అయితే నాకేంటి…? మీ పాటికి మీరు టెండర్స్ వేసుకుని పనులు చేసేసుకుంటుంటే చూస్తూ కూర్చోవాలా? నా గురించి ఆలోచించరా…. అని కాంట్రాక్టర్స్‌ని బెదిరిస్తున్నారట ఆ ఎమ్మెల్యే. ఆయనగారి పుణ్యమా అని మొత్తం పూర్తయిపోయి కేవలం సెంట్రల్ లైటింగ్ కోసం ఎదురు చూస్తోంది పది కిలోమీటర్ల రోడ్డు. ఎవరా టీడీపీ ఎమ్మెల్యే? ఎక్కడుందా పరిస్థితి? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్‌లో తక్కువ టైంలోనే తనదైన ముద్రవేసుకున్న కొద్ది మంది లీడర్స్‌లో ఒకరు ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్. ఇక్కడ నిర్ణయాత్మకంగా ఉండే కాళింగ సామాజిక వర్గంతో పాటు పలు బీసీలకు కూడా పెద్ద దిక్కులా కనిపిస్తున్నారన్న అభిప్రాయాలున్నాయి. అందుకు తగ్గట్టే… ప్రజా సమస్యలపై అవగాహన, వాగ్దాటితో ఆయనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ అయింది. అయితే అదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకుంటే…మొత్తం కంపు కంపేనన్నది లేటెస్ట్ పొలిటికల్ టాక్. ఆయన వ్యవహారశైలితో మొత్తం ఇమేజ్ అంతా డ్యామేజ్ అవుతోందన్నది సిక్కోలు పొలిటికల్ సర్కిల్స్‌లో విస్తృతాభిప్రాయం. మొదట్లో కేబినెట్ బెర్త్ ఆశించిన కూనకు ఆ పదవి దక్కలేదు. దాంతో ఆయన తీరే మారిపోయినట్టు చెప్పుకుంటున్నారు. ఎలాగూ మంత్రి పదవి దక్కలేదు…. ఇక మనం మంచి అనిపించుకుని ఉపయోగం ఏంటనుకున్నారో ఏమోగానీ… మరో కోణాన్ని బయటపెట్టి ఫుల్ లెంగ్త్ బ్యాటింగ్ చేస్తున్నారన్నది లోకల్ టీడీపీ టాక్.
ఆయన ఫక్తు పొలిటికల్ వ్యాపారిగా మారిపోయారన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో సంబంధంలేని అంశాల్లో తన పేరును వాడుతున్నారంటూ ఆయన మొరపెట్టుకుంటున్నా… డ్యామేజ్ మాత్రం ఆగడం లేదు. ఇసుక విషయంలో సురేష్ అనే యువకుడిపై దాడి మెదలు కేజీబీవీ ప్రిన్సిపల్‌కు బెదిరింపుల వరకు… ఇలా ప్రతీ అంశంలో కూన పేరు తెర మీదికి వచ్చి వివాదాస్పదం అవుతోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించిన కూన రవికుమార్‌కు అప్పట్లో చేతి చమురు బాగానే వదిలిందంట. అందుకే ఇప్పుడు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నారా అన్న చర్చలు నడుస్తున్నాయి. మంత్రి పదవి తృటిలో తప్పిడం , కీలక పదవులు ఆశించి భంగపడ్డం లాంటివి జరిగాక…. ఎమ్మెల్యే పూర్తి స్థాయి సంపాదన మీద ఫోకస్ పెట్టారని, నియోజకవర్గంలో దేన్నీ వదలకుండా వ్యాపారం చేస్తున్నారన్న ఆరోపణలు పెరిగిపోతున్నాయి. వంశధార, నాగావళి నదుల్లో అక్రమ ఇసుక తవ్వకాలు, గ్రావెల్ దందా, ఎచ్చెర్ల ఎమ్మెల్యేతో టామ్ అండ్ జెర్రీ వార్ లాంటివి చాలానే జరుగుతున్నట్టు తెలుస్తోంది. అయితే… ఎక్కడా తన చేతికి మట్టి అంటకుండా…నమ్మకమైన అనుచరుల్ని ముందుపెట్టి తాను తెర వెనకుండి తెలివిగా కథ నడిపిస్తున్నారన్నది నియోజకవర్గంలో వినిపిస్తున్న మాట. కూన కాసులకు కక్కుర్తి పడే మనిషి కాదన్నది ఒకప్పుడు ఆయనకున్న ఇమేజ్. కానీ…ఇప్పుడు ఆయన పేరు చెప్పుకుని కొందరు చేస్తున్న వ్యవహారాలు రచ్చకు ఎక్కి ఇమేజ్ మొత్తం డ్యామేజ్ అవుతోందట. ఆమదాలవలస, శ్రీకాకుళం మధ్య ప్రధాన రహదారికి సెంట్రల్ లైటింగ్ పనులు నిలిచిపోవడం వెనుక ఎమ్మెల్యే కూన హస్తం ఉందంటున్నారు. రెండు పట్టణాలను కలుపుతూ పది కిలో మీటర్ల మేర ఉంటుంది రోడ్డు.
చిన్న చిన్న పనులు మినహా నిర్మాణం పూర్తయిపోయింది. సెంటర్ డివైడర్ కట్టడంతో పాటు లైటింగ్ ఏర్పాటు మిగిలి ఉంది. కానీ… రెండేళ్ళ నుంచి అందుకోసం ఎదురు చూస్తున్నా… ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. పనులు చేపట్టేందుకు సుడా నిధులు విడుదల చేసింది కూడా. లోయెస్ట్ బిడ్డింగ్ దక్కించుకున్న కాంట్రాక్టర్ పనిచేసేందుకు వెళ్ళగా ఎమ్మెల్యే అనుచరులు అడ్డుకున్నారట. మా ఏరియాలో మాకు తెలియకుండా మిమ్మిల్ని ఎవరు బిడ్డింగ్‌లో పాల్గొమన్నారంటూ బెదిరించినట్టు తెలుస్తోంది. దాంతో అనధికార అనుమతి కోసం మెత్తం రెండున్నర కోట్ల రూపాయల వర్క్ దక్కించుకున్న రాజమండ్రికి చెందిన కాంట్రాక్టర్ ఎమ్మెల్యే చూట్టూ తిరుగుతున్నారట. నరకాన్ని తలపించే శ్రీకాకుళం – ఆమదాలవలస రోడ్డు నిర్మాణం పనులు ఎప్పుడు పూర్తి అవుతాయా అని జిల్లా వాసులు ఆత్రంగా ఎదురుచూస్తుంటే… ప్రజా ప్రయెజనాలు కాపాడాల్సిన ఎమ్మెల్యే మాత్రం నాకు చెప్పలేదు, నాతో మాట్లాడుకోలేదు అంటూ రెండేళ్ళుగా లైటింగ్ పనుల్ని వాయిదా వేయించడం, కాంట్రాక్టర్‌ని బెదిరించడం ఏంటని నిలదీస్తున్నారు సిక్కోలు వాసులు.