పొత్తు కుదురుతుందో లేదో తెలియదు. పొత్తు కుదిరితే ఆ సీటు మిత్రపక్షానికి ఇస్తారో లేదో కూడా క్లారిటీ లేదు. కానీ.. ఎవరికి వారుగా అక్కడ కర్చీఫ్ వేసే పనిలో పడ్డారు. మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానన్నది ఎమ్మెల్యే మాట. అంత సీన్ లేదని కామ్రేడ్లు కవ్విస్తున్నారు. పైస్థాయిలో దోస్తీ.. ఫీల్డ్‌లో కుస్తీ పడుతున్న ఆ పార్టీలేంటో.. ఆ నియోజకవర్గం ఎక్కడుందో ఈ స్టోరీలో చూద్దాం.
తనకు 30 వేల మెజారిటీ ఖాయమని ఎమ్మెల్యే జోస్యం
రాజకీయంగా కారాలు మిరియాలు నూరుతున్న నియోజకవర్గం మిర్యాలగూడ. ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడలో గెలవాలన్నది CPM పట్టు. తప్పకుండా బరిలో ఉంటామని CPM రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తేల్చేశారు కూడా. కేవలం ఆ మాట దగ్గరే ఆగిపోకుండా.. బీఆర్‌ఎస్‌తో పొత్తు ఉన్నా లేకపోయినా.. CPM బరిలో ఉంటుందన్నది ఆయన కామెంట్. ఈ వ్యాఖ్యల సెగ గట్టిగా తగిలిందో ఏమో.. సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు టోన్ పెంచేశారు. మిర్యాలగూడలో లెఫ్ట్ రైట్ సాధ్యం కాదని.. ఇక్కడ పోటీ చేసేది గెలిచేది తానేనని ఓ ప్రకటన చేసేశారు భాస్కరరావు. అంతేకాదు.. వచ్చే ఎన్నికల్లో తనకు 30 వేల మెజారిటీ కూడా ఖాయమని జోస్యం చెప్పారు. రెండు వర్గాల నుంచి వచ్చిన ఈ స్టేట్‌మెంట్లు మిర్యాలగూడ రాజకీయాన్ని వేడెక్కించాయనే చెప్పాలి.
గతంలో మిర్యాలగూడలో గెలిచిన జూలకంటి రంగారెడ్డి
ఇదే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన మునుగోడు ఉపఎన్నికలో గులాబీపార్టీకి వామపక్షాలు మద్దతు ప్రకటించాయి. అప్పటి నుంచే మిర్యాలగూడపై BRSతోపాటు CPM కూడా గట్టిగా పావులు కదుపుతున్నాయి. మిర్యాలగూడలో లెఫ్ట్ పార్టీలకు కూడా బలం.. బలగం ఉంది. గతంలో ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన జూలకంటి రంగారెడ్డి.. అప్పట్లో సీపీఎం శాసనసభాపక్ష నేతగా చేశారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నారు జూలకంటి. ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టారు కూడా. పాదయాత్రలతో నియోజకవర్గంలో అలజడి రేపుతున్నారు. మూడుసార్లు ఇక్కడి నుంచి అసెంబ్లీకి వెళ్లడంతో పాత పరిచయాలను తిరగదోడుతున్నారు జూలకంటి.
మిర్యాలగూడలో పోటీ చేస్తామంటున్న సీపీఎం
BRS, లెఫ్ట్ పార్టీల మధ్య పొత్తు కుదిరితే మిర్యాలగూడ సీటు అడగాలనే ఆలోచనలో ఉంది CPM. అయితే సీట్లు విషయంలో అధికారపార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలకు కామ్రేడ్లు గుర్రుగా ఉన్నారు. సీట్లు కాదు.. ఎమ్మెల్సీని ఇస్తామనే బీఆర్ఎస్ నేతల ప్రకటనలపై కయ్‌మంటున్నారు కామ్రేడ్లు. పొత్తు లేకపోతే ఒంటరి పోరుకైనా సిద్ధమని కమ్యూనిస్టులు కత్తులు దూస్తున్నారు. ఈ క్రమంలో తమ్మినేని వీరభద్రం జనచైతన్య యాత్ర పేరుతో మిర్యాలగూడకు రావడం… ఇక్కడ సీపీఎం పోటీ చేస్తుందని చెప్పడంతో ఆసక్తి నెలకొంది. ఈ పోటీ కారణంగా బీఆర్ఎస్, సీపీఎం నేతలు మిర్యాలగూడలో కలిసి పనిచేయలేని పరిస్థితి. రెండువర్గాలు పరస్పరం వైరిపక్షాలుగా చూసుకుంటున్నాయి. ఎమ్మెల్యే భాస్కరరావు, సీపీఎం నేతలు పదునైన విమర్శలు చేసుకుంటున్నారు.
ఎమ్మెల్యే భాస్కరరావుకు పార్టీలో ఇంటిపోరు?
వరుసగా రెండుసార్లు భాస్కరరావు ఎమ్మెల్యేగా గెలవడం వల్లో ఏమో.. ఆయన తీరు స్థానిక బీఆర్‌ఎస్‌లో కొందరికి నచ్చడం లేదు. ఢీ అంటే ఢీ అంటున్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలో బలమైన సామాజికవర్గాలుగా ముద్ర పడ్డ రెడ్డి, వైశ్య కమ్యూనిటీలకు చెందిన నాయకులతో భాస్కరరావుకు దూరం పెరిగిందట. పదవుల పంపకం.. నామినేటెడ్ పోస్టుల ప్రకటనల విషయంలోనూ ఎమ్మెల్యే ఏకపక్షంగా వ్యవహరించారనేది అసంతృప్తి నేతల ఆరోపణ. ఈ అంశాలన్నీ పార్టీ పెద్దలకు ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో వెళ్తున్నాయట. దాంతో భాస్కరరావుకు సీటు కష్టమే అన్నది పార్టీలోని అసంతృప్త నేతల మాట. ఈ గొడవలు సర్దుబాటు చేసేకంటే.. పొత్తులో భాగంగా CPMకు మిర్యాలగూడ సీటు ఇచ్చే అవకాశాలే ఎక్కువుగా ఉన్నారని చెవులు కొరుక్కుంటున్నాయి గులాబీ శ్రేణులు. అందుకే రెండు పార్టీలు కారాలు మిరియాలు నూరుతూ.. రాజకీయాలన్ని ఘాటెక్కిస్తున్నాయి.