NTV Telugu Site icon

Off The Record: జిల్లాలోని మూడు సెగ్మెంట్స్ మీద వాస్తు ఎఫెక్ట్ పడిందా?

Brs

Brs

Off The Record: ఆ జిల్లాలో బీఆర్‌ఎస్‌ ఓటమికి, వాస్తుకు లింక్‌ ఉందా? వాస్తు దోషం కారణంగానే జిల్లాలో ఒక్క సీటు కూడా పార్టీ గెలవలేకపోయిందా? అందుకే జిల్లా పార్టీ ఆఫీస్‌ని పాడుబెట్టేశాం… భూత్‌ బంగ్లాగా మార్చేశామని స్టేట్‌మెంట్స్‌ ఇవ్వడంలో లాజిక్‌ ఉందా?.. ఒకరి కింద ఒకరు గోతులు తీసుకుని ఓడిపోవడం నిజం కాదా? ఏ జిల్లా నాయకులు వాస్తు లెక్కలు చెబుతున్నారు? ఎక్కడున్న ఆఫీస్‌ని పాడుబెట్టారు?.. మహబూబ్‌నగర్‌ అంబేద్కర్ సర్కిల్ సమీపంలో బీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా నిర్మించుకున్న జిల్లా ఆఫీస్‌ ఇది. ప్రత్యేక సమావేశ మందిరం, పార్కింగ్ స్పేస్‌తో.. ఖరీదైన స్థలంలో కట్టారు. 2022 డిసెంబర్ 4న అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఈ ఆఫీస్‌కు రిబ్బన్‌ కట్‌ చేశారు. ముచ్చటగా మూడేళ్ళు కూడా నిండలేదు. ఇప్పుడిలా…. పెరిగిన పిచ్చి మొక్కలు , చెద పట్టిన తలుపులతో భూత్‌ బంగ్లాను తలపిస్తోంది పాలమూరు బీఆర్‌ఎస్‌ ఆఫీస్‌. ఆర్భాటంగా ప్రారంభోత్సవం చేశారే తప్ప ఆ స్థాయి యాక్టివిటీ మాత్రం జరగలేదంటున్నారు స్థానిక నాయకులు. ప్రారంభోత్సవం రోజు జిల్లా అధ్యక్షుడి హోదా లో తళుక్కుమన్న మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆ తర్వాత ఇటువైపు తొంగి చూసిన సందర్భాలే లేవంటోంది కారు పార్టీ క్యాడర్ . అసెంబ్లీ ఎన్నికల ముందు వరకు అడపాదడపా జిల్లా ఆఫీస్ గడప తొక్కిన కొందరు నేతలు… ఆ తర్వాత పూర్తిగా ముఖం చాటేశారు. దీంతో కనీసమైన మెయింటెనెన్స్ లేక గులాబీ కార్యాలయం ఇలా దర్శనమిస్తోంది.

Read Also: Pawan Kalyan: ఎస్సీ వర్గీకరణ సాధించిన ఘనత సీఎం చంద్రబాబుదే..

ఇక, ఇప్పుడంటే అధికారంలో లేరు సరే.. ఉన్నప్పుడు కూడా ఈ ఆఫీస్‌ని ఎందుకు పట్టించుకోలేదని అంటే… అందుకు కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు జిల్లా పార్టీ నాయకులు. జిల్లా కేంద్రం నడిబొడ్డున, ఆర్టీసీ బస్టాండ్‌కు కూత వేటు దూరంలో, విలువైన స్థలంలో నిర్మించిన ఈ బీఆర్‌ఎస్‌ భవన్‌కు వాస్తు లేదని, ఆ గండంతోనే…. జిల్లాలోని మూడుకు మూడు నియోజక వర్గాల్లో ఓడిపోయామన్నది జిల్లా గులాబీ నేతల వెర్షన్‌గా తెలుస్తోంది. అందుకే ఎన్నికలయ్యాక ఎవ్వరూ ఈ ఆఫీస్‌ ముఖం చూడలేదని చెప్పుకుంటున్నారు. అదే సమయంలో మనం సరిగా పని చేయకుండా, కాట్లాటలతో ముంత ఒలకబోసుకుని నెపాన్ని అన్నెంపున్నెం ఎరుగని బిల్డింగ్‌ మీదికి తోసేస్తే సరిపోతుందా అన్నది ఇంకో గ్రూప్‌ గులాబీ నాయకుల క్వశ్చన్‌. మూడు నియోజక వర్గాల మాజీ ఎమ్మెల్యేల మధ్య నివురు గప్పిన నిప్పులా ఉన్న అభిప్రాయ భేదాలే ప్రత్యక్షంగా, పరోక్షంగా ముగ్గురినీ దెబ్బ తీశాయని అంటున్నారు.

