Off The Record: ఇక మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్…. ఓన్లీ యాక్షన్… అంటూ టీడీపీ పెద్దలు క్లాప్ కొట్టేశారా? ఓపిగ్గా వెయిట్ చేసి…. టైం చూసి…. పెదరాయుడిని కొట్టాల్సిన చోట గట్టిగానే కొట్టేశారా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అని చెప్పకనే చెప్పేశారా? ఎవరా పెదరాయుడు? ఆయన మీద తీసుకున్న యాక్షన్ ఏంటి?
కర్మ రిటర్న్స్ అన్న సిద్ధాంతం సినీ నటుడు మోహన్‌బాబుకు అతికినట్టు సరిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది వివిధ వర్గాల్లో. బాబూ… మోహన్ బాబూ…. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవయ్యా…. ఇక కాస్కో అని ఏపీ ప్రభుత్వ పెద్దలు కూడా సంకేతాలు పంపుతున్నట్టు అంచనా వేస్తున్నారు తాజా పరిస్థితుల్ని దగ్గరగా గమనిస్తున్న వాళ్ళు. ఇక అసలు విషయానికొస్తే….. దాదాపు దశాబ్దానికి పైగా టీడీపీ అధినేత చంద్రబాబు, మోహన్ బాబు మధ్య మాటల్లేవ్. గతంలో తెలుగుదేశం పార్టీకి సొంత మనిషిలా ఉండే మోహన్ బాబు…. ఆ తర్వాత రకరకాల కారణాలతో దూరమై చాలా కాలంగా పార్టీతో, చంద్రబాబుతో విభేదిస్తున్నారు. ఆ క్రమంలోనే… 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి జై కొట్టారాయన. అదే ఊపులో అప్పుడు సీఎం చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేశారు.
Off The Record: రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ వెనకబడుతున్నారా..?
ఇంకా చెప్పాలంటే….నాడు టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేశారన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ… వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీతో కూడా టచ్ మీ నాట్ అన్నట్లుగానే ఉన్నారు. అందుకు కారణాలు కూడా చాలానే ఉన్నాయట. తాను కోరుకున్న ఫ్యాన్ పార్టీ అధికారంలోకి రాగానే…. టీటీడీ ఛైర్మన్ లేదా రాజ్యసభ సీటు ఆశించారట మోహన్‌బాబు. ఆ రెండూ కాకున్నా… చివరికి ఫిలిం డెవలప్ మెంట్ బోర్డు ఛైర్మన్ పదవి అయినా కావాలని తెగ ఆరాటపడ్డారట అప్పట్లో. కానీ… నో యూజ్. ఏ పదవీ దక్కలేదు. పైగా… అంతకు ముందు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ బకాయిల కోసమైతే… తాను విద్యార్థులతో కలిసి రోడ్డెక్కారో… ఆ బకాయిల్ని కూడా పూర్తి స్థాయిలో ఇప్పించుకోలేక… ఛీ… ఇదా నా పరిస్థితి అంటూ చతికిలపడ్డారట పెదరాయుడు. జగన్ దగ్గర నా పరపతి అరచేతి మందాన ఉందని గొప్పలకు పోయిన మోహన్‌బాబుకు చివరికి తత్వం బోధపడి మెల్లిగా బీజేపీకి దగ్గరైనట్టు చెప్పుకుంటారు. తన విద్యా సంస్థలకు ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ విషయంలో 2019 ఎన్నికలకు ముందు మోహన్ బాబు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.
నాటి టీడీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ….విద్యార్థులతో కలిసి నడి రోడ్డు మీద కూర్చుని మోహన్‌బాబు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఆ విషయాన్ని ఇప్పటికీ గుర్తు చేసుకుని ఫైరైపోతుంటారు తమ్ముళ్ళు. ఆ ఎపిసోడ్‌లో ప్రతిపక్షంగా వైసీపీ చేసిన హడావిడికంటే…మోహన్‌బాబే చాలా ఎక్కువ చేశారన్న అభిప్రాయం ఇప్పటికీ బలంగా ఉందట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం కేడర్‌లో. అందుకే ప్రస్తుతం ఆయన తమ మిత్రపక్షం బీజేపీకి దగ్గరైనా… సంబంధంలేని వ్యక్తిగానే చూస్తుంటారు. అదే సమయంలో మోహన్‌బాబు విషయంలో సీఎం చంద్రబాబు మెతక వైఖరి అవలంభిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేసే టీడీపీ లీడర్స్‌కు కూడా కొదవ లేదు. చంద్రబాబు వైఖరి వల్లే… ఛాన్స్ దొరికినప్పుడల్లా మోహన్ బాబు టీడీపీ మీద విషం చిమ్ముతూ ఉంటారని బహిరంగంగానే విమర్శిస్తుంటారు తమ్ముళ్ళు. కానీ… అదంతా పాత లెక్క అని చెబుతున్నాయట తాజా పరిణామాలు. పెదరాయుడికి ఊహించని షాక్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. ఇది చూసిన కొందరు టీడీపీ కార్యకర్తలు అవునా… నిజమా… అని ముక్కున వేలేసుకుంటుంటే… ఇంకొందరు మాత్రం ఓ అడుగు ముందుకేసి ఇప్పటిదాకా ఒక లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ సినిమా డైలాగ్స్ చెప్పేస్తున్నారట.
