NTV Telugu Site icon

Off The Record: అనుచరుల దందాలు ఆ టీడీపీ ఎమ్మెల్యేను ఇరుకున పెడుతున్నాయా?

Allagadda

Allagadda

Off The Record: అనుచరుల దందాలు ఆ ఎమ్మెల్యేని ఇరుకున పెట్టబోతున్నాయా? వాళ్ళ అడ్డగోలు వ్యవహారాలు అటు పార్టీ, ఇటు పర్సనల్‌గా ఎమ్మెల్యే ఇమేజ్‌ని చెడగొడుతున్నాయా? టీడీపీకి బాగా పట్టున్న సెగ్మెంట్‌లో తమ్ముళ్లు వసూల్‌రాజాల అవతారం ఎత్తారా? చివరికి రాతి శిల్పాలు చెక్కే శిల్పుల్ని, చికెన్‌ సెంటర్స్‌ని కూడా వదలకుండా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఎక్కడున్నాయి? ఆమెకు సంబంధం లేకుండా ఎమ్మెల్యే పేరు చెప్పి ఎవడి యాపారం వాడు చేసేస్తున్నాడన్నది నిజమేనా?

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం…ఒకప్పుడు ఫ్యాక్షన్‌ అడ్డాగా, బాంబుల గడ్డగా ప్రసిద్ధి. ఇక్కడ ఫ్యాక్షన్ కోరల్లో చిక్కి విలవిల్లాడిన కుటుంబాలు ఎన్నో. పార్టీలతో సంబంధం లేకుండా పర్సనల్‌ కక్షలతోనే నరుకుడు ప్రోగ్రామ్స్‌ నడిచేవి. అయితే… రెండు దశాబ్దాల నుంచి ఆ తీవ్రత బాగా తగ్గింది. రాజకీయ పార్టీల ప్రాబల్యం పెరిగింది. ఆళ్ళగడ్డలో టీడీపీకి బలమైన క్యాడర్ వుందని చెబుతారు. ప్రస్తుతం ఇక్కడి నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు మాజీ మంత్రి భూమా అఖిలప్రియ. అంతవరకు బాగానే ఉన్నా… ఈసారి గెలిచాక ఆమె అనుచరులు లోకల్‌గా చెలరేగిపోతున్నారన్న టాక్‌ నడుస్తోంది. అది ఎంతలా ఉందంటే… అటు పార్టీగా టీడీపీకి, ఇటు వాళ్ళ లీడర్‌గా ఎమ్మెల్యే అఖిలప్రియకు మచ్చ తెచ్చేలా ఉందని మాట్లాడుకుంటున్నారు స్థానికంగా.. విద్యుత్ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే ఉద్యోగి కిడ్నాప్, బెదిరింపు కేసు ఎమ్మెల్యే అనుచరులపై నమోదైన క్రమంలో ఆళ్లగడ్డలో తమ్ముళ్ల దందాపై చర్చ జరుగుతోందట.

అయితే, రూరల్ పీఎస్‌లో ఎమ్మెల్యే ముఖ్య అనుచరులు నరసింహా రెడ్డి, నిఖిల్, నల్లగట్ల నాగరాజు, సాయి పై కేసు బుక్‌ అయింది. విద్యుత్ కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎమ్మెల్యే అనుచరులు కిడ్నాప్ చేశారన్నది కేసు. వాళ్ళని వదలాలంటే… 20 శాతం కమీషన్‌ ఇవ్వాలని కాంట్రాక్టర్‌కు హుకుం జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. స్థానిక నల్లగట్లలో కాంట్రాక్ట్ సంస్థ ఉద్యోగి బాబూరావు విద్యుత్ లైన్ పనులు చేయిస్తున్నారు. 20 శాతం పర్సెంటేజీ ఇవ్వకుండా, తమ అనుమతి లేకుండా పనులు ఎలా చేస్తారంటూ బాబురావును కిడ్నాప్ చేసి టీడీపీ నేత ఇంటికి తీసుకెళ్ళి బెదిరించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని బాబూరావు తన సంస్థకు తెలియజేయడంతో… వాళ్ళు నేరుగా ఎస్పీకి ఫిర్యాదు చేశారట. డైరెక్ట్‌గా ఎస్పీ రంగంలోకి దిగడంతో.. కిడ్నాపర్స్‌ వదిలేసినట్టు తెలిసింది.

