Off The Record: ఆ ఎమ్మెల్యేని అధికారులు గుర్తించడం లేదా? ప్రజా ప్రతినిధిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడం లేదా? అధికార పార్టీ శాసనసభ్యుడు అయినా సరే… ఎందుకా పరిస్థితి వచ్చింది? ఎమ్మెల్యే కూడా మంత్రి ముందే… అధికారుల మీద ఫైరైపోవడం వెనక రాజకీయం ఉందా? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి? దాని గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వస్తోంది?
Read Also: MP Yusuf Pathan: ఒడిశాలో బెంగాలీ కార్మికులపై దాడి.. అమిత్ షాకు టీఎంసీ ఎంపీ లేఖ!
ఏపీ సరిహద్దులో ఉండే తెలంగాణ అసెంబ్లీ నియోజకవర్గం ఉమ్మడి ఖమ్మం జిల్లా అశ్వారావు పేట. పేరుకు గిరిజన నియోజకవర్గం అయినా… అజమాయిషీ మాత్రం వేరే వర్గాలదే. ఇన్నాళ్ళు ఎమ్మెల్యేలు ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోకుండా బండి లాగించేశారు. కానీ… సిట్టింగ్ ఎమ్మెల్యే జాలే ఆదినారాయణ మాత్రం… కాస్త స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించడంతో వివాదాలు రేగుతున్నాయట. నియోజకవర్గ కాంగ్రెస్ జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులకు అనుకూలంగా రెండు వర్గాలుగా విడిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే ఆదినారాయణ ఆ ఇద్దరు మంత్రుల్లో ఒకరికి దగ్గర అట. అలాగే అధికారులు మాత్రం మరో మంత్రికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో నియోజకవర్గంలో వాతావరణం ఎమ్మెల్యే వర్సెస్ అధికారులు అన్నట్టుగా మారిపోయి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయట. మరీ ముఖ్యంగా ఆర్ అండ్ బీ అధికారులైతే…. ఎమ్మెల్యే ఒకరున్నారా అన్నట్టు ప్రవర్తిస్తున్నారట. తాజాగా జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ అంటున్నారు.
Read Also: Sperm Count: వీర్యకణాల సమస్యతో ఇబ్బందులా..? కారణాలు ఇవేకావొచ్చు.. జాగ్రత్త సుమీ!
కాగా, రూ. 15 కోట్ల అంచనా వ్యయంతో… ఓ మారు మూల గ్రామానికి రోడ్డు మంజూరైంది. ఆ సంగతి ఎమ్మెల్యేకి తెలియదు. కానీ… డైరెక్ట్‌గా శంకుస్థాపనకు రమ్మని ఆయన్ని పిలిచారు అధికారులు. దాంతో అగ్గి మీద గుగ్గిలం అయ్యారట ఆదినారాయణ. ఏం తెలియకుండా, ముందేమీ చెప్పకుండా ఎకాఎకిన శంకుస్థాపన చేయమని అడిగితే… ఎలాగంటూ మంత్రి తుమ్మల సమక్షంలోనే సీరియస్ అయ్యారట. మంత్రి జోక్యం చేసుకుని ఎమ్మెల్యేని చల్లబరిచే ప్రయత్నం చేసినా… ఆయన తగ్గలేదట. దాంతో మినిస్టర్ కారులోనే ఎక్కించుకుని ముందు వేరే కార్యక్రమాలకు వెళ్ళి… నచ్చజెప్పి ఫైనల్‌గా రోడ్డుకు శంకుస్థాపన చేశారట. ఆదినారాయణకు, అధికారులకు మధ్య ఎంత గ్యాప్ ఉందో… దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చన్న చర్చ జరుగుతోంది అశ్వారావుపేటలో. గతంలో రింగ్ రోడ్డు వ్యవహారంలో కూడా ఇలాంటి వివాదమే జరిగింది. జిల్లాకు చెందిన ఓ మంత్రి శ్రద్ధ తీసుకుని మైనారిటీలకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించారు.
Read Also: Garuda 2.0 : ఆహా’లో దూసుకుపోతున్న గరుడ 2.౦
అయితే, జాతీయ రహదారుల నిర్మాణాలు ఎలా జరుగుతాయో ఇక్కడ కూడా అలాగే ఉండాలంటూ పట్టు పట్టారు ఆదినారాయణ. చివరికి ఆయన పంతమే నెగ్గింది. ఇక్కడ కూడా ఆర్ అండ్ బి అధికారులు ఎమ్మెల్యేని పట్టించుకోలేదట. దీంతో… ఆ ఒక్క శాఖ అధికారులే ఎందుకు అలా వ్యవహరిస్తున్నారన్న చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే… ఎవరినో సంతృప్తి పరచడానికి ఆర్ అండ్ బీ అధికారులు అలా ప్రవర్తిస్తూ ఇరుక్కుపోతున్నట్టు చెప్పుకుంటున్నారు. మంత్రులు, ఎమ్మెల్యే మధ్య వివాదాలతో అధికారులు ఇబ్బంది పడుతున్న వాతావరణం అశ్వారావుపేటలో కనిపిస్తోందని చెప్పుకుంటున్నారు. దీనికి తోడు లోకల్‌గా ఉన్న చోటా నాయకులు… తాము మంత్రులు, ఎమ్మెల్యేకి దగ్గరయ్యేందుకు ఏదో ఒక విషయం మీద పెద్దోళ్ళ చెవులు కొరికేస్తున్నారట. దీనివల్ల సమసిపోవాల్సిన విభేదాలు ఎప్పటికప్పుడు రేగుతున్నాయంటున్నారు. అదే సమయంలో మంత్రి తుమ్మల సర్దిచెబుతున్నా….ఎమ్మెల్యే ఆదినారాయణ వినకుండా సాగదీయడం గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. ఆయన సైతం ఎవరినో సంతృప్తి పరిచేందుకు అధికారులను పదేపదే టార్గెట్ చేస్తున్నారన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొందరు. మొత్తం మీద కారణాలేవైనా సరే… అశ్వారావుపేటలో వాతావరణం మాత్రం తేడాగా ఉందంటున్నారు పరిశీలకులు.
