న ఆ నాయకులు ఎవరు? ఎక్కడ జరుగుతోందా ఇగో గేమ్? మిర్యాలగూడ హస్తం పార్టీలో నేతల మధ్య పోరు నివురు గప్పిన నిప్పులా ఉంది. పార్టీ పదవులు, నామినేటెడ్ పోస్టుల భర్తీ, చివరికి నియోజకవర్గానికి సంబంధించిన కీలక అధికారుల పోస్టింగ్స్‌లో సైతం ప్రతిష్టంభనకు నేతల మధ్య గ్యాప్ ఉండటమే కారణమని అంటున్నారు. స్థానిక ఎమ్మెల్యేగా బత్తుల లక్ష్మారెడ్డి ఎన్నికైన తర్వాత మొదలైన పోరు.. శంకర్ నాయక్ ఎమ్మెల్సీ అయ్యాక పతాక స్థాయికి చేరిందని కాంగ్రెస్‌లోనే మాట్లాడుకుంటున్నారు.పార్టీ సీనియర్ నేత జానారెడ్డి ఫ్యామిలీకి మిర్యాలగూడలో గట్టి పట్టు ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ వర్గ పోరు పీక్స్ కు చేరుతోందని అంటున్నారు. సర్పంచ్ ఎన్నికల సమయంలో వర్గ పోరుకు బీజం పడగా… మిర్యాలగూడ మున్సిపల్ ఎన్నికల్లో అది పెరిగిపోయింది. అంతకు ముందు నుంచే నియోజకవర్గ ముఖ్య నేతలంతా కడుపులో కత్తులు పెట్టుకొని కౌగిలించుకుంటున్నారని… నోటితో మాట్లాడుకుంటూ… నొసటితో వెక్కిరించుకుంటున్నారని కార్యకర్తలే చెబుతున్నారు. కొన్నిసార్లు అయితే ఉద్దేశపూర్వకంగానే ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పార్టీతోపాటు అధికారిక కార్యక్రమాలకు కూడా వేర్వేరుగా హాజరవుతున్నారట. బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడ ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటినుండి పదవుల విషయంలో ఓ క్లారిటీతో ఉన్నారట.తాను మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గా పనిచేసినప్పుడు, మిర్యాలగూడ కాంగ్రెస్ టికెట్ ఆశించి ప్రజల్లోకి వెళ్లినప్పుడు, తనతో కలిసి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన వారికి.. అలాగే బీఆర్ఎస్తో పోరాడినప్పుడు తన వెన్నంటి ఉన్న నేతలకు అవకాశం ఉన్నచోటల్లా పదవులు ఇస్తున్నారు. దీంతో పదవులురాని మరో వర్గం నేతలు ఎమ్మెల్సీ శంకర్ నాయక్‌ను, నియోజకవర్గంపై గట్టి పట్టు ఉన్న జానారెడ్డి కుటుంబాన్ని ఆశ్రయిస్తున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో…నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో వాళ్ళిద్దరూ జోక్యం చేసుకుంటున్నారట.
శంకర్ నాయక్ జోక్యాన్ని మొదటి నుండి బహిరంగంగానే వ్యతిరేకిస్తున్న ఎమ్మెల్యే… జానారెడ్డి ఫ్యామిలీ విషయంలో అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. పార్టీ, నామినేటెడ్ పదవుల విషయంలో అట్నుంచి వస్తున్న ప్రతిపాదనల విషయంలో ఎమ్మెల్యే మౌనం వహించడం.. భర్తీని వాయిదా వేయడం లాంటివి చేస్తూ… ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే చర్చ హస్తం పార్టీలో జరుగుతోంది. సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై వివాదం రేగగా…ఇప్పుడా అసంతృప్తి ఇంకా పెరుగుతోందని అంటున్నారు. మండల అధ్యక్షుల నియామకంలో అసంతృప్తి, నియోజకవర్గస్థాయి నామినేటెడ్ పదవుల పంపిణీలో వివాదాలు, మార్కెట్ కమిటీల ప్రకటన సుదీర్ఘకాలంగా వాయిదా పడడం వెనక ముఖ్య నేతల మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణం అని అంటున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ పోస్ట్ రెండు నెలల నుంచి ఖాళీగా ఉండటానికి కూడా ఎమ్మెల్యే- ఎమ్మెల్సీతోపాటు నల్లగొండ ఎంపీ రఘువీర్ రెడ్డి జోక్యమే ప్రధాన కారణమని చర్చ జరుగుతోంది. పార్టీ పదవుల్లోనూ, నామినేటెడ్ పదవుల్లో, నియోజకవర్గంలో కీలక పోస్టుల్లో కూడా తన వారే ఉండాలని ఎమ్మెల్యే పట్టు పట్టడం వల్లే శాంతిభద్రతల విభాగానికి చెందిన డీఎస్పీ పోస్ట్ కూడా రెండు నెలలుగా ఖాళీగా ఉందనే అభిప్రాయం ఉంది. మిర్యాలగూడ డి.ఎస్.పి పోస్టుకు ఇప్పటికే పలు పేర్లు తెరపైకి రాగా సామాజిక సమీకరణలతో ఎమ్మెల్యే అభ్యంతరం చెప్తున్నారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. తనది రెడ్డి సామాజిక వర్గం కాబట్టి అదే కులానికి చెందిన అధికారి వద్దని అంటున్నారట ఎమ్మెల్యే. కానీ… నిజాయితీగా, నిక్కచ్చిగా పనిచేసే వ్యక్తి కావాలిగానీ కులంతో పనేముందన్న చర్చ ఇంటర్నల్‌గా జరుగుతోందట. మొత్తంగా ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ జానా ఫ్యామిలీ మధ్య ఉన్న ఆధిపత్య పోరుతో మిర్యాలగూడ కాంగ్రెస్‌లో తుఫాన్‌కు ముందు ప్రశాంతత కనిపిస్తోందని అంటున్నారు హస్తం నేతలు.
Also Read
తాజావార్తలు
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
Flash Flood Alerts: ఏపీ, తెలంగాణలో ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికలు.. ఈ జిల్లాలకు ముప్పు..!
-
Vivo Y600i: వివో Y600i లిస్టింగ్.. 6.87 అంగుళాల డిస్ప్లే, 8,000mAh బ్యాటరీ!
-
India vs Pakistan T20 World Cup Final: ఆఖరి బంతి వరకు ఉత్కంఠ.. 24 ఏళ్ల తర్వాత మరో ప్రపంచకప్.. ధోనీ సేన సృష్టించిన చరిత్ర
-
Horror Stories : మళ్లీ హారర్ కామెడీ, హారర్ థ్రిల్లర్స్‌పై బాలీవుడ్ ఫోకస్
ట్రెండింగ్
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!