OTR : తెలంగాణ బీజేపీకి కొత్త సారథి? మళ్లీ బండి సంజయ్‌కే పగ్గాలు!

Bandi

Bandi

బెంగాల్‌ను సాధించాం…. ఇక తెలంగాణే టార్గెట్ అంటున్న బీజేపీ అధిష్టానం… అందుకు తగ్గట్టే అడుగులు వేస్తోందా…? యుద్ధం మొదలుపెట్టడానికి ముందు సేనల ప్రక్షాళన అవసరమన్న ప్రాధమిక సూత్రాన్ని పాటించబోతోందా? రాష్ట్ర పార్టీలో ప్రక్షాళన చేశాకే సమర శంఖం పూరించాలనుకుంటోందా? ముఖ్య నేతల మధ్య సమన్వయం సాధించడంతో పాటు మరో కీలకమైన మార్పు కూడా జరిగే అవకాశం ఉందా? అదే నిజమైతే ఏంటా మార్పు? కొట్టాల్సిందే…. ఈసారి గట్టిగా కొట్టాల్సిందే…. ఇక నో మోర్‌ ఛాయిస్‌. తెలంగాణ విషయమై ప్రస్తుతం బీజేపీలో ఈ తరహా చర్చలే ఎక్కువగా జరుగుతున్నాయట. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చి తీరాలన్న లక్ష్యంతో పావులు కదుపుతోందట పార్టీ జాతీయ నాయకత్వం. బెంగాల్ ఎన్నికలు ముగిశాక… తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహాలతో సంఘ్‌ నుంచి ఆదేశాలు వచ్చాయట. గత రెండేళ్లుగా రాష్ట్ర బీజేపీలో జరుగుతున్న పరిణమాలను ఆరెస్సెస్ పెద్దలు దగ్గరగా గమనించినట్టు తెలుస్తోంది. అయితే అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నట్టుగా… పార్టీకి రాష్ట్రంలో అనుకూల వాతావరణం ఉన్నా.. నేతల మధ్య కలహాలే అసలు సమస్య అని గుర్తించారు. వాటిపై ముందుగా దృష్టిపెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వానికి సంఘ్‌ పెద్దలు క్లియర్‌కట్‌గా తేల్చి చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన హైకమాండ్…. ప్రధాన ప్రతిబంధకంగా ఉన్న పాత, కొత్త విభేదాలు, అంతర్గత కలహాలకు చెక్‌పెట్టే ప్రయత్నం మొదలుపెట్టింది. రాష్ట్ర ఎంపీలు అందర్నీ ఒకే తాటిపైకి తీసుకువచ్చి లంచ్ మీటింగ్‌లు, టిఫిన్‌ భేటీలను ఏర్పాటు చేసింది. కలిసి ఉండకపోతే… పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ఒకింత కటువుగానే చెప్పారట ఢిల్లీ పెద్దలు.

దీంతో అలర్టయిన రాష్ట్ర నేతలు ఐక్యతా రాగం ఆలపించడం స్టార్ట్ చేసినట్టు తెలిసింది. మూడు నెలలకోసారి తెలంగాణకు వస్తానని, రాష్ట్ర ఇన్ఛార్జ్‌ నెలలో 20 రోజులు తెలంగాణలోనే ఉంటారని పార్టీ జాతీయ అధ్యక్షుడు చెప్పడంతో శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిందని అంటున్నారు. ఈ పరిణామ క్రమంలోనే ఒక ఆసక్తికర ప్రచారం క్యాడర్‌లో మొదలైంది. త్వరలోనే పార్టీ రాష్ట్ర నాయకత్వంలోనూ కీలక మార్పులు ఉంటాయని,తెలంగాణ నుంచి మంత్రి వర్గంలో ప్రాతినిథ్యం విషయంలో మార్పులు ఉంటాయన్న వార్తలు జోరందుకున్నాయి. దీంతో రకరకాల సమీకరణాలు తెరపైకి వస్తున్నాయి. ఆ ప్రచారమే నిజమైతే… పార్టీ రాష్ట్ర బాధ్యతల్లోకి కేంద్ర మంత్రి బండి సంజయ్ వస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పెద్దలు అంతర్గతంగా నిర్వహించిన రహస్య సర్వేలో కూడా రాష్ట్ర నాయకత్వం దూకుడుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమైందట. అందుకే బండికి మరోసారి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించాలనుకుంటున్నట్టు ప్రచారం మొదలైంది. రోగి కోరుకుంటున్నది, డాక్టర్‌ ఇచ్చింది ఒకటే మందు అన్న చందంగా బండికి రాష్ట్ర పగ్గాలిస్తే క్యాడర్‌లో కదలిక వస్తుందని అనుకుంటున్నారట. సంజయ్ గతంలో మూడేళ్ల పాటు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన నాయకత్వంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో విజయం…. మునుగోడులో గట్టి పోటీ ఇవ్వడం లాంటి వాటిని పరిగణనలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. మాస్‌ లీడర్‌ ఇమేజ్‌, రైతుల సమస్యలపై జైలుకు సైతం వెళ్లడం లాంటివి అప్పట్లోపార్టీ గ్రాఫ్‌ను అమాంత పెంచేశాయనే అభిప్రాయం వ్యక్తం చేశారట జిల్లా స్థాయి లీడర్లు.

