జనం సొమ్ముతో జల్సాలు చేయడమంటే జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్స్‌కు మహా సరదానా? ముక్కు పిండి వసూలు చేసే పన్నుల డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు చేయడానికి పోటీలు పడుతున్నారా? ఇంకో 40 రోజుల్లో పదవి నుంచి దిగిపోయే కార్పొరేటర్స్ ఏం వెలగబెడదామని, ఎవర్ని ఉద్ధరిద్దామని స్టడీ టూర్స్ వేయబోతున్నారు? అవి స్టడీ టూర్సా? లేక ఫైనల్ స్టేజ్‌లో వేసే జాలీ ట్రిప్సా? లెట్స్ వాచ్. గ్రేటర్ హైదరాబాద్‌లో మరో స్టడీ టూర్‌కు రంగం సిద్ధమవుతోంది. జనవరి నాలుగు నుంచి తొమ్మిది మధ్యన రెండు బ్యాచ్‌లుగా కార్పొరేటర్స్ అహ్మదాబాద్, చండీగఢ్‌లో పర్యటించబోతున్నారు. ఇదంతా ప్యూర్‌లీ అఫీషియల్. ఇక చండీగఢ్ వెళ్ళే బ్యాచ్ అనఫిషియల్‌గా కులు మనాలి వెళ్ళి స్వామి కార్యం, స్వకార్యం నెరవేర్చుకుంటారట. ఇక్కడే ఒక మౌలికమైన ప్రశ్న వస్తోంది చాలామందికి. స్టడీ టూర్స్ పేరుతో వీళ్లంతా వెళ్లి, జనం సొమ్ము ఖర్చుపెట్టి వచ్చి అంతగా ఉపయోగపడే పనులు ఏం చేస్తున్నారన్న డౌట్స్ పెరుగుతున్నాయి. గతంలో జరిపిన టూర్స్ వల్ల నగర ప్రజలకు ఏం ఒరిగిందని కూడా అడుగుతున్నారు. జీహెచ్ఎంసీలో మొత్తం 150 మంది కార్పొరేటర్లు ఉండగా ఇందులో ముగ్గురు చనిపోయారు. ఇద్దరు ఎమ్మెల్యేలయ్యారు. ఇక ప్రస్తుతమున్న 145 మందిని అహ్మదాబాద్, చండీగఢ్ స్టడీ టూర్స్‌కు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఆధునిక పట్టణ పాలన, మౌలిక వసతులు, స్మార్ట్ సిటీ ప్రాజెక్టులు, ఘన వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై అధ్యయనం చేయడమే ఈ పర్యటన లక్ష్యమని కార్పొరేటర్లు చెబుతున్నా… మరో నెల రోజుల్లో పదవీ కాలం పూర్తయ్యే వీళ్ళు ఇప్పుడు అధ్యయనం చేసివచ్చి ఎవర్ని ఉద్ధరిస్తారన్న ప్రశ్నలు వస్తున్నాయి సిటీ జనం నుంచి. అదేదో ఎక్కువ కాలం పదవిలో ఉండే వాళ్ళయితే… అబద్దమైనా నిజమనుకుని భ్రమపడి నమ్మేయవచ్చుగానీ, నెల రోజుల్లో పదవి నుంచి దిగిపోయేవాళ్ళ వల్ల ఉపయోగం ఏంటన్నది బిగ్ క్వశ్చన్. నిరుడు కొందరు కార్పొరేటర్లు అసోం, ఇండోర్‌కు స్టడీ టూర్ కోసం వెళ్ళి వచ్చారు.
అప్పట్లో ఆ పర్యటన, వ్యయ భారంపై విమర్శలు వచ్చినా,,, ఇప్పుడు మరోసారి అదే పని చేస్తున్నారంటే… వీళ్ళకు అసలు జనం సొమ్మంటే లెక్కేలేదా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈసారి టూర్‌కు కోటి 40 లక్షల రూపాయల దాకా ఖర్చవుతుందన్నది ప్రాధమిక అంచనా. కార్పొరేటర్ల ప్రయాణం, వసతి, భోజనం, లోకల్ ట్రాన్స్ పోర్ట్ వంటి అన్ని ఖర్చులను బల్దియానే భరిస్తుంది. పదవీకాలం చివరి దశలో ఇంత భారీ వ్యయంతో టూర్ అవసరమా అనే ప్రశ్నకు ఏ కార్పొరేటర్ దగ్గరా కచ్చితమైన సమాధానం లేదు. వీళ్ళకు ప్రజా ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలు, పర్సనల్ సోకులు ఎక్కువయ్యాయని అంటున్నారు ఎక్కువ మంది. అహ్మదాబాద్ వెళ్లే కార్పొరేటర్లకు ఒక్కొక్కరికి 93వేల 975 రూపాయలు, చండీగఢ్ వెళ్లే వాళ్ళకు ఒక్కొక్కరికి 94వేల132 రూపాయలు ఖర్చవుతుందంటూ ట్రావెల్ ఏజెన్సీ ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిసింది. వాటిని స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆమోదించారు. అయితే…చండీగఢ్ వెళ్ళేవాళ్ళు అక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న కులుమనాలి టూర్‌కు కూడా ప్లాన్ చేస్తున్నట్టు అంతర్గత సమాచారం. నిరుడు ఆగస్ట్‌లో పాలకమండలి సభ్యులు ఇండోర్, అసోం టూర్‌కు వెళ్లారు. మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలతారెడ్డి నేతృత్వంలో రెండు బృందాలుగా అధ్యయన యాత్రలు జరిగాయి.
అప్పుడు ఒక్కో కార్పొరేటర్‌కు 80 వేల చొప్పున మొత్తం కోటి 16 లక్షలు ఖర్చయ్యాయి. అంత ఖర్చుపెట్టినా…. ఆ పర్యటనల్లో ఏంనేర్చుకున్నారు..? ఆ నేర్చుకున్న వాటిని హైదరాబాద్‌లో ఎక్కడ అమలు చేశారన్నది మాత్రం ఇప్పటికీ బ్రహ్మ పదార్దమే. కనీసం ఆ అధ్యయన యాత్రకు సంబంధించిన నివేదికను కూడా సమర్పించలేదు. అది స్టడీ టూర్‌లా కాకుండా విహార యాత్రలా జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి. గతంలోనూ కార్పొరేటర్ల పర్యటనలపై లోకాయుక్త అభ్యంతరం తెలిపింది. ప్రజాధనం వృధా తప్ప ప్రయోజనం లేదని పేర్కొంది. ఇన్ని రకాలుగా వ్యతిరేకత ఉన్నా…మరోసారి అధ్యయన యాత్రకు వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారంటే జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్స్‌కు జనం సొమ్మంటే లెక్కలేదా? లేక ప్రజల కష్టార్జితంతో షోకులు చేసుకోవడం సరదానా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ప్రతి అంశం మీద కొట్లాడే కార్పొరేటర్లు… ఈ స్టడీ టూర్‌కు మాత్రం పార్టీలకు అతీతంగా కలిసి వెళ్తున్నారు. కొసమెరుపు ఏంటంటే… ఒకవేళ ఎవరైనా కార్పొరేటర్‌కు టూర్‌కు వెళ్ళాలని ఆసక్తిలేకపోతే… వారి వాటాకింద లక్ష రూపాయల సొమ్మును వారికే ఇచ్చేస్తారట. అది స్టడీ టూరా, జాలీ టూరా అన్నది ఇక్కడే అర్ధమైపోతుందని అంటున్నారు విమర్శకులు.