అప్పుడెప్పుడో…. మూతబడ్డ ఫ్యాక్టరీ ఇప్పుడెందుకు తెలంగాణలో పొలిటికల్ అజెండా అయింది? దశాబ్దాలుగా ఎన్నికల హామీకే పరిమితమైన పరిశ్రమ పునరుద్ధరణ ఉన్నట్టుండి ప్రాధాన్యతాంశంగా మారడానికి కారణం ఏంటి? ప్రాణ త్యాగాలు, ఆమరణ నిరాహార దీక్షల్లాంటి మాటల వెనక మర్మం ఏంటి? ఏదా ఫ్యాక్టరీ? దాని కేంద్రంగా అంటుకుంటున్న రాజకీయ మంటలేంటి?
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ ఎప్పుడో మూతపడింది. ప్రత్యక్షంగా, పరోక్షంగా భారీ ఎత్తున ఉపాధి కల్పించిన పరిశ్రమను నష్టాల పేరుతో ముూసేసింది కేంద్ర ప్రభుత్వం.
ఇప్పుడీ ఫ్యాక్టరీలోని యంత్రాలు తుప్పుపట్టి ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి. ఇక భవనాలైతే కూలిపోయే దశలో ఉన్నాయి. దశాబ్దాలుగా ఎన్నికలు జరిగిన ప్రతిసారి అన్ని రాజకీయ పార్టీలకు ఇదో అజెండాగా ఉండేది. మేం అధికారంలోకి వస్తే ఫ్యాక్టరీని తెరిపిస్తామంటూ ఎవరికి వారు హామీ ఇవ్వడం ఆనక మర్చిపోవడం కూడా సర్వ సాధారణమైపోయింది. ఈ పరిస్థితుల్లో…. ప్రస్తుతం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దీన్ని అమ్మకానికి పెట్టిందంటూ బీఆర్ఎస్,కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. అది నిజమేనా అన్నట్టు సిమెంట్ పరిశ్రమలోని భవనాలు, యంత్రాలన్నిటినీ తొలగించి తుక్కుకింద అమ్మేందుకు టెండర్లు పిలిచారు. మొన్న వేసవి నుంచి తొలగింపు ప్రక్రియ మొదలైంది. భవనాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తూ…ఇనుప సామగ్రిని తరలిస్తూ… డిస్‌మేండల్ ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో మళ్లీ సీసీఐ పొలిటికల్ కలర్ పులుపుముకుంటోంది. ఆ మధ్య కాంగ్రెస్, సీసీఐ సాధన సమితి నాయకులు, కార్యకర్తలు వేర్వేరుగా పరిశ్రమ ప్రాంతానికి వెళ్లి మరీ నిరసనలు నిర్వహించారు. బీఆర్ఎస్ సైతం ఆందోళనలకు పిలుపునివ్వడమే కాకుండా గేటు మందు బైఠాయించి నిరసన తెలిపింది. అంతటితో ఆగకుండా ఇంకో అడుగు ముందుకేసి ఇష్యూను ఢిల్లీ వరకు తీసుకువెళ్ళింది గులాబీ పార్టీ. బీఆర్‌ఎస్ సారధ్యంలో కేంద్ర మంత్రి కుమార స్వామిని కలిసి ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాలని కోరింది సీసీఐ సాధన సమితి. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో ఢిల్లీ వెళ్ళి వచ్చాక ఆదిలాబాద్‌లో చర్చాగోష్టి నిర్వహించారు. సరిగ్గా ఈ పాయింట్ మీదే కొత్త చర్చ మొదలైంది. సమస్య పాతదే అయినా… బీఆర్‌ఎస్ ఇప్పుడే ఎందుకంత సీరియస్‌గా తీసుకుందన్నది చాలామందికి వస్తున్న డౌట్. మాజీ మంత్రి, ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జోగు రామన్న అయితే…. మరో అడుగు ముందుకేసి సీసీఐని పునరుద్ధరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానంటూ హెచ్చరించారు. అందుకోసం ఆగస్టు 30ని డెడ్ లైన్‌గా పెట్టారాయన. మరో వైపు కేటీఆర్ సైతం తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశారు. ఆ రకంగా గల్లీ నుంచి ఢిల్లీ దాకా…పోరాటం చేస్తూ…. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఇరకాటంలో నెట్టేందుకు బీఆర్ఎస్ గట్టిగా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ళ టైం ఉంది కాబట్టి… ఏదో ఒక పెద్ద సమస్యతో జనంలోకి వెళ్ళాలన్న ప్లాన్‌లో బీఆర్‌ఎస్ అధిష్టానం ఉందన్నది రాజకీయ వర్గాల అంచనా. ఇన్నాళ్ళు ప్రతి పార్టీకి ఇది రాజకీయ అజెండా అయినా…. ఈసారి మాత్రం బీఆర్ఎస్ సీరియస్‌గా పోరు బాట పట్టబోతోందట. దాని ద్వారా… కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జనం మధ్య దోషులుగా నిలబెట్టాలన్నది వ్యూహంగా తెలుస్తోంది. సీసీఐ పూర్తిగా కేంద్రం ప్రభుత్వ పరిధిలోనిదే. కేంద్రం పీపీపీ మోడ్‌లో అయినా ఫ్యాక్టరీని పునరుద్దరించాలనే డిమాండ్ ఉంది. ఒకవేళ అలా కుదరకుంటే… మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వానికి అయినా అప్పగించమని కోరుతున్నారు.
కేంద్రం ముందుకు రాకుంటే… రాష్ట్ర ప్రభుత్వం కేవలం 250 కోట్లు వెచ్చించి పరిశ్రమను పునరుద్ధరిస్తే వేలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయన్న వాదనను తెరపైకి తేవడం కూడా వ్యూహాత్మకమేనని అంటున్నారు. ఆ రకంగా బీఆర్ఎస్ ఎన్నికలకు రెండున్నరేళ్ళ ముందే భారీ స్కెచ్‌తో సీసీఐని తెర మీదికి తెచ్చి ఒకేసారి బీజేపీ, కాంగ్రెస్‌ను టార్గెట్ చేయాలనుకుంటోందన్నది పొలిటికల్ పరిశీలకుల మాట. పునరుద్ధరణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి ఎలా ఉన్నా…. బీఆర్ఎస్ మాత్రం పోరాటాన్ని ఉధృతం చేసే ప్లాన్‌లో ఉంది. ఈ పొలిటికల్ గేమ్‌లో చివరికి పైచేయి ఎవరిది అవుతుందో, ఫైనల్ పంచ్ ఎవరిది ఉంటుందో చూడాలి.

