OTR: ఏలూరు కూటమిలో రగులుతున్న కుమ్ములాటలు! నేతల మధ్య కోల్డ్ వార్!

Otr

Otr

ఆ నియోజకవర్గంలో కూటమి ఐక్యత పైన పటారం…లోన లొటారమేనా? కలిసి ఉంటే కలదు సుఖం…. ఈ బంధం దృఢమైనది అంటూ… పై స్థాయిలో ఎన్ని ట్యాగ్‌లైన్స్‌ పెట్టినా…. గ్రౌండ్‌ రియాలిటీ మాత్రం వేరుగా ఉందా? మమ్మల్ని తొక్కేస్తున్నారు అంటూ… జనసైనికులు మంత్రి మనోహర్‌తో మొరపెట్టుకున్నది ఎక్కడ? అక్కడున్న పరిస్థితులు ఏంటి?

ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో కూటమి కుమ్ములాటలు ఇప్పుడు జిల్లాలో చర్చనీయాంశం అయ్యాయి. సీఎం చంద్రబాబు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనటానికి వెళ్లిన రోజే కూటమి మధ్య ఉన్న గ్యాప్ వెలుగులోకి రావడం పొలిటికల్ వర్గాల్లో చర్చగా మారింది. ఇటీవల సీఎం చంద్రబాబు కైకలూరు నియోజకవర్గంలో నిషేధిత జాబితా నుంచి భూములకు సంబంధించిన పట్టాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్ స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు. రానున్న రోజుల్లో అటు రాష్ట్రం ఇటు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కూటమి కలిసికట్టుగా ముందుకు సాగాల్సి ఉందని మూడు పార్టీల ముఖ్యులు వేదిక మీద చెప్పారు. అయితే ఇది జరిగిన కాసేపటికే జన సైనికులు తమ మంత్రి నాదెండ్ల మనోహర్ ముందు లోకల్‌గా తమకు జరుగుతున్న అన్యాయంపై గగ్గోలు పెట్టడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవడం గురించి చర్చలు జరుగుతున్నాయి. గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా బీజేపీ తరపున కామినేని శ్రీనివాస్ గెలిచారు.

2014లో కూడా ఆయన కైకలూరు నుంచే బీజేపీ తరపున గెలిచి నాటి చంద్రబాబు కేబినెట్‌లో మంత్రి పని చేశారు. అయితే… ప్రస్తుతం ఇక్కడ టీడీపీ, జనసేన రెండు పార్టీలకు ఇన్ఛార్జ్‌లు లేరు. ఇటీవలే టీడీపీ అధిష్టానం ఐదుగురు సభ్యులతో 5మెన్ కమిటీని ఏర్పాటు చేసింది. జనసేనకు సంబంధించి ఎన్నికల ముందు వరకు ఇన్చార్జ్‌గా ఉన్న బీవీ రావు ఎన్నికల సమయంలో వైసీపీ కండువా కప్పుకున్నారు. ఇక అప్పటి నుంచి పార్టీ క్యాడర్‌కు ఏ పని కావాలన్నా… ఎవరికి చెప్పుకోవాలో అర్ధంకాని పరిస్థితి. వైసీపీ నుంచి పార్టీ మారిన ఎమ్మెల్సీ జయమంగళ వెంకట రమణ ఉన్నా… జనసేన కేడర్‌కు అండగా నిలవలేకపోతున్నారట.

ఈ పరిస్థితుల్లో… బిజెపికి ఎమ్మెల్యే కామినేని, టిడిపికి ఫైవ్ మెన్ కమిటీ అండగా నిలుస్తోందిగానీ… మాకు దిక్కెవరంటూ జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆ ఆవేదననే మంత్రి మనోహర్‌ ముందు బయటపెట్టారట. నియోజకవర్గంలో తమకు కనీస ప్రాధాన్యత లేదని, కూటమి నుంచి కనీసం సమాచారం ఉండటం లేదని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అలాగే… ఎమ్మార్వో కార్యాలయం మొదలు ఏ ఆఫీస్‌కు జనసేన వాళ్ళు వెళ్లినా పనులు జరగటం లేదని, అదే వేరే పార్టీల వారికి మాత్రం ఫోన్‌లోనే పనులు అయిపోతున్నాయని నాదెండ్ల ముందు ఆవేదన వ్యక్తం చేశారట జనసేనికులు. కూటమిలో ఉన్న మిగతా రెండు పార్టీలు స్థానికంగా జనసేనకు ఉనికి లేకుండా చేస్తున్నాయని, ఇందుకు తమ పార్టీలోనే కొందరు సహకరిస్తున్నారని కూడా నాదెండ్ల దృష్టికి తీసుకెళ్లారట. 2019 ఎన్నికల్లో ఎవరితో పొత్తు లేకుండా పదివేల ఓట్లు సాధించిన పార్టీ…. ఇప్పుడు అధికారంలో ఉండి కూడా ఉనికి కోసం పాట్లు పడుతోందంటూ మనోహర్‌కు చెప్పారట లోకల్‌ లీడర్స్‌. దీంతో కైకలూరు కూటమిలోని ఐక్యత మేడిపండు చందమేనా? అన్న చర్చలు జరుగుతున్నాయి. పార్టీల పెద్దలు దీన్ని ఏ రకంగా హ్యాండిల్‌ చేస్తారోనని చూస్తున్నారు స్థానిక నాయకులు.