తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల పరిస్థితేంటి? గ్రామీణ ప్రజానీకం వాళ్ళని నమ్మారా? లేక మేం నమ్మి ఓట్లేస్తే మీ ఇష్టం వచ్చినట్టు పార్టీ మారిపోయారని తిరస్కరించారా? ఏ నియోజకవర్గంలో ఎవరి సంగతి ఎలా ఉంది? వాళ్ళు కాంగ్రెస్‌కు ప్లస్ అయ్యారా? లేక మైనస్‌గా మారిపోయారా? లెట్స్ వాచ్. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా జరుగుతున్నాయి. ఇప్పటికే రెండు విడతలు ముగియగా… వచ్చే 17న మూడో విడత జరుగుతుంది. మొదటి రెండు విడతల్లో అధికార కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శించగా…ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు కూడా చెప్పుకోతగ్గ స్థానాలు దక్కాయి. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ స్థానాలు గెలిచినప్పటికీ… గతంలో బీఆర్ఎస్ సాధించినట్టుగా వార్ వన్‌సైడ్ జరగలేదని, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందనడానికి ఇది నిదర్శనం అంటున్నాయి ప్రతిపక్షాలు. కానీ.. మాలో మాకున్న గ్రూప్ వార్ కారణంగానే అలా జరుగుతోందన్నది కాంగ్రెస్ వర్గాల మాట. ఈ క్రమంలోనే…. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పంచాయతీ ఫలితాలు ఎలా ఉన్నాయన్న ఇంట్రస్టింగ్ డిస్కషన్ జరుగుతోంది. వాళ్ళ మీద ప్రజల ప్రేమ అప్పటిలాగే ఉందా? లేక వ్యతిరేకత పెరిగిందా అన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల్లో దానం నాగేందర్, అరికెపుడి గాంధీల నియోజకవర్గాలు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నాయి కాబట్టి వాళ్ళకు సంబంధం లేదుగానీ… మిగతా 8మంది బొమ్మ ఎలా ఉందని ఆరా తీస్తున్నాయి రాజకీయవర్గాలు. రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ నియోజకవర్గ పరిధిలో ఒక మండలంలో మాత్రమే సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. శంషాబాద్ మండలంలోని 21 గ్రామాలకుగాను కాంగ్రెస్ 12, బీఆర్ఎస్ 3,బీజేపీ రెండు గ్రామాల్ని దక్కించుకున్నాయి. ఇండిపెండెంట్స్ నాలుగు చోట్ల గెలిచారు. సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అసలు సర్పంచ్ ఎన్నికలనే పట్టించుకోలేదు. ఆయన నియోజకవర్గంలోని 11 గ్రామాలకు గాను 9 స్థానాల్లో కాంగ్రెస్, 2 చోట్ల బీఆర్ఎస్ గెలిచాయి. అయితే నియోజకవర్గ కాంగ్రెస్ కీలక నేత కాటా శ్రీనివాస్ అంతా తానై చూసుకోవడంతో ఈ ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు.
ఇక రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అడపా దడపా ప్రచారం చేశారు. ఇక్కడ 16చోట్ల కాంగ్రెస్, 3 బీఆర్ఎస్, 3 బీజేపీ, ఇతరులు మూడు చోట్ల గెలిచారు. గద్వాల నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో 131 గ్రామ పంచాయతీలు ఉంటే… ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వర్గం 72 స్థానాలు, కాంగ్రెస్ నేత సరిత వర్గం 35 గ్రామాల్ని గెలుచుకున్నాయి. బీఆర్ఎస్ 08, బీజేపీ 9, ఇతరులు 7 చోట్ల గెలిచారు. భద్రాచలం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావుకు ఎదురుదెబ్బ తగిలింది. ఆయన స్వగ్రామం చిన్నబండిరేవు సర్పంచ్ స్థానాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జగిత్యాల నియోజకవర్గంలో కాంగ్రెస్ vs కాంగ్రెస్ అన్నట్టుగా ఎన్నికలు జరిగాయి. మొత్తం 101 సర్పంచ్ స్థానాలు ఉంటే 84 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్, 9 బిజెపి, కైవసం చేసుకోగా… ఇతరులు మూడు చోట్ల గెలుపొందారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యే సంజయ్ వర్సెస్ మాజీ మంత్రి జీవన్ రెడ్డి మధ్య ఆధిపత్య పోరు జరుగుతోంది. దీంతో కేడర్‌లో కాస్త గందరగోళం కూడా ఉందట. బాన్సువాడ నియోజకవర్గంలో 137 గ్రామపంచాయతీలు ఉండగా మొదటి విడతలో 80 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 74 ఊళ్ళను కాంగ్రెస్ గెలిచింది. అయితే స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, మరో నేత ఏనుగు రవీందర్ రెడ్డి గ్రూపులు ఉన్నాయి. ఎవరికి వారే సర్పంచ్ అభ్యర్థులను బరిలో దింపారు. గెలిచిన వారు మా అభ్యర్థులే అని కాంగ్రెస్ నాయకులు చెప్పుకుంటున్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజక వర్గంలో పార్టీ మారిన కడియం శ్రీహరి తన పట్టు నిలుపుకునే ప్రయత్నం చేశారు. అటు మరోనేత ఇందిర వర్గంతో ఇబ్బంది రాకుండా ఏర్పాట్లు చేసుకున్న కడియం… పట్టు నిలుపుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఇక్కడ138 గ్రామపంచాయతీలకు ఎన్నికలు జరగ్గా… కడియం శ్రీహరి బలపరిచిన అభ్యర్థులు ఎక్కువ సంఖ్యలో విజయం సాధించారు. కొన్నిచోట్ల రెబెల్స్ గెలిచినా వాళ్ళంతా తిరిగి ఆయన దగ్గరికే రావడంతో లైన్ క్లియరైపోయింది. మొత్తం 76 చోట్ల కాంగ్రెస్, 12 సీట్లలో రెబెల్స్ గెలవగా అన్నీ కాంగ్రెస్ ఖాతాలో పడిపోయాయి. ఇక్కడ బీఆర్‌ఎస్‌కు 36 పంచాయతీలు దక్కాయి. ఇంకో విడత ప్రజా తీర్పు ఉన్నందున వోవరాల్‌గా ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తికరంగా మారింది.