Read Also: Betting Apps Case: ఇన్‌స్టాగ్రామ్‌లో పరేషాన్‌ బాయ్స్‌ ఇమ్రాన్‌ ఎమోషనల్‌ పోస్ట్‌.. బోరున విలపిస్తూ..

అయితే, ఇంకొందరైతే.. అలాంటిదేం లేదు , ఓటర్లు మార్పు కోరుకున్నారు కాబట్టే జడ్చర్ల , మహబూబ్ నగర్, దేవరకద్ర నియోజక వర్గాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారంటూ… స్పెషల్‌ గ్రేడ్‌ విశ్లేషణలు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో జడ్చర్ల సిట్టింగ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, దేవరకద్ర సిట్టింగ్ ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ సిట్టింగ్ శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయారు. ఈ ముగ్గురు మళ్లీ గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని వివిధ సర్వేలు అంచనా వేసినప్పటికీ, ఫలితాలు మరోలా వచ్చాయి. అలా ఎందుకంటే…. అంతా కలిసికట్టుగానే ఉన్నామని పైకి బిల్డప్‌లు ఇచ్చిన ఈ నేతల మధ్య అస్సలు సఖ్యత లేదన్నది లోకల్‌ టాక్‌. తెలియకుండా… ఒకరి కింద ఒకరు మంట పెట్టుకున్నారని, ఫైనల్‌గా ముగ్గురూ ఇళ్ళలో కూర్చున్నారని చెప్పుకుంటున్నారు. జిల్లా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కనిపించిన అప్పటి జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడంతో… తనకా పోస్ట్‌ ఉందని అసలు ఆయనే మర్చిపోయినట్టున్నారంటూ మాట్లాడుకుంటున్నాయి బీఆర్‌ఎస్‌ వర్గాలు. జిల్లా స్థాయి కార్యక్రమాల నిర్వహణ కూడా ఈ ముగ్గురు మాజీలు కలిసి నిర్వహించని పరిస్థితి.

Read Also: GHMC: దోమల బెడద అధికంగా ఉందా? ఒక్క క్లిక్ చేయండి.. జీహెచ్‌ఎంసీ చూసుకుంటుంది..

కాగా, మొత్తం మీద గత రెండు విడతల్లో.. మూడుకు మూడు నియోజక వర్గాల్లో గులాబీ జెండాకే పట్టం కట్టిన ఓటర్లు , మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో తీర్పు భిన్నంగా ఇవ్వడంతో కారు క్యాడర్ కకావికలం అయింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో జిల్లా స్థాయిలో ఆయా నియోజక వర్గాల నాయకత్వం కలిసికట్టుగా కార్యాచరణ రూపొందించి పోరుబాట పట్టాలని కోరుతోంది కేడర్‌. మన చేతగానితనాన్ని వాస్తు పేరుతో భవనం మీదికి నెట్టకుండా ముందు పార్టీ ఆఫీస్‌ని ఓపెన్‌ చేసి కార్యకలాపాలు నిర్వహించమంటున్నారు కార్యకర్తలు. అసలు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌కే ఇలాంటి నమ్మకాలు ఎక్కువని, అలాంటి వాస్తు, గీస్తు ఏమీ చూడకుండానే ఆయన ఆఫీస్‌ నిర్మాణానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారా? స్వయంగా తానే వచ్చి ప్రారంభించారా? ఈ చిన్న లాజిక్‌ మిస్‌ అయితే ఎలాగంటూ తమ నేతల్ని రివర్స్‌లో అడుగుతున్నారు పాలమూరు కారు పార్టీ కార్యకర్తలు.