తెలంగాణ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో లెక్కలు మారబోతున్నాయా? గతానికి భిన్నంగా… గెలుపు మాత్రమే… అన్నట్టు కాంగ్రెస్ పావులు కదుపుతోందా? మిగతా లెక్కలు ఏవైనా ఉంటే… తర్వాత చూసుకుందామని పార్టీ పెద్దలే అంటున్నారా? అధికార పార్టీ… అందులోనూ కీలకమైన నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు కావడంతో ప్రెస్టీజ్ ఇష్యూ అయిందా? ఇంతకీ ఆ కొత్త కేలిక్యులేషన్స్ ఏంటి? ఇంటర్నల్గా జరుగుతున్న చర్చ ఏంటి?
తెలంగాణలో ఖాళీ అవబోతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ సీట్ల విషయంలో అధికార కాంగ్రెస్ ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటోందట. అందుకే… ఇంకాస్త టైం ఉన్నా… ఇప్పట్నుంచే కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈసారి సమీకరణల కంటే… గెలిచి తీరాలి అన్నదే లెక్క అంటున్నాయి పార్టీ వర్గాలు. హైకమాండ్ దిశా నిర్దేశం… సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం కూడా అదేనని అంటున్నారు. రెండు గ్రాడ్యుయేట్ సీట్లలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ అభ్యర్ధులు గెలిచి తీరాలన్నదే బాటమ్ లైన్ తప్ప ఇక వేరే ఏ కేలిక్యులేషన్స్‌తో అవసరం లేదని పార్టీ పెద్దలు అన్నట్టు తెలిసింది. పేరుకు ఇవి రెండు ఎమ్మెల్సీ సీట్లు కావచ్చుగానీ… పరిధి మాత్రం ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఉంటుంది. ఆ ఆరు జిల్లాల్లోని పట్టభద్రులు ఓటేస్తారు కాబట్టి… గెలుపు ఓటముల ప్రభావం ప్రభుత్వం మీద గట్టిగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందుకే… అధికార పార్టీ హోదాలో చాలా జాగ్రత్తగా అడుగులు వేయాలనుకుంటున్నట్టు సమాచారం. రెండిటిలో ఒకటి హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ సీటు కాగా… మరొకటి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల స్థానం. ఇప్పుడు ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో కాంగ్రెస్‌కు మంచి పట్టుంది. ప్రజా ప్రతినిధుల బలం కూడా ఉంది. దీంతో… రెండు చోట్ల గెలిచి తీరాలన్నదే పార్టీ నాయకత్వం పట్టుదల అట.
ఐతే.. హైదరాబాద్- రంగారెడ్డి- పాలమూరు టిక్కెట్‌ను యువతకు ఇవ్వాలని భావిస్తున్నారట. అలాగే… నల్గొండ- ఖమ్మం-వరంగల్ సీట్లో బలమైన నేతను బరిలో దింపాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. ఈ రెండిటిలో ఒకదాన్ని బీసీకి, మరొకదాన్ని రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలని మొదట్లో పార్టీ పరమైన చర్చ జరిగింది. ఇటీవలి కోర్ కమిటీ మీటింగ్‌లో కూడా ఈ రకమైన చర్చ జరిగిందట. ఐతే కొన్ని ప్రత్యేక సమీకరణల దృష్ట్యా.. రెండు సీట్లు రెడ్డి సామాజిక వర్గానికే ఇవ్వాలన్నది తాజా ఆలోచనగా తెలుస్తోంది. ఈ దిశగా దాదాపు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకుంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. ఈ క్రమంలో కొన్ని పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. హైదరాబాద్- రంగారెడ్డి- పామలూరు సీటు కోసం సామ రామ్మోహన్ రెడ్డి, హర్షవర్ధన్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, పార్టీ సీనియర్ నేత klr, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ఇక ఖమ్మం- నల్గొండ- వరంగల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం రెడ్డి, గుత్తా అమిత్ రెడ్డి, పటేల్ రమేష్ రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. అయితే… కోమటిరెడ్డి బ్రదర్స్ ఇప్పటి వరకు దీని గురించి ఏం మాట్లాడలేదు. గతంలో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి లక్ష్మి బరిలో నిలిచారు. కానీ…ఈసారి ఆ కుటుంబం ఆలోచన ఏంటో ఇప్పటి వరకు బయటకు రాలేదు. అభ్యర్థులు ఎవరైనా… మొత్తం మీద రెండు సీట్లు రెడ్డి సామాజికవర్గానికేనని దాదాపు ఖాయమైపోయిందని అంటున్నారు. అయితే.. తుది నిర్ణయం తీసుకోవడానికి ఇంకొంత సమయం పట్టవచ్చంటున్నారు కాంగ్రెస్ లీడర్స్.

