జూబ్లీహిల్స్ పేరు వింటేనే… తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారు? వాళ్ళలో కనిపించని కంగారు పెరిగిపోవడానికి కారణం ఏంటి? కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం అవుతామని గొప్పలు చెప్పిన కాషాయ దళంలో ఇప్పుడు భయం పెరిగిపోవడానికి కారణం ఏంటి? జూబ్లీహిల్స్‌లో గెలవలేమని కౌంటింగ్‌కు ముందే వాళ్ళే డిసైడయ్యాక కూడా ఇంకా ఆరాటం దేని కోసం? లెట్స్ వాచ్. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ బీఆర్‌ఎస్‌ది గెలుపు పోరాటమైతే… బీజేపీది ఉనికి కోసం ఆరాటం. ముందంతా… ఇది త్రిముఖ పోరాటమని బీరాలు పలికిన కాషాయ దళం తీరా ఎగ్జిట్ పోల్స్‌ని చూసి డీలాపడిపోయిందట. అన్ని ఎగ్జిట్ పోల్స్‌లోనూ… బీజేపీది మూడో స్థానమే. అంతే కాదు, ఆ పార్టీ ఓట్ షేర్ 10 శాతం లోపే ఉంది. 2023లో ఇక్కడ బీజేపీకి 14 శాతం ఓట్లు పడ్డాయి. కానీ ఇప్పుడు అంతకన్నా తక్కువ వస్తాయని సర్వేలు చెబుతుండటంతో… కమలం నేతల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయట. ఒక వేళ ఈ సర్వేలే నిజమైతే పరిస్థితి ఏంటి? ప్రజలకు ఎలా ముఖం చూపించుకోగలం? పార్టీ పెద్దలకు ఏమని సమాధానం చెప్పుకోవాలంటూ తెలంగాణ బీజేపీ నాయకులు తెగ టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. ఓడిపోతామన్నది ఒక ఎత్తయితే…. మరీ అంత ఘోరమైన రిజల్ట్ వస్తుందా..? అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోందట. లోక్‌సభ ఎన్నికల తర్వాత మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎలక్షన్స్ జరగ్గా రెండిటిని గెల్చుకుంది బీజేపీ. పార్లమెంట్ ఎన్నికలతో పాటు జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో రెండో స్థానంలో నిలిచిలింది. అప్పుడు చెప్పుకోతగ్గ ఓట్లు పడ్డాయి. కానీ… ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఆ పార్టీ ఎక్కడో దూరంగా ఉందని చూపిస్తున్నాయి.
ఏదో ఒకటి రెండు కాకుండా… ఎగ్జిట్ పోల్స్ చేసిన ప్రతి సంస్థ బీజేపీకి డిపాజిట్స్ కూడా కష్టమేనన్నట్టు చెప్పేసింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఇంతకు ముందే బీజేపీకి డిపాజిట్ రాదని సవాల్ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అయితే 10 వేల ఓట్లు తెచ్చుకోండి చూద్దామని వ్యంగ్యంగా అన్నారు. దాంతో… ఇప్పుడు కమలం లీడర్స్‌లో కంగారు పెరుగుతోందట. జూబ్లీహిల్స్ పూర్తిగా అర్బన్ నియోజక వర్గం. ఇక్కడ కచ్చితంగా బీజేపీకి ఓటింగ్ ఉంటుంది. అలాంటి చోటే… ఫలితం దారుణంగా ఉంటే ఇక ముఖం చూపించుకోగలమా అని మధనపడుతున్నట్టు సమాచారం. ఇదే సమయంలో పార్టీలో ఉన్న ఓ వర్గం నేతలు మరికొందరిని టార్గెట్ చేస్తూ మాట్లాడే అవకాశం ఉందంటున్నారు. ఇది పార్టీ స్వయంకృతమని ఇప్పటికే వాయిస్ మొదలైపోయింది.ఈ పరిస్థితుల్లో కనీసం డిపాజిట్ దక్కకుంటే…. ఇంటా బయట విమర్శలు తప్పవన్నది కొందరు ముఖ్యుల భయంగా తెలుస్తోంది. అటు పార్టీ శ్రేణుల్లో కూడా ఆత్మవిశ్వాసం సన్నగిల్లే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే… నైతికంగా పార్టీమీద తీవ్ర ప్రభావం పడుతుందన్న విశ్లేషణలున్నాయి. నేతలంతా సమన్వయంతో పనిచేసుకునేలా పార్టీ చర్యలు తీసుకోక పోతే… సమష్టితత్వం రాకపోతే పార్టీ భవిష్యత్ లో కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయన్న టాక్ ఆల్రెడీ మొదలైపోయింది కాషాయ వర్గాల్లో. అసలు అధికార కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం కావాలని ఆరాటపడుతున్న కమలం పార్టీకి జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ షాకిస్తాయన్న అంచనాలు పెరుగుతున్నాయి. గెలుపు సంగతి తర్వాత గత ఎన్నికల్లో వచ్చిన వాటికన్నా ఒక్క ఓటైనా ఎక్కువ వస్తే చాలు……. అదే పదివేలని అనుకుంటున్నారట బీజేపీ నాయకులు.