OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?

Kuppam

Kuppam

కుప్పంలో పాత నేత మళ్ళీ కీలక బాధ్యతల్లోకి రాబోతున్నారా? ఆ దిశగా సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయం తీసేసుకున్నారా? స్థానిక ఎన్నికల్లో నాటి చేదు జ్ఞాపకాలు టీడీపీ పెద్దల్ని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయా? కొత్త ఏఎస్పీ, ముగ్గురు నేతల ఫార్ములా దేనికి సంకేతం? లోకల్‌ లీడర్స్‌పై చంద్రబాబు ఎందుకు గరంగరంగా ఉన్నారు? ఇన్ఛార్జ్‌ పదవి నుంచి ఉన్నఫళంగా తప్పించిన నేత పేరే మళ్ళీ ఎందుకు తెర మీదికి వస్తోంది? కుప్పం అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఇంకా చెప్పాలంటే… సీఎం చంద్రబాబు అడ్డా. 1989 నుంచి ఇక్కడ వరుసబెట్టి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారాయన. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భారీ మెజారిటీతో నెగ్గి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ అసెంబ్లీ గెలుపు వేరు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల గ్రౌండ్ రియాలిటీ వేరు. సరిగ్గా ఇక్కడే అధినేతకు పాత గాయం గుర్తుకు వస్తోందని చెప్పుకుంటున్నారు. 2021 మున్సిపల్ ఎన్నికల్లో చంద్రబాబు సొంత ఇలాకాలోనే వైసీపీ జెండా ఎగరేసింది. కుప్పం టౌన్‌లోని 25 వార్డుల్లో 19 స్థానాలను ప్రత్యర్థి పార్టీ ఎగరేసుకుపోతే, టీడీపీ కేవలం 6 సీట్లకే పరిమితమైంది. ఇక పరిషత్ పోరులోనూ మొత్తం 4 జడ్పీటీసీలను వైసీపీ క్లీన్ స్వీప్ చేయడమే కాకుండా, 98 శాతానికి పైగా ఎంపీటీసీలను నాడు కైవసం చేసుకుంది. ఇక మొత్తం 89 గ్రామ పంచాయతీలు ఉండగా… 75 వైసీపీ ఖాతాలోనే పడ్డాయి.

 

అప్పుడు కూడా… అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గెలిచినా… స్థానిక సంస్థల్లో మాత్రం వైసీపీ పాగా వేసిన చేదు జ్ఞాపకాలు టిడిపి అధిష్ఠానాన్ని ఇప్పటికీ వెంటాడుతున్నాయట. ఇప్పుడు అధికారంలో ఉన్నామన్న ధీమా పెరుగుతున్నా… ఎందుకైనా మంచిదనుకుంటూ… టీడీపీ అధినేత సొంత నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల కోసం ఇప్పట్నుంచే అలర్ట్ అయినట్టు చెప్పుకుంటున్నారు. ఇటీవల అమరావతిలో కుప్పం సమన్వయ కమిటీ నేతలతో చంద్రబాబు నిర్వహించిన సమీక్షా సమావేశాన్నే ఇందుకు ఉదాహరణగా చెబుతున్నారు లోకల్ లీడర్లు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఇంత వేగంగా అమలవుతున్నా వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో స్థానిక నాయకులు పూర్తిగా విఫలమవుతున్నారంటూ చంద్రబాబు నేరుగానే క్లాస్ తీసుకున్నారట. “ఎన్నిసార్లు చెప్పినా జనం మధ్యకు వెళ్లరా? పదవులు అనుభవించడం తప్ప బాధ్యత లేదా?” అంటూ లోకల్ లీడర్లపై సీరియస్ అయినట్టు సమాచారం. నాయకులు గ్రూపులుగా విడిపోయి, ఒకరి కాళ్లు ఒకరు లాక్కుంటూ కాలక్షేపం చేస్తున్నారన్నది అధినేత గ్రహించిన గ్రౌండ్ రియాలిటీ అట. ఈ అలసత్వం ఇలాగే కొనసాగితే రేపు లోకల్ పోరులో పాత సీన్ రిపీట్ అవుతుందని, అందుకే పరిస్థితి చక్కదిద్దడానికి స్వయంగా బాబుగారే గేర్ మార్చి ఫోకస్‌ పెట్టారని చెబుతున్నారు కుప్పం టీడీపీ లీడర్స్‌. ఆ రోజుల్లో కుప్పం లోకల్‌ బాడీస్‌లో వైసీపీ ఎలా గెలిచిందో తెలిసినా… నియోజవర్గ ప్రజలకు వివరించడంలో నేతలు విఫలమయ్యారన్న అభిప్రాయం ఉందట. కనీసం ఇప్పుడైనా…. జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించడంలో కూడా లోకల్‌ లీడర్స్‌ విఫలమవుతున్నారన్న రిపోర్ట్‌ సీఎంకు చేరినట్టు తెలిసింది. అందుకే స్థానిక నాయకులతో చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు చెప్పుకుంటున్నారు.