Rahul Gandhi: ఐపీఎస్ అధికారి ఆత్మహత్యపై రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు..
గతంలో ఏ ఫీజు రీ ఇంబర్స్‌మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు, టీడీపీ మీద పెద్ద ఎత్తున విమర్శలు చేశారో… అవే నిధులు, కాలేజ్ ఫీజుల మళ్ళింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్‌బాబు ఇరుక్కోవడం చూసి కర్మ రిటర్న్స్ అంటే ఇదేనంటూ కామెంట్స్ చేస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. మోహన్‌బాబు యూనివర్శిటీలో తమ దగ్గర అడ్డసుడిగా డబ్బులు పిండుకుంటున్నారంటూ.. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదుతో విచారణకు ఆదేశించింది ఉన్నత విద్యామండలి. విచారణ తర్వాత కాలేజీ మూసివేత, 15 లక్షల రూపాయల ఫైన్ తో పాటు విద్యార్థుల నుంచి వసూలు చేసిన అదనపు సొమ్ము 26 కోట్ల రూపాయలను 15 రోజుల లోపు తిరిగి చెల్లించాలని చెప్పడం మోహన్‌బాబు ఊహించని షాకేనంటున్నారు. దీంతో అవాక్కయిన టీడీపీ కేడర్… ఇది నిజంగా మన ప్రభుత్వమేనా? అలాంటి చర్యలకు ఆదేశించింది నిజమేనా అంటూ తమను తాము గిల్లి చూసుకుంటున్నారట.
కొద్దిమంది చిత్తూరు జిల్లా సీనియర్స్ అయితే… ఈ విషయంలో చంద్రబాబు ప్రమేయం పెద్దగా ఉండకపోవచ్చని, అంతకు మించి లోకేష్ పూనుకుని గట్టిగా వ్యవహరించి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. తప్పును తప్పు అని చెప్పడానికి కూడా భయపడాల్సిన అవసరం లేదని, లోకేష్ ఆదేశాలతోనే ఉన్నత విద్యా మండలి స్వేచ్ఛగా విచారణ జరిపి ఈ తరహాలో కఠిన నిర్ణయం తీసుకుందన్న అభిప్రాయం ఉంది సీనియర్స్‌లో. మోహన్ బాబు గతంలో ఎలా వ్యవహరించాడో… అందరికీ తెలుసు కాబట్టే…. లోకేష్ తండ్రిలా కాకుండా …. ఛాన్స్ దొరికింది కాబట్టి ఓ ఆటాడేసుకుంటున్నారన్న చర్చ గట్టిగా జరుగుతోంది జిల్లాలో.
దానికి తోడు మోహన్ బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ సైతం నేరుగా లోకేష్‌ను పలుమార్లు కలసి తనతో నాన్న, అన్న ఎలా వ్యవహరించారో వివరించారట. కారణాలు ఏవైనాగానీ…. మోహన్‌బాబు విషయంలో చంద్రబాబులాగా కాకుండా…. లోకేష్ గట్టిగా నిర్ణయాలు తీసుకున్నారంటూ… ఉమ్మడి చిత్తూరు టీడీపీ కేడర్ ఖుషీగా ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా చర్చకు పెట్టేస్తున్నారు. మన్తో ఎంటర్‌టైన్‌మెంట్ మామూలుగా ఉండదు మరి అంటున్నారు టీడీపీ లీడర్స్. చినబాబు యాక్షన్‌కు పెదరాయుడు రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా గమనిస్తున్నాయి రాజకీవర్గాలు.