బాసర టు హైదరాబాద్ పాదయాత్ర అని ఆర్భాటంగా అడుగులు వేసిన కాంగ్రెస్ నేత మహేశ్వర్‌రెడ్డి మధ్యలోనే యూటర్న్ తీసుకున్నారు. నియోజకవర్గం దాటగానే యాత్ర ఆగిపోయింది. ఇప్పుడు పాదయాత్ర మళ్లీ మొదలు పెడతారో లేదో క్లారిటీ లేదు. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? మహేశ్వర్‌రెడ్డి ఏం ఆలోచిస్తున్నారు?
నాలుగు రోజులే యాత్ర చేసిన మహేశ్వర్‌రెడ్డి
AICC కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్.. మహేశ్వర్‌రెడ్డి. హాత్ హాత్ సే జోడో పేరుతో బాసరలో అట్టహాసంగా పాదయాత్ర మొదలుపెట్టారు. ఓ వైపు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి యాత్ర చేస్తున్నారు. ఇతర నేతలు కూడా పాదయాత్ర చేయాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే చెప్పడంతో ఒక్కొక్కరు గడప దాటి బయటకు వస్తున్నారు. ఆ క్రమంలోనే బాసర టు హైదరాబాద్ పాదయాత్ర చేస్తానని బైంసా నుంచి అడుగులు వేశారు మహేశ్వర్‌రెడ్డి. ముథోల్, నిర్మల్ నియోజవర్గాల్లో నాలుగు రోజులు మాత్రమే పాదయాత్ర సాగింది. మొదటి రెండు రోజలు పాదయాత్రలో మహేశ్వరరెడ్డితో జత కలిశారు కాంగ్రెస్ సీనియర్ నేత ఉత్తమ్ కుమార్‌రెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, ఇంఛార్జ్ మాణిక్‌రావు థాక్రే. హోలీ పేరుతో యాత్రకు బ్రేక్ ఇచ్చారు. తర్వాత మహిళా దినోత్సవం అన్నారు. ఆపై మహేశ్వర్‌రెడ్డి యాత్ర గురించి చడీచప్పుడు లేదు.
భట్టితో కలిసి యాత్ర చేస్తారని అనుకున్నారు
వాస్తవానికి సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కతో కలిసి మహేశ్వర్‌రెడ్డి పాదయాత్ర చేస్తారని తొలుత అంతా అనుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో మహేశ్వర్‌రెడ్డి రూటు మార్చేశారు. అలాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మాజీ MLC ప్రేమ్ సాగర్‌రావుతో మహేశ్వర్‌రెడ్డికి పడదు. నాలుగు రోజుల తర్వాత ప్రేమ్‌సాగర్‌రావుకు పట్టున్న నియోజకవర్గాల్లోకి పాదయాత్ర ఎంట్రీ ఇవ్వాలి. అక్కడ గ్రూపు రాజకీయాలతో ఆటంకాలు వస్తాయని అనుకున్నారో ఏమో బ్రేక్ పడిందని టాక్. హడావుడిగా పాదయాత్ర మొదలుపెట్టి.. నాలుగు రోజులకే ఆగిపోవడంతో పార్టీలో చర్చగా మారిపోయారు మహేశ్వర్‌రెడ్డి. ఏ ప్రయోజనం కోసం యాత్ర చేపట్టారు? ఎవరికి చెక్ పెట్టాలని అనుకున్నారు? అని పార్టీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.
16న మొదలయ్యే భట్టి యాత్రతో కలుస్తారా?
సీఎల్పీ నేత భట్ట విక్రమార్క ఈ నెల 16 నుంచి భోథ్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలు పెడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భట్టికి మహేశ్వర్‌రెడ్డి, ప్రేమ్ సాగర్‌రావులు సన్నిహితంగానే ఉంటారు. అందువల్ల భట్టితో కలిసి మహేశ్వర్‌రెడ్డి పాదయాత్రలో కలిసి అడుగులు వేస్తారని ఓ టాక్ నడుస్తోంది. వీరిద్దరూ ఆధిపత్యం ప్రదర్శించకుండా భట్టి ఎలా సమన్వయం చేస్తారనేది మరో ప్రశ్న. మొత్తానికి కాంగ్రెస్‌లో పాదయాత్రలు కొత్త చర్చకు .. కొత్త సమీకరణాలకు దారితీస్తున్నాయి.