తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఎంపీ కేశినేని నాని ఫియర్ పట్టుకుందా? నాని ఏం మాట్లాడతారో.. ఎవరి గురించి మాట్లాడతారో.. ఆయన నోరు విప్పితే ఆ పరిణామాలు ఎలా ఉంటాయో అని టీడీపీ వర్గాలు ఆందోళన చెందుతున్నాయా? దీంతో బాబోయ్ కేశినేని అనే చర్చ టీడీపీలో జరుగుతోందా?
బెజవాడలో వేడెక్కిన టీడీపీ రాజకీయాలు
కొత్త ఏడాదిలో బెజవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కొత్త రాజకీయాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ పార్టీ శ్రేణులు, నేతలు గడగడలాడుతున్నారు. వరుసపెట్టి విజయవాడ టీడీపీ నేతలకు ఎంపీ నాని చాకిరేవు పెట్టేశారు. అలాగే టీడీపీ అధిష్ఠానానికి.. పార్టీ పెద్దలకు కూడా చురకలు అంటించారు. తన మాటలతో చెడుగుడు ఆడేస్తున్నారు నాని. దీంతో బెజవాడ టీడీపీలో రాజకీయాలు వేడెక్కాయి. విజయవాడ లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేశినేని చేస్తున్న రాజకీయం గురించి చర్చ మొదలైంది. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో నాని వ్యాఖ్యల ప్రభావం పార్టీ మీద ఏస్థాయిలో ఉంటుందో అని లెక్క లేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది.
రానున్న రోజుల్లో మరింతగా చెలరేగే ఛాన్స్ ఉందా?
ప్రస్తుతం ఎంపీ నాని తీరు చూస్తుంటే..ఆయన వాక్ ప్రవాహానికి అడ్డుకట్ట పడే సూచనలు అస్సలు కన్పించడం లేదు. దానికి తగ్గట్టే ఇక నుంచి రాజకీయం అంటే ఏంటో చూపిస్తానని అంతర్గత చర్చల్లో ఆయన చెబుతున్నారట. రానున్న రోజుల్లో ఓ రేంజ్‌లో చెలరేగడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే సమాచారమే టీడీపీ అధినాయకత్వాన్ని.. బెజవాడలోని పార్టీ లీడర్లను కలవర పెడుతోందట. నాని ఎక్కుపెట్టిన విమర్శల బాణాలు ఎటెళ్లి.. ఎక్కడ గుచ్చుకుంటాయోనని ఆందోళన చెందుతున్నారట నేతలు. ప్రస్తుతం ఎంపీ వరుస చూస్తుంటే.. తన పార్లమెంట్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో ప్రస్తుత టీడీపీ ఇంఛార్జ్‌లను పక్కన పెట్టి.. కొత్త వారికి ఛాన్స్ ఇవ్వాలనే డిమాండ్‌ను తెర మీదకు తెచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ క్రమంలోనే ఆయన రాజకీయం ఉందనే అభిప్రాయ పడుతున్నారు.
2009లో పీఆర్పీలో ఉన్నప్పుడు నాని తీరుపై చర్చ
ఇదే సమయంలో గతంలో నాని చేసిన రాజకీయం గురించి కూడా టీడీపీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి. 2009 ఎన్నికల్లో పీఆర్పీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు కేశినేని నాని. అలా వచ్చీ రావడంతోనే ఓ సంచలనాన్ని సృష్టించారు. నాటి పీఆర్పీలో నాని చేరిక ఎంత సంచలనమో.. ఆ పార్టీకి గుడ్‌బై చెబుతూ పీఆర్పీని టార్గెట్ చేసుకున్న విధానం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఇప్పుడు నాని వ్యవహరిస్తున్న తీరు కూడా కొంచెం అటు ఇటుగా ఉందని అనుకుంటున్నారు. దాంతో ఎన్నికలు దగ్గరకు వస్తున్న తరుణంలో నానిని కంట్రోల్ చేయకుంటే బెజవాడ పరిధిలోని నేతలకే కాకుండా.. ఏకంగా పార్టీకే ఇబ్బందులు వస్తాయని చర్చ జరుగుతోందట.
అభ్యంతరాలుంటే టీడీపీ అధిష్ఠానంతో ఎందుకు మాట్లాడటం లేదు?
కేశినేని నాని తీరును తప్పు పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తోంది. పార్టీ పెద్దల ఎదుట తాను చెప్పాలనుకున్నది నిర్మోహటంగా చెప్పే చనువు కేశినేని నానికి ఉంది. తన తమ్ముడు చిన్ని విషయంలో కావచ్చు.. బెజవాడ టీడీపీ నేతల విషయంలో కావచ్చు.. నానికి ఏమైనా అభ్యంతరాలుంటే నేరుగా పార్టీ అధినాయకత్వంతో మాట్లాడకుండా.. ఇలా వ్యవహరించడం ఎంత వరకు కరెక్ట్ అనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని నాని అంతర్గత సమావేశాల్లో మాట్లాడిన తర్వాతే చిన్ని ఎంటర్ అయ్యారని.. ఆ తర్వాతే బెజవాడ రాజకీయాల్లో నాని వ్యతిరేక వర్గం పురుడు పోసుకుందని అంటున్నారు. ప్రస్తుతం నాని ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ఓ రకంగా ఆయన వైఖరే కారణమని అభిప్రాయ పడుతున్నారు.
నాని కామెంట్స్‌కు పార్టీ నేతలు రియాక్ట్ కాబోరా?
ఇలా కేశినేని నాని ఎప్పుడు ఏ బాంబ్ వేస్తారో..? ఆ బాంబ్ ఏ స్థాయిలో పార్టీని ఇబ్బందుల్లోకి నెడుతుందోననే ఆందోళన పార్టీ వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో నాని కామెంట్స్‌కు వీలైనంత వరకు రియాక్ట్ కాకుండా ఉంటేనే బెటరనే భావన మెజార్టీ నేతల్లో వ్యక్తం అవుతోందట. మరి.. టీడీపీ అధిష్ఠానం ఏం చేస్తుందో చూడాలి.