 

పట్టణ పార్టీగా పేరున్న బీజేపీని గ్రామాల్లోకి తీసుకెళ్లడంలో సంజయ్ కీలకంగా వ్యవహరించారని.. ఇప్పుడు కూడా బీఆర్ఎస్‌ని వెనక్కి నెట్టి కాంగ్రెస్‌కు కమలం మాత్రమే ప్రత్యామ్నాయం అనే వాతావరణాన్ని డెవలప్‌ చేయాలంటే బండి సంజయ్ కరెక్టనే నిర్ణయానికి పార్టీ పెద్దలు వచ్చినట్టు సమాచారం.అలాగే సామాజికంగానూ… బీసీలను ముందు పెట్టాలనే యోచనలో ఉన్నారట కమలనాథులు. ఈ క్రమంలోనే… ముందు ఎంపీలను ఏకం చేసేందుకు వాళ్ళను కూర్చోబెట్టి చెప్పాల్సింది చెప్పేశారట. అందులో భాగంగానే ఇన్నాళ్ళు ఉప్పు నిప్పులా ఉన్న బండి, ఈటల మధ్య మాటలు కలిసినట్టు చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు పదవీకాలం ఇంకా ఉన్నందున ఇప్పటికిప్పుడే బండి సంజయ్‌కి బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేవన్న మరో వాదన కూడా పార్టీ వర్గాల్లో నలుగుతోంది. ముందు మూడు నెలల పాటు నేతలందరిని క్షేత్ర స్థాయికి పంపి ఆ తర్వాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఈ విషయంలో దసరాకు ఒక క్లారిటీ రావచ్చన్నది పార్టీ వర్గాల ఇంటర్నల్‌ టాక్‌. సంజయ్‌కి ఢిల్లీ పెద్దలతో ఉన్న సంబంధాలు, ఆరెస్సెస్ ఆశీస్సులు…వీటన్నిటికీ మంచి మాస్ లీడర్ ఇమేజ్ బాగా కలిసి వచ్చాయని, అందుకే ఆయన విషయంలో హైకమాండ్ పాజిటివ్‌గా ఉందనే విశ్లేషణలు ఉన్నాయి. అయితే… ఇక్కడే మరో ట్విస్ట్‌ కూడా ఉంది. బండి సంజయ్‌ కొడుకు మీద పోక్సో కేసు ఉన్నందున రాష్ట్ర అధ్యక్ష పదవికి అగి అడ్డు కావచ్చని, ఈసారి కేబినెట్‌ పునర్‌ వ్యవస్థీకరణలో మంత్రి పదవి కూడా పోవడం ఖాయమని అంటున్నారు కొందరు. అయితే… పార్టీలోని కొందరు నేతల వల్లే ఆ కేసు జఠిలమైందన్న సమాచారం అధిష్టానం దృష్టిలో ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. చివరికి నిర్ణయం ఎలా ఉన్నా… ప్రస్తుతం మాత్రం తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి చుట్టూ ఆసక్తికరమైన చర్చే జరుగుతోంది.