జూబ్లీహిల్స్ బై పోల్‌లో బీఆర్‌ఎస్ స్ట్రాటజీ మారుతోందా? ఓటర్లకు దగ్గరవడానికి కొత్త కొత్త ఎత్తులు వేస్తోందా? పోటీలో లేని ఓ రెండు ప్రధాన రాజకీయ పార్టీల సానుభూతిపరుల్ని తనవైపునకు తిప్పుకునే స్కెచ్ వేసిందా? ఆ దిశగా వర్కౌట్ చేయడం కూడా మొదలైపోయిందా? అసలు కారు పార్టీ కొత్త ప్లాన్ ఏంటి? వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? జూబ్లీహిల్స్ సిట్టింగ్ సీటును తిరిగి నిలబెట్టుకునేందుకు బీఆర్‌ఎస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎలాగైనా గెలిచి తీరాలన్న యాంగిల్‌లో రకరకాల స్కెచ్‌లు వేస్తోంది. కుల సంఘాల వారీ మీటింగ్‌లు, ఆసక్తి ఉన్నవాళ్ళని పార్టీలోకి ఆహ్వానించడాల్లాంటి కార్యక్రమాలు చేస్తోంది. అదే సమయంలో ఈ నియోజకవర్గంలో అంతో ఇంతో బలం ఉండి, పోటీ చేయని ఇతర పార్టీల మీద కూడా దృష్టి పెట్టారు గులాబీ పెద్దలు. అందులో భాగంగానే… ఏపీలో బీజేపీతో కలిసి కూటమి భాగస్వామి అయినాసరే… ఇక్కడి టీడీపీ సానుభూతిపరుల మీద గురిపెట్టినట్టు తెలిసింది.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ 2014 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరపునే గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లోకి మారినా సరే….. స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు, సానుభూతిపరులతో సత్సబంధాలు కొనసాగిస్తూనే వచ్చారు. అలాగే… ఇక్కడ అంధ్రప్రదేశ్ మూలాలున్న ఓటర్ల పాత్ర కూడా చాలా కీలకం. అందుకే ఆ ఓట్లను టార్గెట్ చేస్తోందట బీఆర్‌ఎస్. రాజకీయ పరిస్థితుల దృష్ట్యా టిడిపి అధిష్టానం వేరే పార్టీలకు మద్దతు ప్రకటించినా ..లోకల్‌గా ఉండే ఆ పార్టీ క్యాడర్ మాత్రం తనకే సపోర్ట్ చేస్తుందని గతంలో చెప్పేవారు మాగంటి గోపీనాథ్. ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీని అనుసరించబోతోందట కారు పార్టీ. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ భాగస్వాములుగా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లో బీజేపీ పోటీ చేస్తోంది. అయినాసరే… టీడీపీ ఓట్లు బీజేపీ వైపునకు మళ్ళకుండా రకరకాల ఈక్వేషన్స్‌ను తెర మీదికి తెచ్చి ప్రచారం చేస్తోందట బీఆర్‌ఎస్.
ముఖ్యంగా టీడీపీ, జనసేన ఓట్ల మీద కన్నేసినట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిధిలో వైసీపీ సానుభూతిపరుల ఓట్లు కూడా ఉన్నా… వాళ్ళంతా డిఫాల్ట్‌గా తమకు వేసేస్తారని నమ్ముతున్న బీఆర్‌ఎస్ పెద్దలు కూటమి పార్టీల మీదే ఫోకస్ పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. బీజేపీ అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో టీడీపీ జెండాలు కూడా కనిపించాయి. అధికారికంగా టిడిపి, జనసేన బీజేపీకి మద్దతు ప్రకటించకున్నా.. కూటమిలో భాగమే కాబట్టి డిఫాల్ట్‌గా వారి మద్దతు కాషాయదళానికేనన్న చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో లోకల్ గా ఉన్న టీడీపీ, జనసేన క్యాడర్‌ను తమ వైపు తిప్పుకునేందుకు కారు నాయకులు గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో మాగంటి గోపీనాథ్‌తో మంచి సంబంధాలు ఉన్న టిడిపి నేతలను కూడా కలుస్తున్నారట బీఆర్‌ఎస్ లీడర్స్.
గోపీని సపోర్ట్ చేసినట్టుగానే… ఆయన భార్య సునీతకు కూడా మద్దతివ్వమని అడుగుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, జనసేన మద్దతుదారులు కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోఎక్కువగానే ఉండడంతో వారిపై కూడా గురి పెట్టింది గులాబీ పార్టీ. కూటమి సంబంధాలు ఏపీ వరకే పరిమితం కాబట్టి… జూబ్లీహిల్స్‌లో మాకు సపోర్ట్ చేయమని ఇంటర్నల్‌గా ప్రచారం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. మరోవైపు గత ఎన్నికల సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి బహిరంగంగానే మద్దతు ప్రకటించింది బీఆర్‌ఎస్. దీంతో ఈసారి ఇక్కడి వైసీపీ, జగన్ అభిమానులంతా కారు గుర్తుమీదే గుద్దేస్తారన్నది గులాబీ లెక్క. ఇలా… అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదలకుండా ఓటర్లకు దగ్గరవ్వాలనుకుంటున్నారు బీఆర్‌ఎస్ ముఖ్యులు. కూటమిలో ఉన్న బీజేపీని కాదని టీడీపీ, జనసేన అభిమానులు బీఆర్‌ఎస్ వైపు ఎంతవరకు మొగ్గుతారో చూడాలి.