Site icon NTV Telugu

Off The Record:నీకది.. నాకిది..మంత్రాంగం ఫలించిందా?

Neekadi

Neekadi

ఎమ్మెల్సీ సీటు మజ్లిస్ కు ఇవ్వడం వెనక ఉన్న కథేంటి.? | OTR | Ntv

హైదరాబాద్‌ లోకల్‌ బాడీ MLC సీటు కోసం BRS-MIM మధ్య పెద్ద చర్చలే సాగాయా? ఓ అసెంబ్లీ నియోజకవర్గం చుట్టూ ఎడతెగని మంతనాలు జరిగాయా? ఆ చర్చలు కొలిక్కి వచ్చాకే.. MLC సీటును MIMకు ఇచ్చారా? ఇంతకీ ఏంటా మంత్రాంగాలు? నీకది.. నాకిది అన్నట్టుగా సాగిన చర్చల సారాంశం ఏంటి?

ఎమ్మెల్సీ సీటు మజ్లిస్‌కు ఇవ్వడం వెనుక పెద్ద కథే నడిచిందా?
హైదరాబాద్‌ స్థానిక సంస్థల శాసనమండలి స్థానం మజ్లిస్‌ ఖాతాలో పడింది. ఈ సీటులో అధికారపార్టీ BRS పోటీ చేయకుండా.. మిత్రపక్షం MIMకు వదిలేసింది. గులాబీ పార్టీ తన నిర్ణయం ప్రకటించడం.. MIM నుంచి మీర్జా రెహమత్‌ బేగ్‌ నామినేషన్‌ వేయడం.. ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడం చకచకా జరిగిపోయింది. ఇది అందరికీ తెలిసిన కథే. కానీ.. ఈ MLC సీటును మజ్లిస్‌కు ఇవ్వడం వెనుక రెండు పార్టీల మధ్య పెద్ద కథే నడిచిందట. ప్రస్తుతం ఆ వివరాల చుట్టూనే రాజకీయ పక్షాలు ఆసక్తిగా చర్చించుకుంటున్నాయి. అవునా.. అంత తతంగం నడిచిందా? అంత జరిగిందా? సమస్యను అలా సెట్ చేశారా? అని చెవులు కొరుక్కుంటున్నారు గులాబీ పార్టీ లీడర్స్‌.

రాజేంద్రనగర్‌ సీటు కోసం మజ్లిస్‌ ఉడుంపట్టు
మజ్లిస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య చర్చల్లోకి వచ్చిన ఆ నియోజకవర్గమే రాజేంద్రనగర్‌. హైదరాబాద్‌ శివారులోని రాజేంద్రనగర్‌పై మజ్లిస్‌ పార్టీ క్రమంగా పాగా వేస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీల మధ్య కొన్నిచోట్ల ఫ్రెండ్లీ కాంటెస్ట్‌ సాగినా.. రాజేంద్ర నగర్‌ అసెంబ్లీ నియోజకవర్గం మాత్రం హోరాహోరీ పోరును తలపించింది. ఆ ఎన్నికల్లో MIM నుంచి మీర్జా రెహమత్‌ బేగ్‌ పోటీ చేసి ఓడిపోయారు. తాజా MLC ఎన్నికల్లో రాజేంద్రనగర్‌ సీటు చర్చకు రావడానికి కారణం మజ్లిస్‌ ఉడుంపట్టేనని తెలుస్తోంది.

మజ్లిస్‌కే ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చి రాజేంద్రనగర్‌ సీటు కాపాడుకున్న బీఆర్‌ఎస్‌
వాస్తవానికి హైదరాబాద్‌ స్థానిక సంస్థల కోటాలో అధికారపార్టీ BRSకు పూర్తి మెజారిటీ ఉంది. అభ్యర్థి పోటీలో ఉంటే గెలుచుకునే సీటే. అయినప్పటికీ మజ్లిస్‌కు వదిలేసింది గులాబీపార్టీ. MLC సీటు గురించి రెండు పార్టీల మధ్య చర్చలు మొదలైన సమయంలో MIM ఓ ప్రతిపాదన చేసిందట. రాజేంద్రనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి తమకు విడిచి పెట్టాలని.. బదులుగా MLC వదులుకుంటామని మజ్లిస్‌ నేతలు చెప్పారట. ఆ ప్రతిపాదనకు BRS నుంచి సానుకూల స్పందన రాలేదని సమాచారం. పైగా తామే MLC సీటు వదులుకుంటాం.. రాజేంద్రనగర్‌ మాకు విడిచిపెట్టండి అని మిత్రపక్షాన్ని కోరారట గులాబీ పార్టీ పెద్దలు. దానికి MIM అంగీకరించడం.. ఆ పార్టీ నుంచి గతంలో రాజేంద్రనగర్‌ నుంచి పోటీ చేసి ఓడిన మీర్జా రెహమత్‌ బేగ్‌ ఏకగ్రీవం కావడం జరిగింది.

50 చోట్ల పోటీ చేస్తామని అసెంబ్లీలో ప్రకటించిన అక్బరుద్దీన్‌
తెరవెనుక జరగిన ఈ ఎపిసోడ్‌ ఇప్పుడు బయటకు రావడంతో అధికారపార్టీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. ఈ ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. రెండు పార్టీల మధ్య స్నేహ పూర్వక వాతావరణమే ఉంది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో MIM విస్తరిస్తోన్నా.. తెలంగాణపై పూర్తిస్థాయిలో ఫోకస్‌ పెట్టిన పరిస్థితి లేదు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్‌ ఒవైసీ తెలంగాణలో 50 చోట్ల పోటీ చేస్తామని ప్రకటించారు. అందుకే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో MIM ఏం చేస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ఇప్పుడు రాజేంద్రనగర్‌ సీటు తరహాలోనే రెండు పార్టీలు సర్దుబాటు చేసుకుంటాయో లేదో చూడాలి.

Exit mobile version