కాగా, వాళ్ళలో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అలాగే…ఆళ్లగడ్డ మున్సిపల్ ఆఫీస్‌లో కాంటాక్ట్ ఉద్యోగాల కోసం ఒక్కొక్కరి దగ్గర రెండు లక్షలు వసూలు చేసి 22 మందిని నియమించారన్న ఆరోపణలున్నాయి. అలాగే… ఇసుక ట్రాక్టర్ల నుంచి టన్నుకు వెయ్యి చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారట. ఎర్రమట్టిని యదేచ్ఛగా తవ్వేసి అక్రమంగా అమ్ముకుంటున్నారట స్థానిక టీడీపీ నాయకులు కొందరు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాగే..యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరపడంతో… ఆ ప్రాంతానికి వెళ్లిమరీ మట్టి దోపిడీని బయటపెట్టారు అఖిలప్రియ. ఇపుడు అదే పని టీడీపీ వర్గీయులు చేస్తున్నారట. ఇక శిల్పకళా మందిరాల్లో విగ్రహాలు తయారు చేసేందుకు శిల్పులు ఇతర ప్రాంతాల నుంచి రాళ్లను తెప్పించుకుంటారు. చివరికి వాళ్ళ దగ్గర కూడా టన్నుకు 200 రూపాయయల చొప్పున గుంజుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఆళ్ళగడ్డలో 75 శిల్ప కళామందిరాలు ఉన్నాయి. ఇక్కడ 1200 మందిదాకా శిల్పులు ఉన్నారు.

ఇక, శిల్పాల రాళ్ళను కోటప్ప కొండ దగ్గర గురుజాపల్లి, మదనపల్లి నుంచి తెప్పించుకుంటారు. ఎర్రరాయి జమ్మలమడుగు ఏరియా నుంచి వస్తుంది. ఇలా ఒక లారీలో 20 నుంచి 25 టన్నుల రాయి రవాణా చేసుకుంటారు ఇక్కడి శిల్పులు. అలాంటి రెక్కల కష్టం చేసే శిల్పుల దగ్గర కూడా టన్నుకు రూ.200 చొప్పున వసూలు చేయడం దారుణం అన్నది లోకల్‌ టాక్‌. అలాగే చికెన్ సెంటర్ నిర్వాహకులను నెలకు ఐదు లక్షలు ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారట. ఒక ఫర్నిచర్ షాప్ యజమాని అయితే.. డబ్బులు ఇచ్చుకోలేక షాప్ ఖాళీ చేసి వెళ్లిపోయినట్టు సమాచారం. అయితే…ఈ వ్యవహారాలన్నీ ఎమ్మెల్యేకు తెలిసి జరుగుతున్నాయా? అసలామె నోటీస్‌లో లేకుండా అనుచరులు కింది స్థాయిలో చెలరేగిపోతున్నారా అన్న చర్చ జరుగుతోంది. ఆమెకు తెలియకున్నాసరే.. చేస్తోంది టీడీపీ నాయకులు కాబట్టి ఆమె మీద ప్రభావం పడుతోందని కూడా చెప్పుకుంటున్నారు. ఈ అడ్డగోలు దందాలను ఎక్కడికక్కడ కట్టడి చేయకుంటే… చివరికి ఎమ్మెల్యేకే చెడ్డపేరు వస్తుందని అంటున్నారు పరిశీలకులు. ఆళ్ళగడ్డ టీడీపీలో అంతా ఇలాంటి పనులు చేయకున్నా… కొందరి బరితెగింపు వల్ల అందరికీ చెడు అంటుకుంటోందని, అంతిమంగా అది పార్టీని, ఎమ్మెల్యేని దెబ్బతీసే ప్రమాదం ఉందన్న వార్నింగ్స్‌ వస్తున్నాయి పొలిటికల్‌ సర్కిల్స్‌ నుంచి. మరి ఎమ్మెల్యే ఎంత వరకు అలర్ట్‌ అవుతారో… ఎలా కట్టడి చేస్తారో చూడాలంటున్నారు పరిశీలకులు.