అయితే… సమావేశంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌ ప్రస్తావన రావడం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు టీడీపీ లీడర్స్‌. ప్రస్తుత స్థానిక నాయకత్వం బలహీనంగా ఉందన్న అభిప్రాయాన్ని తొలుత చంద్రబాబు వ్యక్తం చేశారట. ప్రజల్లోకి వెళ్లడం లేదని, చేసిన అభివృద్ధిని చెప్పుకోవడంలో విఫలమవుతున్నారని అంటూనే… స్థానిక ఎన్నికల సారథ్యం కోసం మండలానికి ముగ్గురు చొప్పున నాయకులను నియమిస్తానని చెప్పినట్టు తెలిసింది. అదే సయమంలో ఎమ్మెల్సీ కంచర్ల ప్రస్తావన తీసుకొచ్చారట. స్థానిక ఎన్నికల వరకు కంచర్ల శ్రీకాంత్‌ను అబ్జర్వర్‌గా వేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నట్లుగా చెప్పారట చంద్రబాబు. స్థానిక ఎన్నికల్లో గెలుపే మీకు ప్రామాణికం అంటూ ఇప్పటికే ఎమ్మెల్యేలకు చెప్పేసింది టీడీపీ అధిష్టానం. అలాంటిది చంద్రబాబు సొంత నియోజకవర్గంలో ఏమాత్రం తేడా జరిగినా దాని ప్రభావం రాష్ట్రం మొత్తం మీద ఉంటుంది. అందుకే… కేవలం స్థానిక నాయకుల మీదే భారం వేసి కూర్చోకుండా… మండలానికి ముగ్గురు కీలక నేతలను ఇన్‌చార్జ్‌లుగా పెట్టి వాళ్ళ మీద కంచర్ల లాంటి గట్టినేతను పర్యవేక్షణ కోసం నియమించాలన్నది చంద్రబాబు వ్యూహంగా అంచనా వేస్తున్నారు. కంచర్లను చిత్తూరు జిల్లా ఎన్నికల పరిశీలకుడుగా నియమించబోతున్నారన్న చర్చ ఇప్పటికే టీడీపీలో నడుస్తోంది. ఆ రకంగా…. ఆయనకు కుప్పంలో కీలక బాధ్యత అప్పగించే అవకాశం ఉందని అంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏకగ్రీవాలు కానివ్వబోమని వైసిపి ఇన్చార్జ్, ఎమ్మెల్సీ భరత్ సవాల్ చేస్తుంటే… చంద్రబాబు కూడా… మనకు బలవంతపు ఏకగ్రీవాలు వద్దని వారించినట్టు తెలిసింది. మనం కూడా… వాళ్ళలాగా తప్పులు చేస్తే ప్రజలు క్షమించరని, జరుగుతున్న అభివృద్ధే సునాయాసంగా గెలిపిస్తుందని మీటింగ్‌లో అన్నట్టు తెలిసింది. మొత్తానికి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న అధినేత ఇస్తున్న వార్నింగ్స్‌, మార్పులు చేర్పులతో కుప్పం తమ్ముళ్లు నిద్రలేచి లోకల్ పోరులో గెలుస్తారా లేక బయటి నేతల రాకతో పెత్తనం దక్కలేదని హర్ట్‌ అయి పార్టీకి కొత్త తలనొప్పులు తెచ్చిపెడతారా అన్నదే కీలకాంశం అంటున్నారు రాజకీయ పరిశీలకులు.